Pravahini - The Channel of Telugu Literature and Culture - eMagazine ప్రవాహిని - ఆగస్ట్, 2021.

Pravahini - The Channel of Telugu Literature and Culture - eMagazine ప్రవాహిని - ఆగస్ట్, 2021.

 సంచిక:1 సంపుటి:5                                                                              ప్రవాహిని - ఆగస్ట్, 2021































ప్రవాహిని - అంతర్జాల సాహిత్య పత్రికలో మీ రచనలు  ప్రచురించుట కొరకు 

రచనలు పంపాల్సిన మెయిల్ ఐడి కై  పూర్తి వివరాలతో పాటు మీ రచన జతచేసి ఈ కింది నెంబర్ లో వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు.

6302324734 (WhatsApp Only)















హల్లో! సీనియర్ సిటిజన్స్


కాలచక్రం తిరుగుతూ

నిన్నటి యవ్వన మాధుర్యనుండి

ముందుకు నడిపింపింది

మన యవ్వనం ఎక్కడకు పోలేదు

మన అబ్బాయిలకో అమ్మాయిలకో

వారి అబ్బాయిలకో అమ్మాయిలకో ఇచ్చింది

అందువల్ల ఏదో పోయిందనే బాధ వద్దు


శరీరం  పని చేసి పని చేసి అలసిపోయింది

కాస్త విరామం అవసరం

క్రమంగా  విరామ జీవితం గడపాలి


అజమాయిషీలు తగ్గించుకొని

ప్రకృతిని ఆస్వాదించడం మంచిది

మన పెరటిలో చెట్లను చూడండి

పండుటాకులను వదలించుకుంది

పరిమళం ఇచ్చే పూలను చూడండి

ఉదయం ఎంతో అందంగా ఉంటాయి

సాయంకాలానికి వాడి పోతాయి

అయినా విచారించవు

కొత్త పూలకు అవకాశం ఇస్తాయి


చివరి వరకూ ఇహపర బంధాలతో

ముడి పడక,

ఆధ్యాత్మిక చింతన,

సంగీత సాహిత్యాలపై అభిరుచితో గడుపుదాం


"తన కోపమె తన శత్రువు,

తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ


తన సంతోషమె స్వర్గము,

తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతి!"

అన్న సూత్రాలను ఆచరిద్దాం


స్నేహితులతో గడపడం

ఎంతో ప్రశాంతత ఇస్తుంది

కనీసం ఫోన్ లో తరచు హల్లో చెప్పండి,

మరీ ఏదోచేయాలని తపన ఎక్కువ ఉంటే

మీ జీవితం ఎలాగడిచింది

సింహావలోకనం చేసుకుంటూ

ఓ ఆటో బయగ్రఫీ రాయండి

మీ వారసులకు ఉపయోగపడుతుంది


కడుజాగ్రత్తగా శేష జీవితం గడుపుతూ,

సాగి పోదాం చీకు చింతా లేకుండ

సీనియర్ సిటిజన్స్ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు


-డా వి.డి.రాజగోపాల్,

9505690690.





 


నా భారతం! కొన్ని మెరుపులు, కొన్ని మరకలు!

 నా భారతం ఒక అత్యుత్తమ సంస్కారానికి నెలవు. అహింస, సత్యం, ధర్మం, క్షమ వంటి వేళ్ళు ఈ భువిలో సుస్థిరం గా లోలోతులకు పాతుకుపోయాయి. జాలి,దయ,దానగుణాలతో పాటు  ‘సర్వేజనాః సుఖినో భవంతు’ వంటి అత్యున్నత ఆదర్శాలకు  కొలువు.

