'తిరోగమనం!'
(వచన కవిత)
ఆకాశన స్వేచ్ఛగా ఎగిరే పక్షికి తెలియదు..
పంజరంలో బంధీ అయిన
పక్షి విలవిల
స్వతంత్ర దేశంలో
మానవ హక్కులతో
ప్రగతి పథాన ముందుండే వాళ్ళకి తెలియదు..
మత చాంధస భావాలతో కునారిల్లే
జాతి ఒకటుంటుందని
ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ..
నలువైపుల నుంచి తాలిబన్ రక్కసి మూకలు
అధ్యక్ష భవనాన్ని ఆక్రమించి
విందులతో వికటాట్టహాసం చేస్తుంటే..
నిన్నటి దాకా నిర్భీతిగా, నిస్సంకోచంగా..
ఆనందాహ్లాదాలతో సంచరించిన జనం..
ప్రాణాలరచేత పట్టుకొని రహదారులపై పరుగులు పెడుతూ..
విమాన చక్రాలని, రెక్కలని అంటిపెట్టుకొని..
ఎక్కడైనా వాలితే..
బతికుంటే చాలన్న ఆఖరి ఆరాటంతో..
నేల రాలిన ఆకుల్లా
కొంత మంది ప్రాణం విడిస్తే
మరికొంత మంది క్షతగాత్రులైన దృశ్యాన్ని చూసి
ప్రపంచ దేశాలన్నీ విస్తుపోయాయి..
ఐక్యరాజ్య సమితి సైతం..
చేష్టలుడిగి చూస్తుండిపోయింది..
ప్రకృతి భీభత్సం కాదు..
కరోనా కలకలం కానేకాదు..
మానవ బుద్ధికి పుట్టిన చెద సారాంశం..
ఎంత చేసినా, ఏం సాధించినా..
ఆధిపత్య ఆక్రమణకై పడిన (ఆ)పోరాటం
అమానుష చర్యకి అద్దం పడుతోంది..
మాధవుడనుకున్న మనిషి మస్తష్కంలోంచి
రాక్షసుడు పెట్రేగిపోయి..
దారుణ వైపరిత్యాలకి కారణమవుతుంది..
ఇది ప్రజాస్వామ్యం నుంచి
నియంతృత్వానికి తిరోగమనం కాక మరేమిటీ!?!!
(అల్లకల్లోల ఆఫ్ఘనిస్తాన్ ప్రజల పరిస్థితిని దృశ్య వీక్షణం చేస్తూ మూగబోయిన మనసుతో రాసిన కవిత.. అక్కడి ప్రజలకు అక్షర సానుభూతి పరామర్శ.)
---సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.