సాహిత్యం వృత్తి, ప్రవృత్తులు, ధోరణులు - సామాజిక బాధ్యతగా భావజాల వ్యాప్తి!!!

సాహిత్యం వృత్తి, ప్రవృత్తులు, ధోరణులు - సామాజిక బాధ్యతగా భావజాల వ్యాప్తి!!!

 సాహిత్యం వృత్తి, ప్రవృత్తులు, ధోరణులు - సామాజిక బాధ్యతగా భావజాల వ్యాప్తి!!!

- వడ్డేపల్లి మల్లేశము 9014206412

 

గత సంవత్సరమున్నర కాలంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో సాహిత్య రంగం ప్రత్యక్షంగా కొంత స్తబ్దతకు గురైనా పరోక్షంగా అంతకుమించి నటువంటి జూమ్ సమావేశాలు, సాహితీ సంస్థల ఆవిర్భావము, వాట్సాప్ లో వివిధ సందర్భాలలో పోటీల నిర్వహణ అంతకు మించిన స్థాయిలో సాహిత్య రంగాన్ని పోషించిందని చెప్పవచ్చు. అయితే ఏ విలువల మేరకు వ్యవస్థ నడుస్తున్నది? సంస్థల యొక్క  దృక్పదాలు, వైఖరులు ఎలా ఉన్నవి? అనేవి కొంతవరకు ఆలోచించవలసిన అవసరం ఉంది.

కావ్యగానం అనే ప్రక్రియ తెలుగు భాషా చైతన్య సమితి లక్ష్యసాధన ఫౌండేషన్ కు తోడుగా తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో గత 44 వారాలుగా కొనసాగడం సాహిత్యరంగంలో కొంత శుభపరిణామమే. అయితే పాల్గొంటున్న కవులు, సాహితీ ప్రియులు,  రచయితలతో పాటుగా సాహిత్యంతో ఎలాంటి సంబంధం లేని వారు కూడా ఇటీవలి కాలంలో ఈ అవకాశాలను వినియోగించుకుంటున్న వైనం కనపడుతున్నది. తద్వారా కొత్త కవి లోకం ఏర్పడింది అనడంలో అతిశయోక్తి లేదు.


సాహిత్యంలో నిర్వచించుకోవడంలోనే మూలం ఉంది:

సాహిత్యం యొక్క లక్ష్యాన్ని సాధించడానికి సాహిత్య రంగంలో పనిచేస్తున్న అందరూ కూడా తద్వారా సాధించే ప్రయోజనాన్ని నిర్దేశించుకోవడం లోనే వారి ప్రతిభ, సాహిత్య  లక్ష్యాలు, చేరుకునే గమ్యాలు ఆధారపడి ఉంటాయి. దీనికి కవికి ఆత్మ నిబ్బరం ,గుండె ధైర్యము సామాజిక  చింతన, ప్రశ్నించే ధోరణి, సమాజాన్ని ప్రపంచాన్ని అర్థం చేసుకునే వ్యక్తిత్వము ప్రధానమైనవి.

కొందరు ఒక రంగంలో పనిచేస్తూ సాహిత్యాన్ని ప్రవృత్తిగా పెట్టుకొని అడపాదడపా ఆవైపు గా ఆలోచిస్తూ రచనలు కొనసాగిస్తారు. పూర్తి స్థాయిలో సాహిత్య లక్ష్యాన్ని ఆశించవచ్చు ఆశించ లేక పోవచ్చు కూడా. కారణం ఒక రంగంలో నిమగ్నమైన కారణంగా సాహిత్యాన్ని వృత్తిగా చేపట్ట లేకపోవడమే.

అయితే చాలామంది వివిధ ఉద్యోగాలు వ్యాపారాలు, రైతులు కార్మికులు గా పనిచేస్తూనే సాహిత్య రంగం పట్ల ప్రధానమైన బాధ్యత కనపరుస్తారు. అంటే వీరు పూర్తిస్థాయిలో సాహిత్యాన్ని వృత్తిగా స్వీకరించిన వారి గా చెప్పుకోవచ్చు. వీరు సాహిత్యం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఆశిస్తూ ఆ వైపుగా అదనపు కృషిని కొనసాగిస్తారు. సాహిత్య ప్రయోజనం కోసం నిరంతరం తపిస్తారు.

ఇక మూడవ రకానికి చెందినవారు సాహిత్య అనుబంధ వృత్తులలో పనిచేస్తూ పూర్తిస్థాయిలో సాహిత్య  రంగంలో కృషి చేయడానికి సిద్ధపడతారు. ఆ వైపుగా ఎంతవరకైనా తెగించి పోరాడ టానికి, లక్ష్యాలను సాధించడానికి, లక్ష్యాలను ముందుంచుకుని జీవితంలో ఆచరించడానికి ఆరాటపడుతుంటారు. అక్కడ ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.


భావజాల వ్యాప్తి -సామాజిక బాధ్యత:

సాహిత్యానికి తాత్కాలిక ప్రయోజనాలు ఉండకూడదు. వృత్తిగా ప్రవృత్తిగా అడపాదడపా ఆటవిడుపుగా భావించినప్పటికీ ఆ రకంగా ఆ వర్గాలకు వీలైనప్పటికీ సాహిత్యం పట్ల సామాజిక బాధ్యతగా నిబద్ధత గా ఉండాల్సిన అవసరం కవులు, కళాకారులు, మేధావులు, రచయితల పైన ఎంతగానో ఉన్నది. సామాజిక బాధ్యతగా ఉన్న రచనలు బాధ్యతారాహిత్యంగా చేసిన రచనల్లో ఎంతో తేడా ఉంటుంది .అది వారి దృక్పథం పైన సమాజంపట్ల వారికి గల భావజాలం పై ఆధారపడి ఉంటుంది.

