మహాకవి శ్రీ శ్రీ ...! _కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం

మహాకవి శ్రీ శ్రీ ...! _కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం

మహాకవి శ్రీ శ్రీ ...!
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం

అతడు...!
అంగరంగ వైభోగంగా రాజ వీదుల్లో రాజసంగా
పండిత చర్చా గోష్టుల్లో రసరమ్య రాగంగా
రాజ దర్భారుల్లో రాజ పూజ్య వర్ణమాలలుగా
వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్నీ 
సామాన్యుడి మట్టి వీధుల్లో కి మోసుకొచ్చిన మహర్షి...?
అతడు...!
సాంప్రదాయ ఛందోబద్ధ బందో బస్తుల కవిత్వాన్ని దిక్కరించి
ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం
సమ్మె కట్టిన కూలీల భార్యల బిడ్డల హాహాకారాలు
నవ్య కవితా వస్తువులుగా వదిలిన అస్త్రాలు
మొద్దు నిద్దుర మత్తు ముసుగును పటాపంచలు చేసే
తెలుగు కవిత్వాకాశంలో వేగు చుక్కై 
నవ శకానికి చుక్కానై మహాప్రస్థానానికి రథ చక్రాలతో దారులు వేసిన ప్రజాకవి...!
అతడు...!
అభ్యుదయం విప్లవం నవ్యమైన రూపంగా మార్చి
కష్ట జీవికి అటు ఇటు నిలిచేవాడే కవి అంటూ
పతితుల కోసం బాధా సర్పద్రష్టుల కోసం
విప్లవ శంఖం పూరించి పదండి ముందుకు పదండని 
ఉవ్వెత్తున లేచి గర్జించిన సింహం...!
అతడు...!
లావాలా ఎగసి పడే చైతన్య కవిత్వం
యుద్ధ సంగీతమై నిప్పులు కక్కిన కలం
నెత్తురు మండే పీడిత జన నూతనోత్తేజ  గళం
విశ్వమానవ సంఘర్షణల సముద్ర ఘోషల శబ్ధం ...!
అతడు...!
ఎముకలు కుళ్ళిన యువతను కదిలించే అగ్ని పర్వతం
కంచు కాగడలా కాంతిని విరజిమ్మే క్రాంతి పథం
అతడే... వెంకట రమణయ్య అప్పల కొండల ముద్దు బిడ్డ
తెలుగు కవితా రథసారథి మహాకవి శ్రీ శ్రీ
అతనికివే ..నా అక్షర నీరాజనాలు....!

(శ్రీ శ్రీ వర్ధంతి  15 జూన్ సందర్భంగా)

0/Post a Comment/Comments