‘మానవ జీవితానికి కుటుంబం ఊయల వంటిది’ అంటాడు సుప్రసిద్ధ గ్రీకు  తత్వవేత్త అరిస్టాటిల్. అటువంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో  ఒకప్పుడు ఎన్నో నీతికథలు,శతకాలు,నైతిక.విలువలు నేర్పడంజరిగేది. చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు, యక్షగానాలు, హరికథలు, బుర్రకథలు,నాటకాలు అలరించి ఆనంద పరచేవి. సమాజానికిచెప్పాల్సిన నీతి బోధలు, ఉద్యమాలు హృద్యంగాచెప్పబడేవి. పెద్దలంటే గౌరవం, చిన్నలంటే అభిమానం, పరస్పర ఆదరాభిమానాలు ఉండేవి. వ్యవసాయ ప్రధానదేశం కాబట్టి స్వాతంత్ర్యానంతరం ప్రణాళికా బద్ధంగా పరిశ్రమలు, వాణిజ్య సంబంధిత ఎగుమతులు, దిగుమతులు కొన్నిజరిగాయి. ఆర్థికాభివృద్ధి తోపాటు విదేశీ మారక ద్రవ్యం లభించింది. జనాభా పెరిగింది. నిరుద్యోగం, చిరుద్యోగ సమస్య పెరిగింది. స్వార్థం, లంచగొండితనం, ఆశ్రితపక్షపాతం పెరిగాయి. కుల మత వైషమ్యాలు, అంటరానితనం, మహిళలపై వివక్ష అక్కడక్కడా ఇప్పటికీ పడగలు విప్పుతున్నాయి. ‘సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి’ అంటాడు శ్రీ శ్రీ.  అమ్మాయిలు అంతరిక్షం వరకూ వెళ్ళారు. అది చాలదన్నట్లు ఆకాశంలోనూ సగభాగమయ్యారు. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించారు. నవకల్పనలు, సరళీకృత ఆర్థిక విధానాలు ఒక పక్క, దేవాలయ విగ్రహ ధ్వంసాలు, కుంభకోణాలు, కుల గజ్జి మరోప్రక్క నెలకొన్నాయి. రాజకీయ హత్యలు, రైతుల ఆత్మ హత్యలు, మానభంగాలు, అనైతిక కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. 

నా భారతి  చెదరని చిరునవ్వుతో క్షితి నుండి క్షిపణి వరకు కాంతి కిరణమై దూసుకు పోతుంటే, మోయలేని బరువు తో పుస్తకాలు వీపు పై వేసుకున్న పాపాయి గుర్తొస్తుంది. ఆ శుష్క హాసం గుండెను చురుక్కుమనిపిస్తుంది. ఐక్యరాజ్య సమితికి యోగా భిక్ష బెట్టి, ప్రపంచానికే కరోనా మందును పంపిన స్థాయి మనదని ఆనంద పడాలో, నిత్యం జరిగే దారుణాలు చూసి కుమిలి పోవాలో తెలియని మానసిక స్థితిమనది. వేదాలకు, ఇతిహాసాలకు, ఆర్ష ధర్మానికి ప్రతీక యైన రాముడు, బుద్ధుడు పుట్టిన దేశమని గర్విద్దామా!? కూటికి, గుడ్డకు కూడా కరువైన మానవాళిని చూసిగర్హిద్దామా!? తేల్చుకోలేని పరిస్థితి! అభివృద్ధి ఆకాశం అంటింది. 

పాపం కూడా కొండలా పెరిగింది. స్వార్థం పడగలు విప్పింది. ఫలితంగా హైడ్రో ప్రాజెక్టుల నిర్మాణం పర్యావరణ కాలుష్యానికి దారితీసింది. ప్రకృతి ఉత్తరా ఖండ్ వరదలు, లైలా, హుదూద్ తుఫాన్లు, భూకంపాలు, ఉప్పెనలతో పగతీర్చుకుంది. పేరు ఏదైతేనేం ప్రళయం, విధ్వంసం జరిగాయి. నోబెల్ బహుమతులతో పాటు అనేక శాస్త్ర రంగాలలో సర్జికల్ స్ట్రైక్ వంటి విషయాల్లో  విజయాలు సాధించాం. ఆటలలో పతకాలు యెన్ని వున్నా నిత్యం ఎక్కడో ఒకచోట మానవత్వం మంటగలిపే దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బంధాలను మరచిన హింసలు, శాడిజం ప్రవృత్తులు బయటపడుతూనే ఉన్నాయి. నా భారత మాతకు మాత్రం తన పొగరు జూపడానికి,  హైందవ కీర్తిని విదేశాలలో విహరింప జేయడానికి ఆధర్మ చక్రం, ధార్మికత చాలు. ఈ దేశం లో ప్రతివాడు పౌరుషం తో ఉరకలు వేయాలి. మన  త్రివిధ దళాల సిపాయిల త్యాగాలు మాత్రమే కాదు- మన దేశభక్తి కూడా అవసరం దేశం వెలుగులు నలు దిశలా వెదజల్లేందుకు. ప్రపంచానికే మకుటాయ మానంగా వెలుగొందడానికి ఇది చాలు. 

అందుకే శేషేంద్ర అంటారు ‘నేను పిడికెడు మట్టినే కానీ నాకు ఒక దేశపు జెండా కున్నంత పొగరు ఉంది’ అని. యువత ఎక్కువ వున్న దేశం మనది. అందుకే వివేకానందుడు ‘ఉక్కునరాల యువతను ఇవ్వండి. అద్భుతాలు చేస్తానం’టాడు. ఈ 75 సంవత్సరాల కాలంలో కొన్ని మెరుపులు, కొన్ని మరకలు రెండూ ఉన్నాయి. గాంధీజీ,నెహ్రూ తదితర నాయకుల విజయాలతో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి అదృశ్యం;  బాపు,ఇందిర,రాజీవ్ గాంధీల హత్యలు వంటిమరకలుకూడావున్నాయి.

‘పదండి ముందుకు పడం డి తోసుకు పోదాం! పోదాం! పైపైకి’ అని ఎవరికి వారు ప్రేరణ నిచ్చుకుంటే తప్ప నీతిగా బ తికితే తప్ప సామాన్యుడు బతికి బట్ట గట్ట లేడన్నది నిర్వివాదాంశం! నాకీ అవకాశం ఇచ్చి ప్రేరణ కలిగించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపు కుంటూ...స్వస్తి!


-బి హెచ్.వి.రమాదేవి

ఎం.ఏ.,ఎం,ఏ.,ఎం.ఫిల్., ( పిహెచ్.డి)

తెలుగు లెక్చరర్, రాజమహేంద్రవరం.

చర వాణి: 6305543917.






జోహార్ జయ శంకర్


నిండు బాధలఉరిమె మేఘం

వర్షించే చిరునవ్వుల మోహం

మంచు గడ్డల కరిగే హృదయం

రగలే నిప్పు , వీచె వాయువు

జనగర్జనవై కదలే కడలి....


జై తెలంగాణ నినాదపిడుగై

మండే మంటతో ఎత్తన పిడికిలి

బడిలో గుడిలో జన సందడిలో

తెలంగాణమే ఉపిరి పాటగా రాష్ట్ర సాధనే ఉద్యమ బాటగా


అక్రందనలు ఆవేదనలు ఆఖరి మజిలి కాదంటూ...

పిడికిలి పీడియే నీ చేయి కన్నీటి తడిని తుడ్చేయ్....

అంటూ విషవృక్షాల పెకలింప విషయమేమిటో వివరించి


విశాదంలో వినయంగా విజయ శంఖమే ఆశించి

విద్యాలయల క్షేత్రంలో పొరాట మొక్కలు నాటించి

వీర కుసుమాలు పూయించి


అమరవీరుల నేత్తుటి మరకల తిలకంగా

తెలంగాణ రణరంగాన ఆత్మఘోషణై

మన అత్మీయ ఉద్యమ పితమౌహుడుగా

ప్రతివాడికి పోరాట గుత్పను అందించి

సమరశిలగ మిగిలిపోయిన ఆ బ్రహ్మచారి


ఆధిపత్యాల అణచివేతలో

అసువులు బాసిన అమర వీరుల ఊపిరివై

ఉద్యమపాఠాల మాష్టారుగా

ఆత్మాగౌరవపు పచ్చని చీరను

తెలంగాణకు కట్టాలంటూ....


కలలు గన్న సిరచుక్కతో వేగు చుక్కల

వెలుగు చూపినాడు జయ శంకర్

అమర్ హై అమర్ రహేగా !

