అజరామరం..'తెలుగు!' ---సుజాత.పి.వి.ఎల్.

అజరామరం..'తెలుగు!' ---సుజాత.పి.వి.ఎల్.


అజరామరం..'తెలుగు!'

మన తెలుగు భాష ప్రాచీన భాష. 'దేశభాషలందు తెలుగులెస్స' అని శ్రీ కృష్ణరాయలు వారు తెలుగు ప్రాశస్త్యము గురించిపొగిడారు. తేనెలూరు తెలుగు భాష ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల అధికారిక భాష. 

తెలుగు భాష ద్రవిడ భాషల్లో ఒకటి. 2008 లో మన మాతృ భాష అయిన తెలుగు భాషకి మిగతా భాషలైన సంస్కృతం కన్నడ తమిళ భాషలకు భారత ప్రభుత్వం 'ప్రాచీన భాష' హోదాను కల్పించింది. 

తెలుగుభాష క్రీ.పూ 5, 4 శతాబ్దం అనగా 2500-2400 ఏళ్ళ క్రితం ద్రావిడ భాషల్లో నుండి విడిపోయి స్వతంత్ర భాషగా ఏర్పండింది.. 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్' గా విశేష జనాదరణ పొందింది మన తెలుగు భాష.  

అజంతా భాషైనా తెలుగు భాషని మాట్లాడే వారి సంఖ్య దేశవ్యాప్తంగా అత్యధికమనే చెప్పాలి. నేడు 90% ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు. ఇంతమంది ఇష్టంగా మట్లాడే తెలుగు మన మాతృభాష కావడం ఎంతో అదృష్టం, ఆనంద దాయకం. తెలుగు పలుకు, బడి, నుడి, నానుడి వినసొంపుగా ఉంటుంది. 

సామాన్య ప్రజానీకం కూడా కవిత్వ ధోరణిలో తెలుగును తెగ మెచ్చుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే, యాస ఏదైనా భాష ప్రధానం కాబట్టి తెలుగు సాహిత్యం, తెలుగు కళలు, తెలుగు సంస్కృతి సరిహద్దులు దాటి విస్తరిస్తోందని చెప్పొచ్చు. 

భాషాసాంస్కృతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు, అవగాహన పొందేందుకు ప్రతి సంవత్సరం ఆగష్టు  29 న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 

శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషకి  గిడుగు రామ్మూర్తి గారు పెద్ద పీట వేశారు. తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకు వచ్చి నిత్య వ్యావహారిక భాషలో ఉన్న తెలుగు అందాల్నీ, సొబగుల్నీ తెలియజెప్పిన మహనీయుడు. తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు.  

భాష ఏదైనా కన్నతల్లి తో సమానం. మనం మన తల్లిని ఎంత గౌరవిస్తామో, మన భాషని కూడా అంటే గౌరవించాలి. ఎవరి భాష వారికి గొప్పది. ఏ భాషనైనా ఏ యాసైనా తక్కువ చేసి మాట్లాడకూడదు. మన తెలుగు భాషకి చాలా గొప్ప చరిత్ర ఉంది. 

ఆంగ్లం కన్నాఎక్కువ అక్షరాలు, శబ్దాలు, పదాలు మన తెలుగులోనే ఉన్నాయి. పలికే విధానాన్ని బట్టి ఎదుటివారికి మన భావంవ్యక్తపరచ గలిగే ప్రత్యేకం కేవలం మన భాషకే సాధ్యం. ఎన్ని ఇతర భాషలు నేర్చుకున్నా, అమ్మ భాషలోనే సంభాషించుకోవడం వల్ల భాష గొప్పతనం, భాషలోని తియ్యదనం తెలుస్తుంది. అప్పుడు తెలుగు భాషాభిమానులు మరింత పెరిగే అవకాశముంది. తెలుగు భాష అంతరించి పోకుండా చరిత్రలో కలకాలం నిలిచిపోయే అవకాశముంది. 

-సుజాత.పి.వి.ఎల్. 

సైనిక్ పురి, సికిందరాబాద్. 




0/Post a Comment/Comments