తెలుగు వెలుగు (కథ) --కొత్తపల్లి రవి కుమార్

తెలుగు వెలుగు (కథ) --కొత్తపల్లి రవి కుమార్

 తెలుగు వెలుగు

                          దశరథరామయ్య టి.వి. ఆన్ చేసి కూర్చున్నాడు. ఈరోజు 'అచ్ఛమైన తెలుగు ఛానల్' అని చెప్పుకునే ఒక ప్రముఖ ఛానల్ లో తన ఆప్తమిత్రుడైన "శంకరంబాడి సీతారామారావు" తో ఇంటర్వ్యూ ఉందంటే టి.వి. పెట్టాడు. సాధారణంగా దశరథరామయ్య భక్తి , తెలుగు భాష కి సంబంధించిన ఛానల్స్ తప్ప మరేమీ చూడడు. అవి కూడా తక్కువే. కానీ తన మిత్రుడు ఫోన్ చేసి మరీ "ఈ రోజు నాతో ఇంటర్వ్యూ ఫలానా ఛానల్ లో ప్రసారమవుతోందని" చెప్తే ఆ ఛానల్ పెట్టాడు.

                             ఆ ఛానల్ లో ఇంటర్వ్యూ ని 'తెలుగు బాగా వచ్చు' అని అనుకున్న యాంకర్ మొదలు పెట్టింది.  "హలో వ్యూవర్స్! గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎళా ఉణ్ణారు? అంధరూ రెడీయా? నేను రెడీ. మరి ఇంకెందుకు ఆళష్యం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్ధామా? ఈ రోజ్జు ఎపిసోడ్ లో మణం వొఖ ముఖమైన వ్యఖ్తిని కళవపోత్తున్నాము. ఒక సాదారన మద్య తరగత్తి కుటుంభంలో పుట్టి, తన సక్తి సామర్ద్యాలతో అంచలంచలుగా ఎదిగ్గి, బిజినెస్ రంగంళో తనకంట్టూ ఒక్క ముధ్ర వేషిణ 'ష్రీ సంకరంభాడి షీతా రామ్ రావ్ గారు'. ఆయన్ని ఇంటర్వ్యూ చేయ్యడానికి నేను రెడీ. మీరు రెడీయా?". ఇలా సాగుతోంది, ఆ తెలుగు యాంకర్ యొక్క తెలుగు యాంకరింగ్. 

                             స్వతహాగా తెలుగు పండితుడైన దశరథరామయ్య ఈ యాంకర్ తెలుగు విని అసహ్యించుకుంటూనే తప్పక తన మిత్రుడి ఇంటర్వ్యూని పూర్తిగా చూసాడు. తెలుగు సాహిత్యంలో ఎన్నో మధురమైన కవితలను, కథలను రాసి, గొప్ప కవి అని పేరు తెచ్చుకున్న దశరథరామయ్యకి ఈ తెలుగు విని "అచ్చమైన తెలుగు అంతరించిపోతోంది " అని మనసులో బాధపడి టి.వి. కట్టేసాడు. 

                               ఒక గంట పోయాక తన స్నేహితుడి నుండి ఫోన్ వచ్చింది. "ఏరా రామూ! ప్రోగ్రామ్ చూసావా? ఎలా ఉంది?" అని అడిగాడు సీతారామారావు. 

                               "ఆ బాగుందిరా! కానీ ఆ యాంకర్ తెలుగు వినలేక చచ్చానురా. మన తెలుగు కి ఎంత చావు వచ్చిందిరా!" అని అన్నాడు దశరథరామయ్య.

                              ఇంటర్వ్యూ గురించి బాగా మెచ్చుకుంటాడనుకున్న దశరథరామయ్య మాటలు సీతారామారావు కి పెద్దగా  ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే సీతారామారావు, తన మిత్రుడి ముక్కు సూటి స్వభావాన్ని డెబ్భై ఏళ్ళగా దగ్గర నుండి చూస్తున్నాడు కాబట్టి. 

                            "ఈ మధ్య యాంకరింగ్ చేసే వాళ్ళల్లో ఈ అమ్మాయే నయమట. ఈ అమ్మాయికి యూత్ లో చాలా ఫాలోయింగ్ ఉందట. అందుకే ఈ అమ్మాయి చేత యాంకరింగ్ చేయిస్తున్నారు" అని చెప్పాడు సీతారామారావు. 

