శిథిలమైనావు... -- బండి చందు, గ్రా: రామంచ, జి: సిద్దిపేట.

శిథిలమైనావు... -- బండి చందు, గ్రా: రామంచ, జి: సిద్దిపేట.

తెలుగు భాష దినోత్సవం సందర్భంగా

శిథిలమైనావు...

అర్ధరాత్రి అక్షరాలు నడిరోడ్డుపై నెత్తురోడుతున్నాయి
తాగినపుడో తనివితీరా కోపం వచ్చినప్పుడో
అర్దాంతరంగా అవసరమై బయటపడుతుంటావు
తల్లి పాల వంటి నిన్ను తక్కువ చేసినారు
ఓంకారమంటి తేజస్సు నీది
ఒక్కటై ఓటమి తలపెట్ట తలచినారు
గండపెండేరాల అలంకరించుకున్న నిన్నే
మత్తగజపు ఘీంకరాలతో భయపెట్ట చూసినారు
సన్మాన సభలలోనో వివాహ వ్యవస్థలోనో
విధిలేక చావు ముంగిటిలోనో 
నిన్ను పోషిస్తుంటారు ఈ పండిత ప్రభంజనం
నీ ఒడిలో ఎదిగి ఎగిరిపోయిన పక్షులన్నీ
రెక్కలకై తిరిగి నీ యదగూటికే చేరాలి
కృష్ణదేవరాయల భువన విజయం నేడు 
భుక్తి లేక గతాన్ని తలచి బెంగటిల్లినది
సరస్వతీ పుత్రులంతా సందిగ్దాన పడి
నీ సన్నిధి మరిచే కాలం ఆసన్నమైనది
సప్తస్వరాలను నిండా నింపుకున్న నీవు
నోరుండి మాటరాని మూగదానివైనావు
గతించిన గత కాలమంతా చరిత్రే
ఆ చరిత్రను లిఖించిన నీవు శిథిలమైనావు
ఒకప్పటి తేనెలొలుకు నా భాషకి
నేడు అంత చేదు ఎలా వచ్చేనో మరి...


పేరు: బండి చందు
గ్రా: రామంచ జి: సిద్దిపేట
చరవాణి: 8978438165

0/Post a Comment/Comments