పాకాల యశోదా రెడ్డి --శ్రీమతి ఐశ్వర్య రెడ్డి గంట

పాకాల యశోదా రెడ్డి --శ్రీమతి ఐశ్వర్య రెడ్డి గంట

పాకాల యశోదా రెడ్డి గారు ఈ పేరు వినగానే మనకు మొదట గుర్తొచ్చేది తెలంగాణ యాస భాష, తెలుగు సాహిత్యంలో ఎనలేని సేవలు అందించి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేసిన విషయమే జ్ఞప్తికి వస్తుంది. 

ప్రఖ్యాత రచయిత్రి యశోదా రెడ్డి గారు 1929 ఆగస్టు 8న సరస్వతమ్మ కాశిరెడ్డి గార్లకు నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి గ్రామం లోని జన్మించారు

విద్యాభ్యాసం:
భూస్వామ్య కుటుంబంలో పుట్టినా కూడా చదువుకోడానికి చాలా కష్టమైంది. యశోద గారికి ఎందుకంటే అప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి వంటింటికే పరిమితం అయ్యే రోజులు ప్రాథమిక విద్య తరువాత రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి గారు ప్రోత్సహించి యశోద రెడ్డి తో పాటు ముగ్గురు నలుగురు బాలికలను విజయవాడకు పంపించి అక్కడ మెట్రిక్యులేషన్ చదివించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సంస్కృత భాషలలో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేసారు. అలాగే ఈవిడ బహుభాషా కోవిదులు యశోదా రెడ్డి గారికి హిందీ ఉర్దూ కన్నడ భాషల్లో ప్రావీణ్యం తో పాటు జర్మన్ భాష కూడా కొద్దిగా తెలుసు . 

జీవిత భాగస్వామి:
ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి. ఆయన ఒకరోజు పాఠశాల వేదికపైన మాట్లాడుతున్న యశోద రెడ్డి గారిని చూసి ఆ ధైర్యానికి ఆకర్షితుడై ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఉద్యోగం:
ప్రొఫెసర్గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసి 1989లో పదవీ విరమణ చేశారు. రేడియో లో ప్రసంగాలు మాండలికం లో చేస్తూతను రాసిన కథలను వివరించే వారు, ఊరబావిముచ్చట్లు, మహాలక్ష్మి ముచ్చట్లు అంటూ తన ప్రస్తానం మొదలుకొని రేడియో లో పిల్లల నాటకాలు మొదలుపెట్టి మంచి పేరు సంపాదించారు. 

రచయిత్రిగా కవయిత్రిగా :
రచయిత్రిగా వందకు పైగా కథలు రాసారు వాటిలో 63 మాత్రమే పుస్తకరూపంలో ప్రచురించడం జరిగింది. ఈమె రాసిన కథల లో బాగా ప్రాచుర్యం పొందిన విమా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల ఈ మూడు కథా సంపుటిలు. ఈ మూడు కథా సంపుటాలలో ఈమె తెలంగాణ భాషను యాసను సంస్కృతిని ప్రజల యొక్క జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు రాసారు. వాస్తవికతకు అద్దం పట్టేలా సమాజంలో ఉన్న సమస్యలను ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా రాసారు. 

యశోద రెడ్డి గారు కథ అంటే కల్పన కాదు వాస్తవికతను అద్దం పట్టేవిలా ఉండాలని చెప్పేవారు యశోదా రెడ్డి గారికి పుట్టిన గడ్డ పైన చాలా ప్రేమ అందుకే తెలంగాణ యాసను భాషను బతికించాలి అని అనేవారు. కేవలం రాయటం లోనే తెలంగాణ యాసను చూపించేవారు కాదు, తన నడవడిక నడత మొత్తం తెలంగాణలోనే ఉండేది, తెలంగాణ మాండలికం లోనే ఆమె తన రచనలను చేసింది. తర్వాత కవయిత్రిగా ఉగాదికి ఉయ్యాల భావిక అనే రెండు సంపుటాలను తనే ముద్రించింది. రచనలను సవరణ చేస్తూ ఎంతో మంది కవులతో రచయితలతో పనిచేసింది.

ఆ కాలంలోనే మలేషియా దేశానికి వెళ్లి అక్కడ జరిగిన తెలుగు కవి సమ్మేళనంలో కవయిత్రి పాల్గొని ప్రశంసలు అందుకుంది. అలాగే వచానునువాదం చేసిన హరివంశము కూడా చాలా పేరు గాంచింది. 

వ్యక్తిత్వం:
స్వతహాగా యశోద రెడ్డి గారు చాలా దైర్యవంతురాలు. ఎంత పెద్ద వారినైనను సరే తప్పు మాట్లాడారు అనుకుంటే అక్కడే అడిగేవారు. ఊరి వారు అందరు యశోద రెడ్డి గారిని యశమ్మ, ఎచ్చమ్మ అని ప్రేమగా పిలుచుకోనేవారు. నుడికారం కూడా చాలా ఎక్కువగా తన రచనలలో చూపించేవారు. చాలా మంచివారు, విద్యార్థులనే తన పిల్లలుగా బావించి వారి మంచి చెడ్డలు కూడా చూసేవారు. 

ఇలా జన జీవనంలోనూ మరియు తెలుగు సాహిత్యంలో తనదంటూ ముద్రవేసిన యశోద రెడ్డి గారు 2007 అక్టోబరు 7 న హైదరాబాద్ లో పరమపదించారు. 

(యశోద రెడ్డి గారి గురించి నాకు తెలిసిన, సాహితీవేత్తలు, ఆవిడ శిష్యులు , ఆవిడ రాసిన పుస్తకాల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుని తన చరిత పది మందికి ఉపయోగపడుతుందని భావించి రాయడం జరిగింది.)
 

0/Post a Comment/Comments