ఆగస్ట్ 7 - 2021
'చే'నేత' రూపకుడు!'
(వచన కవిత)
వలువల విలువలు తెలిపి
భరత జాతి పతాక ఖ్యాతి నిలిపి
చేనేత వస్త్ర ధారణ గౌరవానికి చిహ్నంగా
భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబంగా నిలిచింది..
స్వతంత్ర భారతావని ఆవిర్భవానికి
ఆసు యంత్రం ఆయువు పోసింది..
పరాయి పాలకుల తరిమికొట్టడంలో
నూలు రాట్నం ఐకమత్య పాత్ర పోషించింది..
పోగు వడికి..కండె దారం గుండెకత్తుకొని,
నిండు మనసుతో
ఆరు గజాల నుండి అగ్గిపెట్టెలో పట్టే
అద్భుత వస్త్రాలని
మగ్గం వేదికపై నర్తింపచేసే
నేత రూపకుడు..చే'నేత' కార్మికుడు..
వర్ణమయ వస్త్రాలను అందంగా నేసిన
ఆ చేయి..
భారీయంత్ర ధాటికి బక్క చిక్కిపోయి..
ప్రభుత్వ చేయూత కోసం
మర మగ్గాల చప్పుళ్ళకై పరితపిస్తూంది..
--సుజాత పి.వి.ఎల్.,
సైనిక్ పురి, సికిందరాబాద్.