మల్లెలు తెచ్చిన తంట -సత్య

మల్లెలు తెచ్చిన తంట -సత్య


మల్లెలు తెచ్చిన తంట   
                                   -సత్య


"ఏవండీ..... ఏవండీ.... ఎక్కడా? కాఫీ అడిగారు ఇంతేలోనే ఇలా పెరట్లో ఏం చేస్తున్నారు?"
అడిగింది భాగ్యం భర్త సుందరాన్ని.

"ఆ...అది..అది.. హ..ఇదిగో ఈ మల్లెలు కోసి నీ జడలో తురుముదామని". భార్య భాగ్యం బుగ్గమీద చిటికేస్తూ... తడబాటుని కనపడనీయకుండా అన్నాడు సుందరం.

"పొదురూ...మీరు మరీను.. ఏంటిది వేళా పాళా లేకుండా ఆరు బైట. ఇదిగో కాఫీ తీస్కోండి." అని కాఫీ కప్పు భర్త చేతిలో పెట్టీ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ... సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. "హమ్మయ్య... సమయానికి ఈ మల్లె చెట్టు రక్షించింది నన్ను. ఇప్పుడు చచ్చినట్టు ఈ పూలన్నీ కోసివ్వాలి..." అని గొనుక్కుంటూ పువ్వులు కోసి లోపలికి తీస్కెళ్లాడు సుందరం.

పడక గది లో.... తల కింద చేతులు పెట్టుకుని మాగన్ను నిద్రలో ఉన్న సుందరం పక్కనే భాగ్యం అతను కోసిచ్చిన మల్లెలు మాల కట్టుకుని, అపురూపంగా సింగారించుకుని "ఏమండీ...!!" గోముగా పిలిచింది... మల్లెల వాసన మత్తుగా అనిపించింది సుందరానికి. కళ్ళు తెరవకుండానే "హా..చెప్పు బంగారు..!!" అన్నాడు. అబ్బో.. భాగ్యం ఆనందానికి అవధులు లేవు. "నేనంటే మీకు ఎంత ఇష్టమో చెప్పండి." అంది సిగ్గుపడుతూ...

"ఎంత ఇష్టమంటే ఎలా చెప్తాను కాంతం... ఆవలి ఒడ్డు తెలీని సముద్రం అంత... అంతెక్కడో తెలీని ఆకాశమంత.... మా పెరట్లో బొండుమల్లెల పరిమళమంత.... ఇవన్నిటికంటె కూడా మా ఆవిడ కంటే కూడా నువ్వే నా ప్రాణం కాంతం." అన్నాడు కళ్ళు ముసుకుని మైమరపులో ఉన్న సుందరం.

ఇంతలోనే...."హా...... అబ్బా....!!!" అన్న సుందరం ఆర్తనాదం. ఏం జరిగిందో నేను చెప్పాలా.....??? 

0/Post a Comment/Comments