                            "ఏం ఫాలోయింగో ఏంటో? నువ్వెలా ఇంటర్వ్యూలో కూర్చున్నావో తెలియదు కానీ నాకైతే ఒళ్ళంతా కంపరమెక్కేసింది. నీ స్ధానంలో నేనుండి ఉంటే ఆ యాంకర్ కి తెలుగు వచ్చేదాకా క్లాస్ పీకేవాడిని. ఆ రోజు వస్తే ఖచ్చితంగా నర్మగర్భంగా మాట్లాడతాను" అని తెలుగు భాష మీద ఉన్న తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు, దశరథరామయ్య. 

                               ఆ రోజు త్వరగానే వచ్చింది. తెలుగు సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన కవుల సమ్మేళనంలో ఉత్తమ ప్రదర్శన ప్రదర్శించినందుకు దశరథరామయ్యకి "నవయుగ కవి సామ్రాట్ " బిరుదునిచ్చి సత్కరించింది. ఈ విషయం తెలుసుకుని ఆ ఛానల్ వాళ్ళు దశరథరామయ్యని ఇంటర్వ్యూకి ఆహ్వానించారు. దశరథరామయ్య చాలా సంతోషించాడు, తనను ఇంటర్వ్యూకి పిలిచినందుకు కాదు, ఒక మీడియా ద్వారా మన తెలుగు భాష గొప్పదనాన్ని తనదైన శైలిలో చెప్తున్నందుకు.

                          *               *             *
                             దశరథరామయ్యతో ఇంటర్వ్యూ మొదలయ్యింది. "హాయ్ వ్యూవర్స్! గుడ్ మార్నింగ్! ఈ రోజు వొక ముక్యమైణ గెస్ట్ తో నేను రెడీగా ఉణ్ణాను, మీరు రెడీయా? మరి ఇంకెందుకు ఆళష్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. కవితా ళోకంలో ఆయణొక ఆనిముత్తెం. తన షాహిత్యంతో తెళుగు బాష ఉన్నతికి ఆయణ చేసే షేవ అమోఘం. ఆయణే నన్ అదర్ దేన్ 'ష్రీ కొత్ పల్లి దషరథ్ రామయ గారు'. హార్టీ వెల్ కమ్ సార్!" అని ఆ యాంకర్ దశరథరామయ్యకి పుష్పగుచ్ఛం ఇచ్చి ఇంటర్వ్యూ కి ఆహ్వానించింది. ఇద్దరూ కూర్చున్నారు. ఇంటర్వ్యూ మొదలయ్యింది. 

                              "సార్! నా మొట్టమొదటి ప్రష్న. మీతో ఇంటర్వ్యూ తీషుకుంటున్నందుకు నేను చాలా ఏంగ్జైటింగ్ గా ఉన్నాను. మీరు మా ఛానల్ లో ఇంటర్వ్యూ కి వచ్చినందుకు ఎళా ఫీల్ అవుతున్నారు?" అని అడిగింది యాంకర్. 

                            "నేను కూడా చాలా ఏంగ్జైటింగ్ గా ఉన్నాను. తెలుగు భాష గురించి మీ ఛానల్ వాళ్ళు చేసే సేవ గురించి విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. తెలుగు భాష గురించి ఇంత తాపత్రయం పడే మీ వాళ్ళు యాంకర్ల విషయంలో కూడా బాగా శ్రద్ధ పెట్టాల్సింది. బాగా తెలుగు వచ్చిన యాంకర్లను పెడితే బాగుండేదని నా అభిప్రాయం " అని చెప్పాడు దశరథరామయ్య. ఆ యాంకర్ కి ఏమి అర్ధమయ్యిందో గానీ ఫక్కున నవ్వి మరల ప్రశ్నకి రెడీ అయ్యింది. 

                             "మీరు ఏమీ అణుకోకపోతే ఒక ప్రష్న. ఎదుటి వారు ఎళాంటి వారైణా, మీరు ముక్కు సూటి గా మీ అబిప్రాయాన్ని కుండ భద్దలు కొట్టినట్టు మాట్లాడతారంటగా సార్?" అని అడిగింది యాంకర్. 

