పల్లెటూరు
అందాల హరివిల్లు నా పల్లె
ఆనందాల సోయగాలు నా పల్లె
సిరులు కురుపించే పైరు పంటలు నాపల్లె
విరబూసిన ఆత్మీయతలు నా పల్లె!
ప్రాణానికి ప్రాణమిచ్చే
ఒరేయ్ తురేయ్ అని పిలుచుకునే స్నేహితులు
తిన్నారా ఉన్నారా ,పన్నారా అని పలకరించే
అమ్మలక్కలు , ఆత్మీయులు ,బామ్మలు
అలరారే పల్లెటూరు మాది!
వేకువ జామున భానుడి కొరకు
ఎదురు చూసే మంచు తెరలతో
చుట్టూర చెరువులు కుంటల జల కళతో
ఊరినిండా తరువులు స్వచ్ఛమైన గాలులతో
పచ్ఛని స్వచ్ఛమైన పల్లెటూరు మాది!
అవసరాలకు చేబదుళ్ళు ఇచ్చిపుచ్చుకునే
ఆపదలు కలుగుతే ఆదుకునే
పాడి పంటలు పంటలు పండించే కర్షకులు
స్వచ్ఛమైన పాలు పెరుగు కూరగాయలు
అవసరమయ్యే అన్ని రకాల వస్తువులను
తయారుచేసే కులవృత్తులవారు
నివశించే పల్లెటూరు మాది!
పండుగలను , ఉత్సవాలను అందరు కలిసి
ఆనందంగా ఎంతోఉత్సాహంగాజరుపుకునే
రేపటి తరాలకు చక్కటి అనుభవాలను నేర్పే
తీపి జ్ఞాపకాలను , స్మృతులను ప్రోదిచేయు
పల్లెటూరు మాది!
దేశానికి వెన్నెముకలు పల్లెటూర్లు
కల్లా కపటం తెలియని వారు గ్రామీణులు
సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుగొమ్మలు
ప్రశాంత వాతావరణం గల పల్లెటూరుమాది!
- మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్