హమారే మంజిల్ ఇ మక్సద్

జైయహై జయ జయ జయశంకర్....



-మురళీ జాదవ్, ఉపాద్యాయులు,

ఉట్నూర్ , ఆదిలాబాద్ జిల్లా, 9492539553.



వీరసైనికుడు మానవుడు 

కలియుగంలో మానవుని పయనం 

సుదూరమైంది సుదీర్ఘమైనది 

జగత్తులో అద్భుతాలు సృష్టించే 

గొప్పమేధావి ఆధునిక మానవుడు 

ఆశతోను ఉన్నతాశయంతోను 

బతుకుతున్న సాధారణ మానవుడు 

ఆదికాలం నుండి ఆధునికకాలం వరకు 

ఎన్నో ప్రకృతి వికోపాలకు గురై 

దివ్యౌషధాలతో ఎదిరించి 

నిలబడ్డ వీరసైనికుడు 

నాడు రణరంగంలో రక్తంచిందించి 

విజయంకోసం పోరాడే వీరసైనికుల్లా 

నేడు కరోనారక్కసి చిమ్మే 

విషపుగాలులకు బలికాకుండా 

కురుక్షేత్రంలో నారాయణాస్త్రానికి 

వీరులంతా అస్త్రసన్యాసం చేసినట్టు 

మనవారినంతా జాగరూకతతో 

నడుచుకోవాలని సూచించి 

వ్యూహంతో కరోనారక్కసిని ఎదిరిస్తే 

మానవుడు నిలకడగా బతుకుతాడు 


-ఆచార్య ఎం.రామనాథం నాయుడు, 

మైసూరు, 8762357996.




అందరూ బాగుండాలి..!


అందరూ బాగుండాలని

కోరుకుంటేనే..మనకు కూడ 

మంచి జరుగుతుంది..!


పైనున్న దేవుడు చూస్తుంటాడు..

ఎవరి బుద్ధి ఎలాంటిదో నన్న విషయాన్ని కనుగొంటాడు..!


తనకు మాత్రమే మంచి కావాలి,

పరులకు చేటు కావాలనే దుర్గుణం ను 

మనుష్యులు కాదు కదా దేవుడు సైతం ఒప్పుకోడు..!?

నిలువెల్లా స్వార్థం ఉండి, 

ఏమాత్రం సాయం చేయని తత్వాన్ని దేవుడు హర్షించడు..!


తోటి వారి మంచి కోరి, మసలు కొనేవారినకి మాత్రమే 

సుఖ శాంతులు ప్రసాదిస్తాడు..!

తను బాగుపడి,పొరుగువారు నాశనం కావాలనే వారికి 

దేవుడూ తగిన శాస్తి చూపిస్తాడు..!


అందరూ బాగుండాలి, 

అందులో నేనూ ఉండాలి నన్న స్పృహ ఉండాలి..!

అప్పుడే దేవుడు సంతోషిస్తాడు..! వరాలు కురిపిస్తాడు..!??


-విన్నర్-ముహమ్మద్ ముస్తఖీమ్,

కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.


తెలంగాణ పితామహుడు


అతని మాటల మమకారాన్ని జూసిన 

తెలంగాణ నేలతల్లి మురిసిపోయెనెంతగానో...


అతడు నడిచిన దారుల్లో ఎగిసిపడిన ధూళి 

నవచైతన్యపు బలాన్ని పుంజుకుని..

కెంజాయి వర్ణంలో కొట్టిన కేరింతలెన్నో ..


వనరులెన్నో మాకున్నాయ్..

మా అధికారం మాక్కావాలంటూ..

ఉద్యమానికి గొంతెత్తి గల్లీల నుంచి ఢిల్లీయే కాదు 

ఖండాంతరాలదాకా వినిపించిన తెలంగాణ సిద్దాంతకర్త గొంతుకది..


పోరాట పఠిమనెంతో గలిగి

నిత్యశోధనలతో నిరంతర విద్యార్థియై..

విశాలాంధ్రను ఎండగట్టిన ధీశాలి ఆజన్మంతపు బ్రహ్మచారినే..


