తల్లడిల్లుతున్న తరం --శ్రీలతరమేశ్ గోస్కుల

తల్లడిల్లుతున్న తరం --శ్రీలతరమేశ్ గోస్కుల

*కదులుతున్న కాలానికెరుక కరిగిన వయసు విలువ..*

నీరింకిన కనులకే ఎరక దిగమింగిన బాధలెన్నో...
కంటికి రెప్పోలే సాకిన కడదాకా తోడుండని బంధాలకై...
బరువెక్కిన హృదయాన
మౌనఃరోధనే మిగిలే
మదినిండా గజిబిజిగా అల్లుకున్న
అనురాగమే అంతమై...
ఆవిరిగా మారి ఎగిరిపోతుందేమో...
రెక్కలుడిగిన ఊహలన్ని ఎగరని పక్షులై
మూడోకాలి చప్పుడుతో
ముడతలతో నిండిన దేహమే
మరిమరి వెక్కిరించే...
నాడు సంపాదనలో మునిగిన యవ్వనం
సంసార బాధల సుడిగుండంలో
చిక్కీ శైల్యమై తేలిందేమో
ముంగురులన్నీ మల్లెల్లా
విరబూసుకుంటున్నాయి నేడు..
తడిమి చూసే చేతులు తడియారిన గొంతుకలు
తనివితీరని మమకారంతో తనవారి చెంత చేరాలని
ఒంటరైనా నిరీక్షించే ఆరాటం...
సమస్యల కొలిమిలో
రాటుదేలిన మనసు కాబోలు..
కన్న పేగుపై కడుపు తీపితో....
ఎల్లలెరగని తీరాలవెంట ఎదురు చూపుల్లోనే
గడిచిన కాలన్నే నెమరేస్తూ.....
అన్నీ ఉన్నా అందరూ ఉన్నా
అయిన వారి తోడులేక అనాధల్లా ఆశ్రమాలల్లో..
కన్నుకు చూపు దూరమైన తీరు
తల్లడిల్లుతుండే తన వారికొరకై...

  
*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*

0/Post a Comment/Comments