నా తెలుగు భాష -- సంతోష్ మాచిడి

నా తెలుగు భాష -- సంతోష్ మాచిడి

నా తెలుగు భాష

అమ్మ ఒడిలోనే అంకురార్పణ జరిగి
ఉగ్గు పాలతోటి ఉరకలెత్తిన భాష
మరణమంచు వరకు మనసులోతులుండి
మారుమోగుతుంది నా మాతృభాష

తేనెలొలుకు పలుకు తళుకు తోటి
దేశభాషలందు లెస్సగా వెలుగొంది
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా నిలిచి
అజరామరమైన అజంతా భాష యై
అమృతాన్ని పంచే నా తెలుగు భాష

బ్రాహ్మీ లిపిన మొలచి మధ్య ద్రావిడంగా
కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణమై
కళింగాంధ్ర మాండలికలతో కలిసి
జానపదుల నోట జాలువారి

శాసనములలో చేరి సవరణలతో కూడి
నన్నయాది కవుల కావ్యరూపమై
ఇతిహాస పురాణ పద్యాలలో జారి
పాల్కురికి వారి ప్రక్రియలలో దూరి
దేశీయంగా మెలగి దేదీప్యమానమై

ప్రబంధ కావ్యాల పలుకుబడుల తోటి
భావ కవుల నోట భావుకతను నేర్చి
గిడుగువారి వెంట వ్యవహారికంగా నడిచి
నవలాది వచన ప్రక్రియలతో నిలిచి

ఆధునికత నెరిగి అభ్యుదయమై ఎగసి
వివిధ వాదాల రూపాలు వెదజల్లి
అస్తిత్వాన్ని నిలిపే ఆయుధమై వెలచి
ఆధునికాంతర సాహిత్య రూపమై

అచ్చుహల్లులు కల్గిన అక్షరాలు తోటి
ఆకారాదితో అణుకువను తెలుపుతూ
క కా లతో కట్టు బొట్టును నిల్పి
సంధి సమాసాలతో సంస్కారాన్ని పెంచి

తలకట్టు దీర్గాల సమ్మేళన తలపాగా
జాతీయా సామెతల పంచెకట్టు తోటి
జాతి ఖ్యాతిని పెంచి జాగృతం బొనరించి
జగతినంతా వెలుగు నా తెలుగు భాష !


--------  సంతోష్ మాచిడి 
     M.A, T.P.T, NET, SET, (Ph.D)
వృత్తి : తెలుగు అధ్యాపకుడు
ప్రవృత్తి :కవి,రచయిత,పరిశోధకుడు.

0/Post a Comment/Comments