మారజనకునకు మంగళమ్ --డాక్టర్ అడిగొప్పుల సదయ్య, అధ్యక్షుడు, మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం.

మారజనకునకు మంగళమ్ --డాక్టర్ అడిగొప్పుల సదయ్య, అధ్యక్షుడు, మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం.

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో....

మారజనకునకు మంగళమ్

నడిరేయి చెరశాల సడికాక జనియించి
జడుల మాపిన నీదు జన్మముకు మంగళమ్

ఛాణూర మల్లురుల,శకటాది రక్కసుల
మట్టుబెట్టిన నీదు దిట్టతకు మంగళమ్

దామోదరుడవయ్యి తల్లిచే రోళ్ళకును
నిలిచి మెరిచిన నీదు సులభతకు మంగళమ్

తడిలేని యెడదగల చెడుగరము కంసుణ్ణి
కడతేర్చినట్టి నీ పిడికిలికి మంగళమ్

వేలమును ధరియించి ఆలమందల మేపి
పాలు త్రాగిన నీదు పాలనకు మంగళమ్

నీలతోయద వపువు,నేలనేలెడు నేర్పు
మేళవించిన నీదు మెరుపునకు మంగళమ్

కాళింది ఫణములను కమనీయ నాట్యమున
హ్లాదమిచ్చిన నీదు అడుగులకు మంగళమ్

బేలగొల్లలగాచి మేలి పనులను చేసి
బతుకు దీర్చిన నీదు పాటికిని మంగళమ్

పాండవేయుల పట్ల పక్షపాతము నెరపి
కడవరకు తోడున్న కరములకు మంగళమ్

పవరమే శరణమని వర్తనమె తరుణమని
గీత గీసిన నీదు కేతకును మంగళమ్

జడి =కష్టం
దిట్టత=బలం
చెడుగరము=క్రూరుడు
హ్లాదం=సంతోషం
పాటి=న్యాయం, పద్ధతి
పవరం=యుద్ధం
వర్తనం=నడవడి
కేత = తలపు,బుద్ధి

డాక్టర్ అడిగొప్పుల సదయ్య
అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
9963991125

0/Post a Comment/Comments