కుందేలు ఉపాయం (బాల సాహిత్యం: చిట్టి కథ)

కుందేలు ఉపాయం (బాల సాహిత్యం: చిట్టి కథ)


కుందేలు ఉపాయం


అనగనగా ఓ కాకి. అది చాలా ఆకతాయి గా ప్రవర్తిస్తుండేది. ఒక సారి ఏనుగు నిదుర పోతుంటే దానితలపై రెట్టలు వేసింది. ఏనుగు లేచి తిరుగుతుంటే సున్నం వేసినట్టు తలంతా తెల్లని మరకలు.

అడవిలో జంతువులు ఒకటేనవ్వు.

ఆ దృశ్యం చూసి కాకి చెట్టుకొమ్మల్లో కిసుక్కున నవ్వుకొనేది. ఇలా అందరినీ ఎదోలా ఆట పట్టించేది.దాని బాధ ఆ అడవిలో మృగరాజుకూ తప్పలేదు. ఎలాగైనా ఈఆగడాలు కట్టించాలనుకుంది సింహం..........జంతువులన్నీ ఒక రోజు సమావేశం ఏర్పరచుకున్నాయి. అందులోకి ఆకతాయి కాకిని మినహా , అందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కుందేలుకు ఒక ఆలోచన తట్టింది. "రాజా! నా దగ్గర ఒక ఉపాయం ఉంది చెప్పమంటారా" అంటుంది కుందేలు, సింహం తోటి. 

"సరే ఏమి పర్వాలేదు, చెప్పు" అని అంటుంది, సింహం. 

"ఎలాంటి సమస్యలైనా, కలసి మాట్లాడు కుంటే , ఇట్టే పరిష్కారమవుతాయి అంటారు. అందుకని, కాకికి ప్రీతి కరమైన వారితోనే మాట్లాడించి పరిష్కరించవచ్చు" అని సలహా ఇస్తుంది, కుందేలు.
సామదానభేద దండోపాయాలు ఎలాగో ఉన్నాయి కదా, "సరే, అలానే చేద్దాం కానివ్వు", అంటుంది సింహం, ఏనుగు మిగిలిన జంతువులు కూడా.

ఇప్పుడు కాకికి ఇష్టమైన వారు నమ్మకమైన వారు, ప్రీతికరమైన వారు ఎవరుమరి అని ఆలోచిస్తుండగా, కుందేలు చెబుతుంది, "కోకిల" దానికి యిష్టమైనది అని.

ఈ విషయం "కోకిల" కు చెబుతారు. సరే అని "కోకిల" ఈ సమస్యను తన భుజస్కంధాలపై వేసుకుని, కాకి వద్దకు వెళ్ళి," చూడు కాకి, మనమందరం ఒకే జాతి పక్షులం, మూగ జీవులం, ఒకరికొకరం సహాకరంతో బ్రతికే వాళ్ళం. మన జీవిత కాలం కూడా చాలా తక్కువ. మనం పోయేటప్పుడు, అన్నీ ఇక్కడే వదిలి పెట్టి పోతాం. మనకు చివరకు మిగిలేది మనం చేసిన మంచి పనులే,శాశ్వితంగా ఉండి పోతాయి, ఇలా నీవు ఆకతాయిగా ఏనుగు, సింహాలపై రెట్టలు వేయడం సరికాదు, వారు చాలా బాధతో, కోపంతో ఉన్నారు" అని వేదాంత ధోరణిలో చెబుతుంది.

కాకి కూడా కోకిల చెప్పిన  విషయాలనన్నిటిని సావధానంగా విని అర్ధం చేసుకుంటుంది. తన తప్పు తెలుసుకుంటుంది. ఇక నుండి నేను వేటిపైనను ఆకతాయిగా రెట్టలు వేయను అని మాట యిస్తుంది. తన పొరపాటుకు, క్షమాపణలు చెబుతుంది.

ఇదే విషయం, కోకిల, కాకిని వెంట తీసుకుని వచ్చి సింహా రాజుకు తెలుపుతుంది. సమస్య సులువుగా పరిష్కారమైనందులకు, అందరూ చాలా సంతోషిస్తారు.

- మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments