వందేమాతరం, ఏమైపోతోంది ఈ తరం!----కొత్తపల్లి రవి కుమార్

వందేమాతరం, ఏమైపోతోంది ఈ తరం!----కొత్తపల్లి రవి కుమార్

వందేమాతరం, ఏమైపోతోంది ఈ తరం!

మత విద్వేషాల జ్వాలలతో రగిలిపోతోంది ఈ తరం,
కుల జాడ్యాల కుడ్యాలతో అంతరాలను సృష్టించుకుంటోంది ఈ తరం,
వందేమాతరం, ఏమైపోతోంది ఈ తరం!

ప్రాంతాల సరిహద్దుల గుద్దులాటలతో పొద్దు పోనిచ్చుకుంటోంది ఈ తరం,
నదీ జలాల వాటాల కోసం పానీపట్టు యుద్ధాలు చేస్తోంది ఈ తరం,
వందేమాతరం, ఏమైపోతోంది ఈ తరం!

అంచనాలకందని లంచాలను దోచుకొంటూ బతుకుతోంది ఈ తరం,
పంచన చేరిన వారినే అరాచకంగా వంచన చేసి, మంచిని మరచిపోతోంది ఈ తరం,
వందేమాతరం, ఏమైపోతోంది ఈ తరం!

అత్యాచారాల ఆచారాలతో అట్టడుగు పోతోంది ఈ తరం,
నికృత్యాల వికృత చేష్టలతో భ్రస్టు పట్టిపోతోంది ఈ తరం,
వందేమాతరం, ఏమైపోతోంది ఈ తరం!

కడుపు నింపుకోవడానికి కడుపున పుట్టిన బిడ్డలను అమ్ముకుంటోంది ఈ తరం,
కాటికి కాలుచాచిన కన్నవాళ్ళని వృద్ధాశ్రమానికి చేరుస్తోంది ఈ తరం,
వందేమాతరం, ఏమైపోతోంది ఈ తరం!

----కొత్తపల్లి రవి కుమార్ 
     రాజమహేంద్రవరం
        9491804844

0/Post a Comment/Comments