అన్నదాతకందరూ శతృవులే !... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

అన్నదాతకందరూ శతృవులే !... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

అన్నదాతకందరూ శతృవులే !

ఆకాశానికి
చిల్లిపడిందా? కాదు...కాదు
రైతుకళ్ళకు చిల్లిపడి
"కన్నీటి కుంభవర్షం" కురిసింది

చెరువులకు‌
గండి పడిందా? కాదు...కాదు
లయతప్పిన,వ్యధనిండిన
రైతుల "గుండెలకు గండి" పడింది

కాపుకొచ్చిన పంట
కొట్టుకుపోయిందా ? కాదు...కాదు
నిన్న రైతులు కన్న "కమ్మనికలలు"
రేపటి "కోటిఆశలు"...కొట్టుకుపోయాయి

రోడ్లు రహదారులు
తెగిపోయాయా ? కాదు... కాదు
మొన్న ఆకలి ఆకలంటూ కేకలు పెట్టిన
నిన్న రాక్షసరాజకీయాలను‌ ప్రశ్నించిన
రైతన్నల "గొంతుకలు"....తెగిపోయాయి

మొన్న కరువు......కరాళ నృత్యం...
నిన్న కరోనా.....విలయతాండవం...
నేడు అతివృష్టి...ప్రకృతి ప్రళయం...
అన్నీ అన్నదాతలకు బద్దశత్రువులే...

ఈ శతృవుల్ని ఈ అదృశ్యశక్తుల్ని
ఎదుర్కోవాలంటే...చుట్టుముట్టే
ఈ సమస్యలను....తట్టుకోవాలంటే
అన్నదాత వెన్ను...విరిగిపోకముందే
కన్నుమూసి
వృక్షంలా...ఒరిగిపోకముందే
మంచుముక్కలా...కరిగిపోకముందే
మాయమై పోకముందే
"ఆత్మబంధువులై" అధికారులు
అన్నదాతల్ని ఆదుకోవాలి
ప్రభుత్వం‌ ప్రతిరైతుకు "ప్రాణబిక్ష" పెట్టాలి

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్....9110784502


 

0/Post a Comment/Comments