మరచిపోకు అమర వీరుల త్యాగాలు ---- కొత్తపల్లి రవి కుమార్

మరచిపోకు అమర వీరుల త్యాగాలు ---- కొత్తపల్లి రవి కుమార్

మరచిపోకు అమర వీరుల త్యాగాలు....

పల్లవి:
మరచిపోకు అమర వీరుల త్యాగాలు,
మరుగున పడేయకు సాహసోపేత పోరాటాలు!
వారు చిందించిన రక్త తర్పణాలే ఈనాటి నవీన భారతానికి దర్పణాలు,
వారు వదిలిన ‌ప్రాణార్పణాలే సాఫీగా సాగుతున్న జీవన మనుగడకు తార్కాణాలు!!
           
చరణం -1:
వివేకానందుని వివేక వచనాలు, అంబేడ్కర్ ఆలోచనా పరమైన ఉపన్యాసాలు,
మనది కాని గడ్డ మీద భారతీయతను చాటి చెప్పిన ప్రధములు!
పటేల్ పిడుగుల్లాంటి గర్జనలు, తిలక్ తిరుగులేని ప్రహరణాలు,
ముష్కరుల గుండెల్లో నిద్రపోయిన అత్యంత సాహస వీరులు!!                                          ||మరచిపోకు||

చరణం -2:
సుభాష్  రగిలించిన ఆగ్రహపు జ్వాలలు, ఆజాద్ చేసిన  అలుపెరగని సమరాలు,
శత్రువుల గుంపులను మూకుమ్మడిగా మట్టుపెట్టిన ధైర్యశాలులు!
ఆంధ్ర కేసరి ఎదురొడ్డిన గుండెలు, మౌలానా నడిపించిన తిరుగుబాటు ఉద్యమాలు,
పగవాడిని బెంబేలు పెట్టించి ఉరికించి పరిగెట్టించిన పరాక్రమవంతులు!!                          ||మరచిపోకు||

చరణం-3:
ఛటర్జీ రచించిన వందేమాతరం, ఠాగూర్ లిఖించిన జనగణమననలు,
దాయాదులను తరిమి వేయాలనే భారత వీరుల ఆశయాలకు ఆజ్యాలు!
సరోజనీ రాసిన ది గిఫ్ట్ ఆఫ్ ఇండియా , ఇక్బాల్ అందించిన సారేజహాసేఅచ్ఛాలు,
ప్రత్యర్థులను దేశం నుండి వెలివేయాలనే నినాదాలకు హవిస్సులు!!                                    ||మరచిపోకు||

చరణం -4:
మన్నెందొర చేపట్టిన ఆకస్మిక దాడులు, కొమరం భీం సాగించిన దండయాత్రలు,
కంటకుల కళ్ళల్లో భయాందోళనలతో నిండిన సింహస్వప్నాలు!
గాంధీ ఆచరించిన అహింసావాదం, నెహ్రూ నమ్మిన ప్రజ్ఞతో కూడిన నిర్ణయాలు,
భారతమాత మిక్కిలి మోదంతో తెంచుకున్న అస్వతంత్రపు శృంఖలాలు!!                 ||మరచిపోకు ||

---- కొత్తపల్లి రవి కుమార్ 
         రాజమహేంద్రవరం
           9491804844

0/Post a Comment/Comments