బరువెక్కిన బ్రతుకులు -- దొడ్డపనేని శ్రీ విద్య

బరువెక్కిన బ్రతుకులు -- దొడ్డపనేని శ్రీ విద్య

బరువెక్కిన బ్రతుకులు

నిలువ నీడ లేక స్వేదం చిందించే బ్రతుకులు
మండు టెండలో గొంతు తడారి పోయిన బ్రతుకులు
పేదరికం శాపమై రెక్కలు ముక్కలైన బ్రతుకులు
గుడ్డి దీపం క్రింద చీకటి వెలుగుల బ్రతుకులు

బండ రాళ్ళను పిండి చేసే పచ్చడి మెతుకుల బ్రతుకులు
ఆకలి అరుపులతో పేగులు ఎండి పోతున్న నిర్థాక్ష్యపు బ్రతుకులు
కలిసి రాని కాలంలో పోరాడుతున్న బడుగు బ్రతుకులు
సామాజిక రక్షణ తో ప్రభుత్వ పథకాల కోసం అర్రులు చాచే బ్రతుకులు

పూటకి తిండి దొరికితే చాలని ఎదురు చూపుల బ్రతుకులు
తన వారి కన్నీరుని తుడవలేని నిరర్థక బ్రతుకులు
ఎదగటానికి సాయం కోసం ఎదురు చూసే ఎడారి బ్రతుకులు
కోరికల సుడిగుండంలో ఆశల ఉప్పెనలు కమ్మే బ్రతుకులు

బరువెక్కిన గుండెలో మది గాయాల తడి బ్రతుకులు
ఊహలకందని తీరాలలో ఆశల వలలు రేపే బ్రతుకులు
అలుపెరగని దూర తీరాలకు మనిషిని నడిపించే  రాతి బ్రతుకులు

కాళ్ళు, కడుపులు కాలిపోతుంటే రాలిపోయే నెత్తుటి బ్రతుకులు
ఆరోగ్య సమస్యలతో శిబిరాల్లో చిక్కుకున్న నిరుపేద బ్రతుకులు
దాతలు ముందు కోస్తే గాని దారి తెలియని పేద బ్రతుకులు
భూస్వాముల దౌర్జన్యానికి బలవుతున్న రైతన్నల కన్నీటి బ్రతుకులు

చదువు సంధ్యలు అటకెక్కుతున్న కీలు బొమ్మల బ్రతుకులు
మారే దెప్పుడు....
తీరం చేరే దెప్పుడు!

-- దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ


0/Post a Comment/Comments