అన్నదాత (ఆటవెలది పద్యాలు) --తాళ్ళపల్లి భాగ్యలక్ష్మి

అన్నదాత (ఆటవెలది పద్యాలు) --తాళ్ళపల్లి భాగ్యలక్ష్మి


నా ఆటవెలది పద్యాలు

1. వర్షమొచ్చినంత హర్షముబొందేను
    పొలముసాగుజేయ హలముబట్టి
    రైతుకదిలెజూడు రతనాలుపండించ
    ధరణిజనులకాచు ధన్యుడతడు
2. సాగుమొదలుబెట్ట సాగేనురైతన్న
    దుక్కిదున్నియతడు చక్కగాను
    పంటలన్నివేసి పరవశమునుబొందు
    బువ్వపెట్టురైతు బుద్దిజీవి
3. తొలకరిచిరుజల్లు తొంగిచూసెభువిని
    విత్తనాలుజల్లి విరతిలేక
    కంటినిదురగాచి కాపాడిపంటను
    కన్నతల్లివోలె కడుపునింపు
4. మన్నుదున్నిరైతు మిన్నువైపునగాంచు
    అవనికన్నమిడగ నాశతోడ
    పుడమిపుత్రునిగని పులకించునేలమ్మ
    మట్టిలోనమెరియు మాన్యుడనుచు
5. రైతు కలతచెంది రందిపడినవేళ
    నీరసించుజగము నిజముగాను
    అన్నదాతలేక నవనికివెలుగేది
    హాలికుండుజూడ హరునిబోలు

      ✍️తాళ్ళపల్లి భాగ్యలక్ష్మి(టీచర్)
           రాజన్న సిరిసిల్ల జిల్లా
     

0/Post a Comment/Comments