బడిలో నే ఆటలకు శ్రీకారం కావాలి....పాతకాల వేటలో అదే కీలకం --ఉమారాణీ వైద్య

బడిలో నే ఆటలకు శ్రీకారం కావాలి....పాతకాల వేటలో అదే కీలకం --ఉమారాణీ వైద్య

బడిలో నే ఆటలకు శ్రీకారం కావాలి....పాతకాల వేటలో అదే కీలకం
ఉమారాణీ వైద్య
అంగన్వాడీ టీచర్
లింగాపూర్, కామారెడ్డి


*చరిత్రలో తొలిసారి ఒలింపిక్‌ క్రీడల అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకం సాధించి నీరజ్‌ చోప్రా దేశాన్ని ఆనందడోలికల్లో ముంచెత్తాడు. వెయిట్‌లిఫ్టర్‌ చాను, రెజ్లర్లు రవి దహియా, బజరంగ్‌ పూనియా, బాక్సర్‌ లవ్లీనా, మన సింధు పతకాలు పట్టుకొచ్చారు. కాంస్య పతకంతో జాతీయ క్రీడ హాకీ మురిసింది. మహిళల హాకీ జట్టు, గోల్ఫ్‌ వ్యక్తిగత పోరులో అదితి పతకం కోసం తుదికంటా పోరాడారు. ఇదీ విశ్వక్రీడా యవనికపై మన సత్తా. 135 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్‌ అథ్లెటిక్స్‌లో ఒక్క పతకం కోసం 120 ఏళ్లుగా ఎదురుచూసిందంటే లోపం ఎక్కడుంది? ఒలింపిక్స్‌లో 1920 నుంచి పాల్గొంటున్న మనకు వచ్చింది మొత్తం 35 పతకాలు. 10 స్వర్ణాలు వస్తే అందులో ఎనిమిది హాకీవే. వ్యక్తిగత విభాగంలో వచ్చినవి కేవలం రెండంటే రెండు బంగారు పతకాలు. టోక్యోలో సాధించిన ఏడు పతకాలే మనకు ఒక ఒలింపిక్స్‌లో అత్యధికం. అమెరికా బంగారు చేప మైకేల్‌ ఫెల్ప్‌ ఒలింపిక్‌ ఈత కొలనులో కొల్లగొట్టిన మొత్తం పతకాలు 28. అతడు గత 16 ఏళ్లలో ఈ ఖ్యాతి సాధించాడు. మనకంటే 80 ఏళ్లు ఆలస్యంగా ఒలింపిక్‌ పోటీలకు వచ్చిన చైనా 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌ నుంచి తాజా టోక్యో పోటీల వరకు పతకాల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలుస్తోంది. 2008లో అగ్రాసనాన్ని ఆక్రమించిన డ్రాగన్‌- టోక్యోలో రెండోస్థానం దక్కించుకుంది. కేవలం నాలుగు లక్షల్లోపు జనాభా ఉన్న కరీబియన్‌ దేశం బహమాస్‌ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు ఆరుసార్లు పసిడి ముద్దాడింది. హైదరాబాద్‌ కంటే తక్కువ జనాభా ఉన్న హంగరీ 20 పతకాలు సాధించింది.*


