తెలంగాణ సంబురం.. బోనాల పర్వం!' ------సుజాత.పి.వి.ఎల్, సైనిక్ పురి, సికిందరాబాద్.

తెలంగాణ సంబురం.. బోనాల పర్వం!' ------సుజాత.పి.వి.ఎల్, సైనిక్ పురి, సికిందరాబాద్.


తెలంగాణ సంబురం.. బోనాల పర్వం!'
(వచన కవిత)

అసుర సంహరిణి
ఒక చేత కత్తి..
మరో చేత శూలం
పెద్దపులినెక్కి..
రాకాసి మూకల ఆటకట్టించేదుకు
అరుదెంచిన అమ్మలగన్న అమ్మ
శక్తి స్వరూపిణి..పెద్ద మాంకాళమ్మా!
ఏడాదికొకసారి, ఆషాడంలో
ఒక్కో ఆదివారం 
ఎల్లమ్మ, పోచమ్మ, రేణుకమ్మ,
మైసమ్మ, ముత్యాలమ్మల రూపాల్లో..
లష్కర్ బోనాలందుకునేందుకు
బయలెల్లినాది అమ్మ పెద్దమ్మా!
చీరె సారెలు చెల్లించ
కొత్త కుండ తెచ్చి..
పాయసం బువ్వొండి
పసుపు బండారి బొట్లు పెట్టి
వేప కొమ్మల నడుమ
పిండి దీపాలెట్టి..
నిండు మనసుతో..
నిమ్మళంగా మము చూడమని
నిమ్మకాయ దండలేసుకొని..
వేప మండలు చేతబూని..
కాళ్ళకు గజ్జెలు కట్టి..
పోతరాజు ముందు నడువ..
డప్పు చప్పుళ్ళ జోరు నడుమ
గవ్వల దండ గలగల సవ్వడి
శివసత్తుల పూనకం..
శివంగి నృత్యమాడుతూ..
బోనమెత్తి నీకు
చల్ల నైవేద్యం తెచ్చినాము..
కల్లు సాక పోస్తాము..
టెంకాయలు కొడతాము..
కరుణించి కాపాడు..పెద్ద మాంకాళమ్మా!
కుటుంబ బాంధవ్య బంధం..
అమ్మ శక్తి ప్రతిరూపం..
పసుపు, కుంకుమ శుభ సూచిక సంప్రదాయ చిహ్నం..
తెలంగాణ ప్రత్యేక సంబురం బోనాల పర్వం..
దుర్గతులు బాపగా..
దుర్గ అంశవై..
దుష్ట శిక్షణకై..
అవతార రూపిణిలా..
అందరింటి ఆడబిడ్డలా..
బంగారు బోనాలు అందుకొనగా..
భవానివై వచ్చిన పెద్ద మాంకాళమ్మా!
తప్పులుంటే మన్నించి..
మొక్కులు స్వీకరించి..
సిరులనొసగి సుఖశాంతులియ్యవే..పెద్ద మాంకాళమ్మా!
నీ ముక్కోటి రూపాలకు 
శత కోటి వందనాలమ్మా!!
మమ్మేల రావమ్మా! మా చల్లని మాంకాళమ్మా!!

---సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.

(ఆషాఢ బోనాలు.. ఆఖరి రోజు సందర్భంగా వచన కవిత)0/Post a Comment/Comments