                              "అవునమ్మా! నేను అలా మాట్లాడతాను కాబట్టే  నాకు మిత్రులు తక్కువ. ఎదుటి వారిది తప్పైతే తప్పు అని చెప్తాను. అలాగే మెచ్చుకోవడం కూడా అలాగే మెచ్చుకుంటాను. ఈ విషయం మీకు ఎవరూ చెప్పలేదా?" అని అడిగాడు దశరథరామయ్య. మరలా ఒక పెద్ద నవ్వు నవ్వింది యాంకర్. 

                               "తెళుగు బాష వుణ్ణతికి మీరు చేస్తున్న కృషి అమోఘం, వర్ణణాతీతం. అసలు తెళుగు బాషకి ఇంత షేవ షేద్దామని ఎలా అనిపించింది సార్!" అని అడిగింది యాంకర్. 

                               "మన మాతృభాష తెలుగు మన కన్నతల్లి వంటిది. తెలుగు మనందరి కన్నతల్లి. మన తల్లికి మనం సేవ చేసుకోమా? అలాగే తెలుగు భాష కి సేవ చేయడం మనందరి కర్తవ్యం. కానీ పరభాష మోజులో పడి మన తెలుగు భాషను పూర్తిగా మర్చిపోయారు. స్వచ్ఛమైన తెలుగు భాషకు తెగులు పట్టిస్తున్నారు" అని కొంచెం ఆవేశంగా చెప్పాడు దశరథరామయ్య. 

                              "మీకు తెళుగు భాష పట్ల ఉన్న అబిమాణానికి హాట్సాఫ్ సార్! ఇలా తెళుగు బాషకి అన్నేయం జరుగుతోందని మీ బావోద్వేగాణ్ణి మీ కవితలలో ఏమైణా రాస్తే మాకోసం ఒక్కటి వినిపిస్తారా?" అని అడిగింది యాంకర్. 

                              "తప్పకుండా. నీలాంటి వాళ్ళు ఖచ్చితంగా వినాల్సిన కవిత అది" అని తన కవితను వినిపించాడు దశరథరామయ్య.
"పరభాషను చంకనెక్కించుకుని తెలుగు భాషను నడి రోడ్డుమీద వదిలేసారురా!
తెలుగు భాష ఇంకెక్కడుందిరా పిచ్చోడా!!

అమ్మని శవాల దిబ్బల మమ్మీగా మార్చి, నాన్నపై డాడీ అంటూ దాడి చేయించారురా!
తెలుగు భాష జాడే లేదురా పిచ్చోడా!!
బాధ కలిగినప్పుడు అమ్మా అని కన్నతల్లిని తలచుకోవడం మాని షిట్ అని అశుద్ధాన్ని నోట్లో వేసుకున్నారురా!
తెలుగు భాష చచ్చిపోయిందిరా పిచ్చోడా!!
బళ్ళోకి పోయి దేవత లాంటి ఆ చదువులమ్మ ఒళ్ళో పాఠాలు నేర్చుకోవడం మాని స్కూల్ కెళ్ళి డెవిల్స్ గా మారారురా!
తెలుగు భాష అమ్ముడు పోయిందిరా పిచ్చోడా!!
ఏభై రెండు అక్షరాల మాతృభాషను పలకడానికి బద్ధకమేసి ఇరవై ఆరు అక్షరాల పరభాషకు బానిసలయ్యారురా!
తెలుగు భాష సిగ్గుపడి దాక్కుందిరా పిచ్చోడా!!
తేట తెల్లని తెలుగు పద్యాలతో యదార్థాలను చూపడం మాని జానీ జానీ అనే రైమ్స్ తో అసత్యాలు పలకడం అలవాటు చేసారురా!
తెలుగు భాష కాల గర్భంలో కలిసి పోయిందిరా పిచ్చోడా!!

నిరంతరం వెలుగులు విరజిమ్ముతూ ఆనందాన్ని పంచే తెలుగు భాషను వదిలి ఎంగిలి భాషను నోటితో అందుకున్నారురా!
తెలుగు భాష ఏవగింపుతో పారిపోయిందిరా పిచ్చోడా!!"
అనే కవితను వినిపించాడు. 

