గగనవీధిలో.....(వచనకవిత)
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి, మేడ్చెల్.
**************************
నీలాల ఆకాశము
నిర్మలమై,సత్యమై
నిరంతర చైతన్యమై
కనబడుతుంటుంది.
చుక్కలెన్ని ఉన్నా
చంద్రుడు దేదీప్యమానంగా
వెలుగుతూ స్వచ్ఛకౌముదులు
పంచుతున్నా
అంతరిక్ష మండలము
అద్భుతాలకు నిలయమై
అబ్బురపరిచినా
మబ్బులు కమ్మినా
పిడుగులు ఉరిమినా
మెరుపులు మెరిసినా
ఇంద్రధనుస్సు వంగి
రంగులమయం చేసినా
సూర్యుడు మండినా
తామసి ఆక్రమించినా
గాలిదుమారం రేగినా
తోకచుక్కలు తెగిరాలిపోయినా
ప్రళయకాల సంకేతాలు
ఆవరించినా
వరుణుడు అభిషేకించినా
కృత్రిమకాలుష్యం కప్పేసినా
తాను తానై
తన ఛత్రము కింద
తలదాచుకొనే
సమస్త మానవాళికి
తానే ఉదాహరణై
ఎన్ని కష్టాలొచ్చినా
కన్నీళ్ళొచ్చినా
తలెత్తుకొని నిలబడాలని
స్ఫూర్తినిస్తుంది.
తానే హద్దని,తానే లక్ష్యమని
బోధిస్తుంది.
నింగిలా స్వచ్ఛంగా
ఉండమని ప్రబోధిస్తుంది.
హామీపత్రం:
పై వచనకవిత నా స్వంత రచన.