రచన : E.V.V.S. వర ప్రసాద్, తుని.
మాతృభాష మధురం
భాష లెన్నొ గలవు భరతఖండమునందు
నేర్వవచ్చు నీవు నేర్పు గాను
ఇలను కలను నైన ఇసుమంత విడలేము
మాతృభాషకన్న మిన్నలేదు
పక్షి జంతుజాతి పరభాష నేర్వదు
తల్లిననుకరించి తనరుచుండ
అన్యభాష నేర్చి అహమునొందక నీవు
పరవశింపు మాతృభాషతోనె
తల్లి పలుకు భాష పిల్లలాడుచునుంద్రు
తనివితీర మురియ తల్లి భాష
మధుర భావములను మనసార తెలుపంగ
మాతృ భాష కన్న మధురమేది?
కవులు మెచ్చు నట్టి కవనమలరుభాష
అష్టదిగ్గజ కవులాదరించ
ఎల్ల నృపులు గొల్చి యెరిగినట్టిదియైన
తెలుగు భాష కన్న తీపి ఏది?
అధ్భుతంబు మేటి యవధాన విద్యకు
పుట్టినిల్లు తెలుగు పుడమియందు
జనని భాష విడకు జగమంత దిరిగినా
మాతృభాష నెపుడు మరువ రాదు
✍️ రచన
E.V.V.S. వర ప్రసాద్ ,
తెలుగు ఉపాధ్యాయుడు,
ఊరు : తుని.
జిల్లా : తూర్పు గోదావరి
చరవాణి : 8019231180