                          "చాలా బాగుంది సార్! వండర్ ఫుల్! తెళుగు బాషకి మీరు చేస్తుణ్ణ సేవకి ఇదొక తార్కానం సార్! ఆకరిగా మీరు తెళుగు బాష గురించి మా ప్రేక్షకులకి చెప్ఫాల్షిందేమైనా ఉందా సార్?" అని అడిగింది యాంకర్. 

                       "నేను వారికి ప్రత్యేకంగా చెప్పేదేముంది. నా బాధను వెళ్ళగక్కడం తప్ప. కానీ నేను మాత్రం ఒక్కటి గట్టిగా చెప్పగలను. మిగతా భాష వాళ్ళందరూ మాతృభాష, మాతృభాష అని కొట్టుకుపోతుంటే మన తెలుగు వాళ్ళు మాత్రం కన్న తల్లిదండ్రులను అవసానదశలో వృద్ధాశ్రమంలో వదిలేసినట్టు, పరభాష వ్యామోహంలో పడి మన తెలుగు భాషను చీకట్లోకి తోసేస్తున్నారు. తెలుగు వాడినని చెప్పుకోవడానికి కూడా సిగ్గు పడుతున్నారు. 

                            ప్రపంచంలోనే మన తెలుగు భాష రెండవ ఉత్తమ లిపిగా ఎంపికయ్యింది. అత్యధిక మంది మాట్లాడే వాళ్ళల్లో మన తెలుగు భాష భారతదేశంలో మూడవ స్ధానంలో, ప్రపంచంలో పదిహేనవ స్ధానంలోనూ ఉంది. దీన్నిబట్టే అర్ధమవ్వాలి, మన తెలుగు భాష గొప్పదనం ఏమిటో. ప్రపంచ దేశాలే మన భాషను గుర్తించి అందలం ఎక్కిస్తుంటే మన వాళ్ళకి మాత్రం కనువిప్పు కలగట్లేదు. మన భాష కాని భాష వారు, మన దేశం కాని దేశం వారు, మన తెలుగు భాషను 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ' అని కితాబు నిచ్చారు. 

                       ఇప్పటి కైనా మేల్కోండి.  కన్నతల్లి లాంటి తెలుగును మరుగున పడేయకండి. పరభాష దాస్య శృంఖలాలలో చిక్కుకున్న తెలుగు భాషను కాపాడండి. చీకట్లో మగ్గిపోతున్న తెలుగును, వెలుగు లోనికి తీసుకుని రండి. అప్పుడు ఆ తెలుగు విరజిమ్మే కాంతులు మీరే ప్రత్యక్షంగా చూద్దురుగాని. అవి మీ అజ్ఞానపు తెరలను పోగొడతాయి. మీ ఔన్నత్యాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. 

                  మన తెలుగు వాళ్ళందరికీ నాదో చిన్న విన్నపం. దయచేసి తెలుగును ప్రేమించండి. తెలుగును నేర్చుకోండి. తెలుగు లోనే మాట్లాడండి. తెలుగు గొప్పతనాన్ని విశ్వానికి చాటి చెప్పండి. తెలుగు వాడినని గర్వంగా చెప్పుకోండి. ఇది ఈ కొత్తపల్లి దశరథరామయ్య తెలుగు భాషను కాపాడడానికి చేసే సవినయమైన విన్నపం " అని తన బాధనంతా బాధ్యతగా వెళ్ళగక్కాడు దశరథరామయ్య. 

                            ఆ యాంకర్ ఏమనుకుందో, ఏమో గానీ దశరథరామయ్య కాళ్ళ మీద పడింది. తన అశ్రువులతో ఆయన పాదాలు తడిపింది. చాలాకాలం వరకు యాంకరింగ్ చేయలేదు. పూర్తిగా తెలుగు నేర్చుకుని మరల ఛానల్ లో అడుగు పెట్టింది, రెట్టించిన ఉత్సాహంతో, నూతన ఆత్మ విశ్వాసంతో.

                        *** సమాప్తం ***

        --- కొత్తపల్లి రవి కుమార్
              రాజమహేంద్రవరం
                 9491804844     
                             
                           
                                 

0/Post a Comment/Comments