ఆకలి తీర్చేటందుకు...!
--కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ), ఖమ్మం.
తూనీగలు గుంపులు గుంపులుగా పరుగెత్తుకుంటూ వస్తాయెందుకో
మట్టి వాసన పరిమళాలను చల్లని గాలులు మోసుకొస్తాయెందుకో
నీలి మేఘాలు ఆకాశాన్ని కమ్మేసి పచ్చని ప్రకృతినీ పరవశింపచేస్తాయెందుకో
కర్షకుని కళ్ళల్లో ఆనందం నింపే తొలకరి చినుకుల పలకరింపు కోసం...!
పసి పాపాల కన్నులలో ఆ ఆనందపు వెలుగులెందుకో
పరుగెత్తు కొచ్చే లేగ దూడ లో ఆ ఆత్రపు అడుగులెందుకో
పక్షి గూళ్ళల్లో చిట్టి పిల్లల కిలకిల రావాలు ఎందుకో
కన్న తల్లుల కౌగిలింతల మాతృత్వపు మాధుర్యం కోసం...!
బడి గంటల గణగణ మోతల పిలుపులెందుకో
వడి వడి నడకల చిన్నారుల పరుగులెందుకో
విజ్ఞానపు జ్ఞాన గురువు అక్షర ఝరి ఎందుకో
దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మించేందుకు...!
పొలాల కేసి హలదారి అడుగుల సందడెందుకో
కాడెద్దుల రాజస నడకల గజ్జెల సవ్వడి ఎందుకో
కొంగు నడుముకు చుట్టి కొడవలి చేత బట్టిన కోమలి గుంపుల నడకలెందుకో
పైరు పచ్చని చేనులో పంట పండించి ఆకలి తీర్చేటందుకు...!