అ అంటే అమ్మఆ అంటే ఆవు --హరీశ్ బాబు సాక

అ అంటే అమ్మఆ అంటే ఆవు --హరీశ్ బాబు సాక

తెలుగు భాషా దినోత్సవం 
ప్రత్యేక వ్యాసం

అ అంటే అమ్మ
ఆ అంటే ఆవు 
అమ్మ వంటిది ఆవు ....అంటూ
కమ్మని తెలుగు ప్రతి నోట పలకాలని మన తెలుగు రాష్ట్రాలు ఉబలాటపడుతూ ఉంటాయి. కానీ,కమ్మని తెలుగు ... పరభాషల ప్రాభవం కింద ..సవతి తల్లి ప్రేమలా తెలుగు ప్రతిక్షణం నిరాదరణకు లోనవుతూనే ఉంది.ఆంటీ ల మాటున  అమ్మ అనుక్షణం అపహేళనకు గురి అవుతూనే ఉంది. అనధికారంగా అధికార భాష గా" ఆంగ్లం" రాజ్యమేలుతూనే ఉంది. ప్రభుత్వ ఆఫీసులో అణువణువునా తన రాజసాన్ని చూపుతూనే ఉంది.విద్యార్థులకు బాల్య దశలో వారు చేసే భాషా తప్పులను సరి చేయక, భాషా బోధనలో నిష్ణాతులు  కానివారు,వారికి మసి పూసి మారేడు కాయ చేసి .. బాల్యంలోనే మాతృ భాష మరింత భారం చేస్తున్నారు.అక్షరాలు, పదాలు, వాక్యాల పై పట్టు సాధించకుండా  తెలుగులో  అమ్మ అనే పదాన్ని Amma అని ఇంగ్లీష్ లోకి మార్చి నేర్పుతూ,  మాతృ భాష మమకారాన్ని దూరం చేస్తున్నారు. ఇక ఇది..ఒక ఎత్తయితే తెలుగు మాట్లాడే వారిపై పనిష్మెంట్ రూపంలో  మెడలో పలకలేసి హేళనకు గురి చేస్తూ.. ఆ పసి హృదయాలను బలవంతంగా అమ్మ అమృతపు ధారలు స్వీకరించకుండా ఇంగ్లీష్ పాల డబ్బాలకు అలవాటు పడేలా చేస్తూ, మన కళ్ళను మనమే పొడుచుకొనేటట్లు  చేస్తున్న సంఘటనలు కోకొల్లలు.
 మాతృభాష తప్పనిసరి అని అధికరణలు అధికారులు ఎంత మొత్తుకున్నా మెత్తగా కార్పోరేట్ సంస్థల కింద అనుక్షణం తెలుగు మధన పడుతూనే ఉంది.
ఇక, ఈ మధ్యనే  మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్ "వారు తేదీ 23/08/2021 నాడు అవుట్సోర్సింగ్ JL పోస్టులకు సంబంధించి పరీక్షలు నిర్వహించారు.ఇందులో తెలుగు పోస్ట్ కు PG తో పాటు బి.ఇడి ఉన్న వారిని మాత్రమే పరీక్ష కు అనుమతించి,PG తో పాటు"తెలుగు పండిట్ ట్రైనింగ్" చేసిన వారిని అనర్హులుగా భావించి రిజెక్ట్ చేసి పరీక్షలు  రాయనివ్వలేదు 
 గతంలో,కాంట్రాక్టు/అవుట్సోర్సింగ్ పరీక్షలకు TPT ని B.Ed కి సమానంగా చూసిన వారు,ఇప్పుడు ఎందుకు పరీక్షలకు రిజెక్ట్ చేస్తున్నారో  అంతుపట్టడం లేదు.
అన్ని  గురుకుల సొసైటీ వారు నిర్వహించే తెలుగు పోస్ట్ కు T.P.T వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రత్యేకంగా తెలుగు పండిత్ చేసిన వారు తెలుగును బోధించడానికి అనుమతించక పోతే..మన ఉనికిని మనం కోల్పోయిన వాళ్ళమౌతాము.
ఉపాధ్యాయ పరీక్షల్లో... భాషాబోధన విషయం లో తెలుగు పండితులకు ప్రత్యేక స్థానాన్ని ఇవ్వాలి..ఇకనైనా అధికారులు స్పందించి తెలుగు పండిట్ చేసిన వారిని అన్ని    కాంపిటేషన్స్ పరీక్షలలో అనుమతించి.. తెలుగు భాషా అభ్యున్నతికి పాటు పడాలని కోరుకుంటున్నాం.

తెలుగులోనే మాట్లాడుదాము..!
తెలుగు భాషను కాపాడుకుందాం...!!


వ్యాసకర్త✍️
హరీశ్ బాబు . సాక
అమర చింత మండలం
వనపర్తి.జిల్లా
తెలంగాణ
సెల్ 9493603594



0/Post a Comment/Comments