సాహిత్య ప్రయోజనం లో ప్రధానమైనది భావజాల వ్యాప్తి. తన అధ్యయనము, పరిశీలన, విశ్లేషణ ద్వారా కార్యకారణ సంబంధం రీత్యా ఆలోచించి ఒక రచయిత, కవి, విశ్లేషకుడు, కళాకారుడు సమాజ పరిణామానికి సమ సమాజం వైపు గా తీసుకువెళ్లడానికి అవకాశాలను పరిశీలించి కొంత భావజాలాన్ని సృష్టిస్తాడు. అదే సాహిత్యం. సాహిత్యం తిరిగి తిరిగి పునరావృతం అవుతూ దానికి తరచుగా మరింత జోడించబడుతూ పరిణామక్రమంలో సమాజంలోని విభిన్న వర్గాలకు ప్రయోజనాన్ని అందిస్తూ ఉంటుంది. వ్యక్తులను, ప్రజలను, ఆయా వర్గాలను చైతన్యపరుస్తుంది.

సమాజ స్థితిగతులకు కారణాలను ప్రజలు విశ్లేషించుకోవడానికి, వాటిని పరిష్కరించుకోవడానికి మూలాలు సాహిత్యం ద్వారా అందుతాయి. మరి అలాంటప్పుడు కవితలు, పాటలు, గేయాలు, వ్యాసాలు ,నాటికలు ,నవల వంటి విభిన్న రూపాలలో ఉన్న సాహిత్యాన్ని సృష్టించే క్రమములో రచయిత పరిపక్వత పైన దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

ఇటీవలి కాలంలో రచయితలు, కవులు ప్రధానంగా పురస్కారాలు ,గుర్తింపు, కలవారితో సాన్నిహిత్యం, పాలకుల ప్రశంస వైపుగా ఎక్కువగా కదులుతున్నట్లు విమర్శలు వస్తున్నవి. ఈ విమర్శ సాహిత్య ప్రయోజనానికి చాలా ప్రతిబంధకము. భావజాల వ్యాప్తి, ధోరణులు, దృక్పథము లు, కర్తవ్యము లు సామాజిక చింతనను నిర్దేశించుకోవడం వంటి సుగుణాలు ముఖ్యంగా సాహిత్య అభిలాశులకు, సాహితీ రంగంలోని ప్రధాన కర్తలు అయినటువంటి కవులు కళాకారులకు ఉన్నప్పుడే సమాజ పరిణామ క్రమంలో సహేతుక మార్పును చూడగలుగుతాము.


వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడం:

సాహిత్య రంగం దానిపై ఆధారపడి నటువంటి వ్యక్తులు  కొన్ని ఉత్తమ లక్షణాలతోపాటు అభ్యుదయ భావజాలాన్ని తమ సొంతం చేసుకుంటే తప్ప సామాజిక మార్పుకు దోహదపడే సాహిత్యాన్ని సృష్టించలేము.

సమస్యలకు సంబంధించి పరిష్కారాలు వెతికే క్రమంలో కారణాలను విశ్లేషించుకోవడం, కార్యకారణ సంబంధాన్ని అంచనా వేయడం, లక్ష్య సాధన వైపుగా అడుగులు వేయడం, ఆలోచించే ప్రతి విషయం కూడా ప్రజా కోణంలో స్థిరపరచుకున్నప్పుడే సామాజిక రుగ్మతలయినటువంటి అంతరాలను తొలగించి సమసమాజంలో సమానత్వాన్ని సాధించగలం. అందుకు కవులు రచయితలకు ధైర్యం తో పాటు దిక్కార స్వరం కూడా చాలా అవసరం. మార్పును కోరే తత్వం లేకుంటే ఇదంతా శూన్యమే.

ఆధిపత్య భావజాలాన్ని అణచివేసి, విష సంస్కృతిని చిదిమి వేసి, వివక్షను రూపుమాపడం ద్వారా విలువల పునాదిగా నూతన వ్యవస్థ అంకురార్పణ జరగవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. అంతిమంగా అంతరాలు లేనటువంటి సమ సమాజాన్ని కవి చిత్తశుద్ధిగా స్వాగతించినప్పుడే ఆ వైపుగా రచనలు చేయగలడు. ప్రజలను ఆలోచింపజేసే, ప్రతిఘటనకు సిద్ధ పరిచే, మార్పును కోరే వ్యక్తులుగా ప్రజానీకాన్ని తీర్చిదిద్దడమే సాహిత్యం యొక్క ప్రయోజనం. ఆ ప్రయోజనాన్ని సాధించడానికి సాహిత్యరంగం యావత్తు మనస్ఫూర్తిగా నిరంతరం ఆ వైపుగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది.

కరోనా కాలం లోనూ, కలికాలం లోనూ హేతుబద్ధమైన జీవితము గడపగలిగే వ్యక్తులుగా ప్రజానీకాన్ని తీర్చిదిద్దడమే సాహిత్యం యొక్క అంతిమ కర్తవ్యముగా  భావించాలి. భేషజాలకు అతీతంగా మానవ బలహీనతలను పక్కనబెట్టి ఉద్యమ స్ఫూర్తితో సమైక్య ఆశయంతో సాహిత్యరంగం పని చేయవలసిన అవసరం ఉంది. ఆ వైపుగా కవులు, కళాకారులు, మేధావులు, సాహిత్య సాంస్కృతిక రంగాలు పునరంకితం కావడమే నేటి చారిత్రక కర్తవ్యం.


(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట, తెలంగాణ)

0/Post a Comment/Comments