*చివురించిన ఆశలు*

*టోక్యో ఒలింపిక్స్‌ భారత్‌లో క్రీడల భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించాయి. బాక్సింగ్‌, రెజ్లింగ్‌, బ్యాడ్మింటన్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌లో మాత్రమే గత 20 ఏళ్లుగా పతకాలు వస్తున్న మన జట్టుకు ఈసారి చాలా క్రీడాంశాల్లో ఆశావహ దృక్పథం ఏర్పడింది. హాకీలో పురుషులు, మహిళల జట్లు చూపిన ప్రతిభతో జాతీయ క్రీడకు మళ్ళీ పూర్వవైభవం దిశగా బలమైన అడుగులు పడ్డాయి. మనకు పెద్దగా పరిచయమే లేని ఫెన్సింగ్‌, గోల్ఫ్‌ల్లో మనవాళ్లు స్ఫూర్తిదాయక విజయాలు సాధించారు. నీరజ్‌ చోప్రా సాధించిన స్వర్ణం అథ్లెటిక్స్‌లో మనకు బంగారు భవిష్యత్తు ఉందని చాటుతోంది. ఒలింపిక్‌ పతకం తీసుకురాగల స్థాయి అథ్లెట్లను గుర్తించి, వారికి అవసరమైన మౌలిక వసతులు సమకూర్చేందుకు, అవసరమైతే విదేశాల్లో శిక్షణ ఇప్పించేందుకు 2014లో ప్రధాని నరేంద్రమోదీ చొరవ చూపారు. ఫలితంగా 'టాప్‌ (టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం)' పథకం రూపుదిద్దుకొంది. జావెలిన్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌ చోప్రాకోసం ఇలా దాదాపు రూ.4.85 కోట్లు ఖర్చు చేశారు. రజత పతక విజేత మీరాబాయి చానుకు 50 రోజుల విదేశీ శిక్షణకే రూ.40 లక్షలు వెచ్చించారు. గతంలో సింధు సైతం 'టాప్‌'లో లబ్ధిదారే. ఓ దశలో పూర్తి ఫామ్‌ కోల్పోయి ఆత్మవిశ్వాసం అట్టడుగుకు చేరిన హాకీ జట్టుకు స్పాన్సర్లే దొరకని దుస్థితిలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ముందుకొచ్చి 100 కోట్ల రూపాయల స్పాన్సర్‌షిప్‌ అందించారు. అది జట్టును పతకాలు తెచ్చే స్థాయికి చేర్చింది.*


*చైనా తరహాలో పాఠశాల స్థాయి నుంచే ఔత్సాహిక ఆటగాళ్లను వెలికితీసి వారిని మెరికల్లా తీర్చిదిద్దే విధానం ఇండియాలో కరవైంది. 2019 నాటికి దేశ జనాభాలో 14 ఏళ్లలోపు పిల్లలు 34 కోట్లు. వీరిలో కొన్ని లక్షల మంది ఔత్సాహిక క్రీడాకారులున్నారు. వారిని చిన్నప్పటి నుంచే క్రీడల్లో ప్రోత్సహించాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న 'ఖేలో ఇండియా' పథకాన్ని మరింత విస్తృతపరచాలి. 2020-21 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం క్రీడా రంగానికి కేటాయించిన మొత్తం రూ.2,827 కోట్లు. ఇందులో జాతీయ క్రీడాభివృద్ధి నిధికి విదిల్చింది కేవలం రూ.50 కోట్లే. ఈ మాత్రం నిధులతో దేశంలో క్రీడాభివృద్ధి ఎలా సాధ్యమో ప్రభుత్వానికే తెలియాలి. హరియాణా, పంజాబ్‌ లాంటి క్రీడలంటే ప్రాణం పెట్టే రాష్ట్రాలు మాత్రమే తమ క్రీడాకారులకు వీలైనంత సాయం చేస్తున్నాయి.*


*ప్రక్షాళన అవసరం*

*క్రీడాభివృద్ధి సంస్థలను, ఆయా క్రీడా సంఘాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి, అర్హత లేకున్నా ఆశ్రితులతో వాటిని నింపేస్తున్నారు. ఆట గురించి ఏ మాత్రం అవగాహన లేని ఇలాంటి క్రీడాసంఘాల పెద్దలు బంధుప్రీతి, పక్షపాతంతో దేశంలో క్రీడలను పాతాళంలోకి తొక్కేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు! క్రీడా సంఘాలను ప్రక్షాళించాల్సిన అవసరం నేడెంతో ఉంది. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌లాగే క్రీడలు కూడా ఒక వృత్తేనని తల్లిదండ్రులు గుర్తెరగాలి. పీవీ సింధుకు తల్లిదండ్రుల నుంచి అలాంటి ప్రోత్సాహం లభించింది కాబట్టే- ఆమె వరసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు అందించే స్థాయికి ఎదిగారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన తరవాత ప్రభుత్వాలు ఆయా క్రీడాకారులపై కోట్లు గుమ్మరిస్తున్నాయి. దానికి బదులు ముందు నుంచే క్రీడాకారులకు ఆర్థికంగా అండగా నిలిచే దీర్ఘకాలిక వ్యూహం ఎంతో ముఖ్యం. ఒలింపిక్స్‌లో రెండంకెల పతకాలు సాధించాలని కోట్లాది ప్రజలు కంటున్న కలలను పకడ్బందీ ప్రణాళికతో సాకారం చేసుకోవడం అసాధ్యమేమీ కాదు.
   

0/Post a Comment/Comments