తెలంగాణోద్యమానికంకితమై నవయుగ భీష్ముడిగా నిలిచిన మేథావి..

బహుభాషా సంపన్నుడు మాత్రమే కాదు మేటి గుణసంపన్నుడు కూడా...

మార్గదర్శక సలహాలనందించి..

మేలైన దారులలో పాలకులను సైతం నడిపిన తెలంగాణ పితామహుడు..


కమ్ముకున్న కారుచీకట్లను తరిమి

తల్లడిల్లుతున్న తల్లిని కాపాడాలని

వదలని అభ్యుదయవాదాన్ని భుజానేసుకుని..

కలలు కన్న తెలంగాణాను

కండ్లారా చూడాలంటూనే..

తీరని కలతో కండ్లు మూసిన మహనీయుడు

నేటికీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో పదిలమై నిలిచిన..

మహోన్నత తేజోమూర్తుడు మన ఆచార్య జయశంకరుడు..


-శ్రీలతరమేశ్ గోస్కుల

హుజురాబాద్.


 



అపకారికి ఉపకారం...!

_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం


అనగనగా ఓ కుందేలు పిల్ల. అది తోవ తప్పింది. వెళుతూ వెళుతూ సింహ గుహలోకి వెళ్ళిపోయింది. నిద్రపోతున్న సింహంపైకెక్కి జూలు పట్టుకొని ఆడుకోవడం ప్రారంభించింది. సింహానికి మెళుకువ వచ్చింది. కోపం వచ్చింది కూడా. చిన్నపిల్ల దీనికేం తెలుస్తుంది పాపం. సింహానికి జాలేసింది. 


ఎలాగైనా వాళ్ళమ్మ దగ్గరకు చేర్చాలనుకొంది. అంతలోనే అటుగా వచ్చిన నక్కను పిలిచి "ఓయ్ నక్కా! ఇలారా! ఈ కుందేలు పిల్ల తప్పిపోయి ఇలా వచ్చింది. దీన్ని వాళ్ళమ్మ దగ్గరకు చేర్చు" అంటూ ఆజ్ఞ జారి చేసింది. దానికి నక్క "సరే సింహం రాజా! మీ ఆజ్ఞను శిరసావహించి ఈ చిట్టి కుందేలును తన తల్లి దగ్గరకు చేరుస్తాను" అంటూ అక్కడి నుండి కుందేలు పిల్లతో బయలు దేరింది నక్క. 


మార్గ మధ్యలో నక్కకు ఓ పాడు బుద్ధి పుట్టి  "ఈ పూటకు  నేను ఆహారం కోసం వెతుక్కోవాల్సి న పని లేదు ఈ కుందేలు పిల్లను తింటే సరి పోతుంది కదా!" అనుకుంటూ బయలు దేరింది. మార్గ మధ్యలో చిట్టి కుందేలును చంపి తినడానికి ప్రయత్నించింది నక్క. 


కుందేలు పిల్లకు ఏమీ చేయాలో తోచక దాని బారినుండి బయట బడాలని ఒక్క ఉదుటున పరుగు లంఘించింది కుందేలు పిల్ల. అంతలో నక్క తేరుకొని దాన్ని పట్టు కోవడానికి పరుగెత్తడం ప్రారంబించింది. ఇలా పరుగెత్తి పోయే మార్గమధ్యలో వేటగాడు వేసిన వలలో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటూ "నన్ను రక్షించండి... నన్ను రక్షించండి" అంటూ అరుస్తుంది నక్క. 


దానిని గమనించిన కుందేలు పిల్లకు జాలి కలిగి దాని మిత్రుడు ఐన చిట్టెలుక వద్దకు పోయి జరిగిన విషయం చెప్పి దానిని ఎలాగైనా రక్షించమని కోరింది. మొదట ఒప్పుకోక పోయిన తన స్నేహం మీద గౌరవంతో వలను కొరికి వలలో చిక్కుకొన్న  నక్కను కాపాడింది. తాను చేసిన పనికి సిగ్గు పడి నక్క కుందేలు పిల్లకు క్షమాపణ చెప్పి  జాగ్రత్తగా   తన తల్లికి ఒప్ప చెప్పి చేసిన తప్పుకు చింతిస్తూ అక్కడి నుండి వెళ్లి పోయింది. 


