తాలిబన్ల అణచివేతను ప్రతి ఘటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు. ప్రపంచ దేశాల మద్దతుతో స్వపరిపాలన పట్ల ఆశాభావం --వడ్డేపల్లి మల్లేశము

తాలిబన్ల అణచివేతను ప్రతి ఘటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు. ప్రపంచ దేశాల మద్దతుతో స్వపరిపాలన పట్ల ఆశాభావం --వడ్డేపల్లి మల్లేశము


తాలిబన్ల అణచివేతను  ప్రతి ఘటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు. ప్రపంచ దేశాల మద్దతుతో స్వపరిపాలన పట్ల ఆశాభావం.

--వడ్డేపల్లి మల్లేశము


    ఒక దేశంలో జరుగుతున్నటువంటి అంతరంగిక వ్యవహారాలు, ప్రభుత్వాల మార్పిడి, ప్రజల ఉద్యమం, ఉగ్రవాదుల దుశ్చర్య లు, ప్రభుత్వ ఆక్రమణ వంటి అంశాల పట్ల ఇరుగుపొరుగు దేశాలతో పాటు సంబంధం ఉన్న ప్రతి దేశం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది.

     ఆ క్రమంలో మధ్య ఆసియా దేశమైన ఆఫ్ఘనిస్థాన్లో ఇటీవల జరిగిన తాలిబన్ల దుశ్చర్య ప్రభుత్వాన్ని ఆక్రమించుకునే వరకు వెళ్లడంతో దేశాన్ని వదిలి అధ్యక్షుడుఆశ్రప్ ఘనీ పారి పోయే దాకా రావడం ఆ దేశ ప్రజల సంక్షేమం రీత్యా ఆందోళనకరమైన విషయమే. ప్రకృతి వనరులు, రత్నాలు ,వజ్రాలు అనేక గను లతో అలరారుతున్న ప్పటికీ పాలనలో స్థిరత్వం లేకపోవడం తాలిబాన్ల ఆటంకాలు కవ్వింపు చర్యలు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల అభివృద్ధికి ఆటంకంగా మారినవి.

    మరొకవైపు సుమారుగా 20 సంవత్సరాలుగా అమెరికా దేశం ఆధిపత్యంలో అమెరికా నాటో సైన్యం నీడలో ఆఫ్ఘన్ ప్రభుత్వం కొనసాగినప్పటికీ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేకుండా అక్కడి ప్రభుత్వాలు స్థానిక ప్రజానీకానికి అంతగా ఏమీ చేయలేక పోయినవి. గతంలో రష్యా కొంతకాలం ఆక్రమించుకోగా ప్రస్తుతం అమెరికా పడగ నీడలో ఆఫ్ఘనిస్తాన్ పరిపాలన అతలాకుతలం అవుతుంటే తాలిబన్లు ఇటీవలి కాలంలో మరింత రెచ్చిపోయి ప్రభుత్వాన్ని గద్దె దించడం ఆందోళనకరమైన విషయం.


     ఆఫ్గాన్ లో కొన్ని పరిణామాలు:-

        తాలిబన్ తీవ్రవాదులు అధ్యక్ష స్థావరాన్ని కూడా చుట్టుముట్టి అణువు అణువు పరిశీలించిన సందర్భంలో ఆత్మరక్షణ కోసం అధ్యక్షుడు దేశాన్ని విడిచి కట్టుబట్టలతో యూఏఈ వచ్చినట్టు స్వయంగా ప్రకటించడం దేశంలో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. 1990 దశకం తర్వాత  తాలిబన్లు ఆప్ఘనిస్థాన్లో మరింత రెచ్చిపోయి క్రమంగా దేశాన్ని స్వాధీనపరుచుకున్న సందర్భంలో చేసిన ఊచకోతకు ప్రధాన సాక్ష్యం నాటి అధ్యక్షుడు మహమ్మద్ najibullah ను ట్రాఫిక్ లైట్కు ఉరివేసి చంపడమే. ఈ విషయాన్ని భద్రతా సిబ్బంది చెప్పడంతో అతను ప్రాణాలు కాపాడుకోవడానికి U. A. E వచ్చినట్లు శాంతిభద్రతల ప్రక్రియ విఫలమైనందుకు వల్లనే తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అధ్యక్షుడుగా తాను అక్కడ ఉంటే రక్తపాతం జరుగుతుందని అందుకే దేశాన్ని విడిచి పారి పోయి రావడానికి ప్రధాన కారణం ప్రజల సంక్షేమమే  అన్న అష్రాఫ్ ఘనీ మాట అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నది.

