గురువు _కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం

గురువు _కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం

గురువు
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం

అజ్ఞాన తమస్సు తొలగించే వికాస మూల స్థంభమై
విజ్ఞాన ఉషస్సు కలిగించే శాశ్వత తేజస్సు కిరణమై
చిత్త భ్రమ, విభ్రాంతులను పారద్రోలే జ్ఞాన దీపమై
నిత్యం సత్యమై దారి చూపే దివ్య చైతన్య స్ఫూర్తి గురువు...!

అజ్ఞానాంధకారాన్ని తొలగించి శిష్యుల అంతఃకరణాన్ని శుద్ధి చేస్తూ
జ్ఞాన శక్తితో ఉదాత్తమైన యుక్తితో శిష్యగణ సందేహాలను నివృత్తి చేస్తూ
విద్యార్థుల అభ్యున్నతిని అహర్నిశలు ఆకాంక్షిస్తూ
సమస్త మానవాళికి సహితం విజ్ఞాన మస్తక పుస్తకమైన త్రిమూర్తుల ఆకృతి గురువు...!

తమ జీవితానికి మార్గ నిర్దేశం చేసి ముక్తి వైపు నడకలు నేర్పిన ప్రతిఫలంగా
ఆషాఢ శుద్ధ పౌర్ణమిన అంబరమంత సంబరంగా గురుపూజోత్సవం జరిపి 
కానుకలు బహుమతులు భక్తి తో సమర్పించిన శిష్యులకు
ఆశీర్వచనాలు ఇచ్చి దీవించే మహాత్మ స్వరూపుడు గురువు...!

కృతా యుగంలో పరమ శివుని జ్ఞాన గురువు దక్షిణామూర్తిగా 
త్రేతా యుగంలో యోగ ఆధ్యాత్మిక విద్యలను అందించిన దత్తాత్రేయుడుగా
ద్వాపర యుగంలో అమూల్యమైన వేదరాశిని సంస్కరించి నాలుగు వేదాలు గా విభజించిన వేదవ్యాసుడు గా
కలియుగంలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రభోదించిన  జగద్గురు ఆది శంకరాచార్యులుగా
సువర్ణాక్షరాల చరిత్ర పుటల్లో  వెలుగొందిన గురువు...!

మేధ శక్తి, ధర్మ దీక్ష,ఆధ్యాత్మిక పరిణతి జ్ఞాన పటిమలతో 
సనాతన సంప్రదాయ సారస్వత విజ్ఞానాన్ని పరిపుష్టం  చేసి
సిరివెన్నెల వెలుగులతో ఆర్ష ధర్మాన్ని ,ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని దీప్తిమంతంగా ఆవిష్కరించి 
తాను దర్శించిన బ్రహ్మ తత్వాన్ని ,బ్రహ్మ సూత్రాలుగా ప్రకటించిన వ్యాస మహర్షి గురోర్గురువు...!

చతుర్విధ పురుషార్ధాల సాధన కోసం
పంచమ వేదమైన  మహా భారతాన్ని సృజించి 
భారత జాతికి అమూల్యమైన కానుక అనుగ్రహించి 
నాలుగు ముఖాలు లేని బ్రహ్మగా
రెండు చేతులే ఉన్న విష్ణువుగా
ఫాలనేత్రం లేని పరమేశ్వరుడిగా
గురు పరంపరకు ప్రతి నిధిగా వ్యాసుడు గురువులకే గురువు...!


0/Post a Comment/Comments