తేట తెలుగు(ఇష్టపది మాలిక)-డాక్టర్ అడిగొప్పుల సదయ్య

తేట తెలుగు(ఇష్టపది మాలిక)-డాక్టర్ అడిగొప్పుల సదయ్య

తేట తెల్లని తెలుగు తేనెలొలకెడి తెలుగు
తేటి గములు మీటు తీపి వీణియ తెలుగు

అమ్మ లాంటిది తెలుగు ఆవుపాలే తెలుగు
అజంతంబగు తెలుగు అవనివెలుగే తెలుగు

పద్యమంటే తెలుగు గద్యమంటే తెలుగు
విద్యలన్నిట మేటి విశ్వభాషే తెలుగు

అందమైనది తెలుగు బంధమైనది తెలుగు
ఛందంబుతో కూడి గంధమైనది తెలుగు

ద్వర్థియై,త్ర్యర్థియై ధన్యమైనది తెలుగు
అవధానమలరిస్తు ఛవులూరు ఘన తెలుగు

నన్నయ్య ఘంటమున నాట్యాలు చేసినది
సోమన్న కలములో సోమరసమొలికినది

తిక్కన్న చేతిలో తిరుమంజనముపొంది
ఎర్రన్న కవితలో ఇంపుగా మెరిసినది

అష్టదిగ్గజ కవుల ఆహార్యమై వరలి
శ్రీనాథు గళములో సీసమై పాడినది

బద్దెన్న పద్యముల పెద్ద నీతులు కరపి
వేమన్న సామెతల విశ్వరూపము చూపె

పోతన్న కృతిలోన పోహళించెను శృతిగ
అన్నమార్యుని నోట ఆటాడె పదములై

గురజాడ జాడలో గోదారిలా నడచి
గిడుగు పంతులు చేరి గొడుగునే పట్టింది

డాక్టర్ అడిగొప్పుల సదయ్య
కరీంనగర్
9963991125


0/Post a Comment/Comments