      1919 ఆగస్టు 19 వ తేదీన బ్రిటిష్ నుండి విముక్తి పొందిన ఆఫ్ఘనిస్తాన్ ఈనెల ఆగస్టు 19న తమ జాతీయ జెండాతో వేలాది మంది కార్యకర్తలు తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు ప్రదర్శనలు నిర్వహించారు. ప్రాణాలకు తెగించి ఎదురునిలిచి స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి ఈ సందర్భాన్ని ప్రజలు వాడుకున్నారు. అయితే ర్యాలీ పైన తాలిబన్లు కాల్పులు జరపడంతో జరిగిన తొక్కిసలాటలో అనేక మంది చనిపోయినట్లుగా తెలుస్తున్నది.

    ఎరుపు, నలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జాతీయ జెండాను కార్లకు కట్టి  కాబూల్లో  మహిళలతో కలిసి ర్యాలి చేసినట్టుగా తెలుస్తున్నది. స్థానిక ప్రజలు మరొక అడుగు ముందుకు వేసి తాలిబన్ల జెండాను చించి పడేసి దాని స్థానంలో జాతీయ జెండాను ఎగుర వేస్తూ తమ ఆత్మగౌరవాన్ని చాటుకోవడం అక్కడి ప్రజలను ఈ సందర్భంగా అభినందించాల్సిన అవసరం ఉంది.


     తాలిబన్ల విధానాలు. ప్రజల  నిరసన:-

    ఇంతకాలం ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా మద్దతు కొనసాగిన ప్రభుత్వం తాలిబన్ల ఆక్రమణతో కోల్పోయిన కారణంగా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి తాలిబన్లు అనేక చోట్ల దాడులకు పాల్పడుతూ  భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో విమానాశ్రయాలలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మరక్షణ కోసం తమ స్వదేశాలకు వెళ్లడానికి విమానాశ్రయానికి వచ్చిన వారిని అడ్డుకోవడం ,ముళ్ళకంచె లతో ఇబ్బందులు కలిగించడం పట్ల పిల్లలు స్త్రీలు ఆందోళన చెందుతున్నారు.

      అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ అమెరికా రష్యా సైనిక బలగాలకు తమ పిల్లలను ముళ్లకంచెలు మీదినుండి   పడవేస్తూ వారినైనా కాపాడండి అని చేస్తున్న ఆర్తనాదాలు ఆఫ్ఘన్లో సర్వత్రా కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలు.

      ఇస్లాంలో చట్టబద్దమైన వ్యవస్థ- షరియా చట్టం

    గతంలో 19 96 నుండి సుమారుగా 2003  లో స్థానిక చట్టబద్ధమైన పరిపాలన ఏర్పడే వరకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలోనే ఉండిపోయింది. వారి పరిపాలనా కాలంలో అనేక అక్రమాలు ,అణచివేత ,ఊచకోత తో పాటు అక్కడ ఉన్నటువంటి బౌద్ధ దేవాలయాలను కూడా ధ్వంసం చేసినారు. మహిళల పట్ల వ్యవహరించే షరియా చట్టాన్ని ఆ కాలంలో కచ్చితంగా అమలు చేసి మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం లేకుండా అణచివేతకు గురి చేసిన అనుభవం ఉంది.

