అతనొక ఎర్ర సైన్యం...! --కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)

అతనొక ఎర్ర సైన్యం...! --కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)



అతనొక ఎర్ర సైన్యం...!
--కొంపెల్లి రామయ్య(యామిని తేజశ్రీ)

అతనొక ఎర్ర సైన్యం
అతనొక తొలి విద్యార్థి ఉద్యమ కెరటం
అతనొక తెలంగాణ సాయుధ పోరాట  బందూకం
అతనొక నిజాం నిరంకుశ పాలనపై గళమెత్తిన ధిక్కార స్వరం!
అతను బాల్యం లోనే జాతీయ భావాలను అణువణువున వీరగంధంలా
పూసుకున్న చైతన్యకిరణం
అతను సామాజిక రుగ్మతలను
గడగడలాడించిన కంఠీరవం
అతను నిజాం నిషేధిత మిజాన్
పాత్రికేయ ఉషాకిరణం!
అతను అణచబడిన కార్మికుల
గుండెచప్పుడైన కార్మిక నేత
అతను పీడిత ప్రజల పక్షపాతియైన కమ్యునిస్టు విధాత
అతను జాల్నా జైళ్లో  ఖైదీలతో
సమ్మెచేయించిన విజేయుడు
అతను ఆజన్మ బ్రహ్మచారి యై
ప్రజాజీవితం కోసం అంకితమైన విప్లవ సూరీడు!
అతను ప్రజాస్వామ్య పరిరక్షణకై
చట్టసభల్లో గళంవిప్పిన ప్రజాపక్షపాతి
అతను జీవహింస జనజీవనం కాదని
ఎదురొడ్డి ఎదిరించిన ఆర్యసమాజ్ సారధి
అతను భారత్ ప్రభుత్వ తామ్ర పత్ర పురస్కార కీర్తి కిరీటధారి‌
అతను ప్రజల గుండె గుడిలో
కొలువైన రుధిర వర్ణ పులి!
అతను భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ని పర్వత లావా
అతను చీకటి అతుకుల బ్రతుకుల్లో
చైతన్యం మేల్కొల్పిన జ్ఞానోదయ వేగుచుక్కా
అతడే ! అసామాన్యుడైన సామాన్యుడు
బొమ్మగాని ముత్తిలింగయ్య గౌడ్ పద్మల పుణ్యఫలం
నల్లగొండ  ఉద్యమ ఉక్కు పిడికిలి
ధర్మాన్నే మనకు భిక్షగా ఇచ్చిన
ధర్మభిక్షం నామధేయుడు!అందరికీ ఆత్మీయుడు!
అతనికి నా బిగించిన పిడికిలితో
ఆకాశం దద్దరిల్లేలా జోహార్... జోహార్... !




0/Post a Comment/Comments