అప్పుడు తెలియలేదు --- కొత్తపల్లి రవి కుమార్

అప్పుడు తెలియలేదు --- కొత్తపల్లి రవి కుమార్

అప్పుడు తెలియలేదు

కడుపులో నిన్ను మోస్తున్నప్పుడు, 
నువ్వు నీ చిట్టి చేతులతో గుద్దినప్పుడు తెలియలేదు ఆ పిచ్చి తల్లికి,
బయటకొచ్చి కసాయివై తన కడుపుమీద కొడతావని!

ఆకలేసి నువ్వు ఏడుస్తున్నప్పుడు, 
తన స్తనాన్ని నీ బోసి నోటికి అందించినప్పుడు అనిపించలేదు ఆ మాలోకానికి,
పెరిగి అచ్చోసిన ఆంబోతువై తన రొమ్మును పొడుస్తావని!

గుండెల మీద నిన్ను ఆడిస్తున్నప్పుడు, 
నువ్వు నీ చిన్ని కాళ్ళతో తన్నినప్పుడు తెలియలేదు ఆ వెర్రి నాన్నకి,
ఎదిగి రెండు కాళ్ళ పశువై తన గుండెల మీద తన్నుతావని!

తన రెక్కలను ఆయుధాలుగా చేసి, 
చెమటను ఇంధనంగా మార్చి నిన్ను వృద్ధిలోనికి తెచ్చినప్పుడు తెలియలేదు ఆ తింగరి తండ్రికి,
రెక్కలిప్పిన విహంగంలా ఆకాశానికెగిరి భూమ్మీదనున్న తనను గాలికొదిలేస్తావని!

నీ గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి, 
తాము లెక్కలేని పస్తులున్నప్పుడు తెలియలేదు ఆ అయోమయ అమ్మానాన్నలకి,
కాలే తమ కడుపులు చూసి రెండు ముద్దలు కూడా పెట్టవని!

కంటికి రెప్పలా, అల్లారుముద్దుగా , 
నువ్వే తమ ప్రాణంగా పెంచి పెద్దచేసినప్పుడు తెలియలేదు ఆ మతిలేని  దంపతులకి,
ముసలి వయసులో తమను నడిరోడ్డుమీద అనాధుల్లా వదిలిపెడతావని!

---- కొత్తపల్లి రవి కుమార్
      రాజమహేంద్రవరం
      9491804844

0/Post a Comment/Comments