      ప్రస్తుతము తాలిబన్ల చేతిలో పరిపాలన నిజమైతే షరియా చట్టాన్ని అమలు చేసే విషయంలో స్త్రీలకు భరోసా ఇస్తున్నట్లుగా ప్రకటించినప్పటికీ ఆ చట్టంలోని నిబంధనలు కఠినంగా ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్త్రీలు.
 మహిళలు మార్కెట్ కు వెళ్ళిన పురుషుడు లేకుండా వెళ్ళకూడదని, బయటికి వెళ్లి ఇతర పురుషులతో సరదాగా గడపడానికి వీల్లేదని ఇంటికి మాత్రమే పరిమితం కావాలని, స్త్రీలు కళాశాలలు పాఠశాలలకు వెళ్లి చదువుకోవద్దని, ఇంటి వద్ద మాత్రమే  చదువుకోవాలనే కఠిన నిబంధనలు స్త్రీల పట్ల వివక్ష తను తెలియజేస్తున్నవి.

     ఎలాంటి మేకప్ చేసుకోవడానికి వీలు లేదని, సంగీతం నృత్యం చేస్తే గతంలో విధించిన శిక్షలను జ్ఞాపకం చేసుకుంటే గుండె జల్లు మంటుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు బయటకు వెళితే బుర్కా తప్పనిసరిగా ధరించాలని, బిగ్గరగా మాట్లాడడానికి వీలు లేదని, ఎత్తుమడమల చెప్పులు బూట్లు నిషేధించిన తాలిబన్లు నడిచేటప్పుడు శబ్దం వస్తే శిక్షిస్తారు అని తెలుస్తున్నది. తాలిబన్ల పాలనలో మహిళలు ఇంటి లోపలే ఉండాలని ఎవరికీ కనపడకూడదు అని నిషేధించిన వీరు షరియా చట్టాన్ని ఉల్లంఘిస్తే మహిళలను కొరడాతో కొట్టడం రాళ్లతో కొట్టి చంపడం బహిరంగంగా ఉరి తీయడం వంటి కఠినమైన శిక్ష విధిస్తారని తెలుస్తున్నది. కారణం గతంలో వీరి పరిపాలనా కాలంలో ఇలాంటి కఠినమైన శిక్షలు విధించారు కనుక.


     ఉపాధ్యక్షుడు సలెహ్ ఆధ్వర్యంలో తిరుగుబాటు:-

        ఒక వైపు దేశ వ్యాప్తంగా ప్రజలు తమ స్వాతంత్ర కాంక్ష వ్యక్తం చేస్తూ తిరుగుబాటు నిరసన కార్యక్రమాలతో  తాలిబన్ ల ఆలోచింప చేస్తుంటే మరొకవైపు తనకుతానే దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్న  ప్రస్తుత ఉపాధ్యక్షుడు సలెహ్ తన స్వస్థలం తో పాటు కొన్ని ప్రాంతాలలో ఆప్ఘన్ సైన్యం సహకారంతో స్థానిక తిరుగుబాట్లను నడిపిస్తున్నట్లు గా తెలుస్తున్నది.

      తాలిబన్లు ఆక్రమించుకోవడం ఏ స్థాయిలో జరిగిందో అదే స్థాయిలో దేశంలో ప్రజల కొన్ని ప్రాంతాలలో సైనిక తిరుగుబాటు కూడా జరగడం ఆ దేశంలో తిరిగి స్వపరిపాలన పట్ల ఆశాభావం పెరుగుతున్నది. ఇదే క్రమంలో ఐక్యరాజ్యసమితి తో పాటు ప్రపంచ దేశాలు కూడా అక్కడి ప్రభుత్వానికి సహకారాన్ని, నైతిక మద్దతు అందిస్తే  ఇది సాధ్యం కావచ్చు. తాలిబన్ లు ఆక్రమించుకునే క్రమంలో కనీసమైన ప్రతిఘటన కూడా సైన్యం నుండి రాకపోవడాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా భావిస్తున్నవి. మరొకవైపు తాలిబన్లు అమెరికా తో పాటు మిగతా కొన్ని దేశాల సిబ్బంది, సైన్యాన్ని అంటి ముట్టనట్లు ఉండడంలో అంతర్గత ఒప్పందాలు ఏమైనా ఉంటాయేమోనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా స్థానిక ప్రజలు, అక్కడ సైన్యం చేస్తున్న పోరాటాలు విజయవంతం కావాలని సర్వమానవాళికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వగలిగే నూతన ప్రభుత్వం ఏర్పడాలని మనసారా కోరుకుందాం.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)

0/Post a Comment/Comments