తెలంగాణ పితామహుడు --శ్రీలతరమేశ్ గోస్కుల హుజురాబాద్.

తెలంగాణ పితామహుడు --శ్రీలతరమేశ్ గోస్కుల హుజురాబాద్.

అతని మాటల మమకారాన్ని జూసిన 
తెలంగాణ నేలతల్లి మురిసిపోయెనెంతగానో...

అతడు నడిచిన దారుల్లో ఎగిసిపడిన ధూళి 
నవచైతన్యపు బలాన్ని పుంజుకుని..
కెంజాయి వర్ణంలో కొట్టిన కేరింతలెన్నో ..

వనరులెన్నో మాకున్నాయ్..
మా అధికారం మాక్కావాలంటూ..
ఉద్యమానికి గొంతెత్తి గల్లీల నుంచి ఢిల్లీయే కాదు 
ఖండాంతరాలదాకా వినిపించిన తెలంగాణ సిద్దాంతకర్త గొంతుకది..

పోరాట పఠిమనెంతో గలిగి
నిత్యశోధనలతో నిరంతర విద్యార్థియై..
విశాలాంధ్రను ఎండగట్టిన ధీశాలి ఆజన్మంతపు బ్రహ్మచారినే..

తెలంగాణోద్యమానికంకితమై నవయుగ భీష్ముడిగా నిలిచిన మేథావి..
బహుభాషా సంపన్నుడు మాత్రమే కాదు మేటి గుణసంపన్నుడు కూడా...
మార్గదర్శక సలహాలనందించి..
మేలైన దారులలో పాలకులను సైతం నడిపిన తెలంగాణ పితామహుడు..

కమ్ముకున్న కారుచీకట్లను తరిమి
తల్లడిల్లుతున్న తల్లిని కాపాడాలని
వదలని అభ్యుదయవాదాన్ని భుజానేసుకుని..
కలలు కన్న తెలంగాణాను
కండ్లారా చూడాలంటూనే..
తీరని కలతో కండ్లు మూసిన మహనీయుడు
నేటికీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో పదిలమై నిలిచిన..
మహోన్నత తేజోమూర్తుడు మన ఆచార్య జయశంకరుడు..

శ్రీలతరమేశ్ గోస్కుల
హుజురాబాద్.

0/Post a Comment/Comments