నీతి:  శత్రువైన కాపాడమని కోరినప్పుడు కాపాడడం మన ధర్మం




" తెలుగుభాషాదినోత్సవం "


గిడుగురామ్మూర్తి ఇల జన్మదినము

వ్యావహారిక భాషకు శుభదినము

తెలుగోళ్లకు భువిలో పర్వదినము

చూడచక్కని తెలుగు సున్నితంబు!


గురజాడ, గిడుగు అందరి త్యాగము

తెలుగువారు చేసిన పుణ్యఫలము

వాస్తవమే! పూర్వజన్మ సుకృతము

చూడచక్కని తెలుగు సున్నితంబు!


ఎన్నో ఉద్యమాలు చేసినారు

త్యాగాలతో అసువు పోసినారు

రచనలతో అందము తెచ్చినారు

చూడచక్కని తెలుగు సున్నితంబు!


వ్యావహారిక భాష అతిమధురము

ధరలో పరిమళించు పూలవనము

పసిపాప చిరునవ్వులా అందము

చూడచక్కని తెలుగు సున్నితంబు!


మాతృభాష పరిరక్షణ బాధ్యత

అభివృద్ధి చేయాలోయ్  అంచేత

వీడాలి అందరు ఉదాసీనత

చూడచక్కని తెలుగు సున్నితంబు!


-గద్వాల సోమన్న



హృదయ కాలేయం


పిడికెడంత హృదయానికి 

సంవేదనలు ఎన్నని?

మనసు మురిసినా,

బాధతో ముక్కలైనా,

బరువెక్కి భారమవుతూనే ఉంటుంది.

స్పందనలతో తల్లడిల్లి,

సంతోషాలతో ఉబ్బితబ్బిబ్బై,

నిరంతర సజీవ రాగాలు

పలుకుతూనే ఉంటుంది.

పరిమళాలు వెదజల్లుతూనే ఉంటుంది.

ఇష్టం కాని బందీ కావడం నచ్చని స్వేచ్ఛా సముద్రమది.

ఉవ్వెత్తున అలలు ఎగిసినా,

ప్రశాంతంగా సాగిపోయినా,

స్థితప్రజ్ఞత గల జీవమది.

అణచివేసినా,అడ్డంకులు కల్పించినా,

అలుపెరుగని స్పందనల అమృమది.

హృదయ కాలేయం స్వేచ్ఛనే కాంక్షిస్తుంది.



-డా.రామక కృష్ణమూర్తి, 

బోయినపల్లి, మేడ్చల్.



రాఖీ పండగ పర్వదినం


బంధాలను బలోపేతం చేసే అనుబంధం

ప్రేమను పంచే అనురాగం 

ఆత్మీయత పంచే మమకారం..

అన్నీ కలగలిసిన అపురూప పర్వం "రక్షాబంధనం".


తొడబుట్టిన వారిని దగ్గర చేసే పర్వదినం..

అన్నచెల్లెల్ల అక్కతమ్ముళ్ల మధ్య 

ప్రేమ-ఆప్యాయతలు పంచే శుభదినం.


సోదరులు చేపట్టే ప్రతి సత్కార్యం 

సాధించాలి విజయం అని కోరుతూ 

గుర్తుగా కట్టే రాఖీబంధనం సోదర సోదరిల మధ్య 

ముడిపడిన బంధంను గుర్తుచేయు పర్వం.


సోదరసోదరీమణుల మధ్య

జరుపుకునే ఈ పర్వదినం

గుర్తుగా రాఖీని కట్టి రక్షణ

కల్పించమనితెలిపేసందర్భం


అనురాగం ఆప్యాయత కలబోసిన

ఈరాఖీ పర్వదినం

ప్రతి ఇంటా వెల్లి విరియాలి ఆనందం..!

శుభములనిస్తూ కలగాలి సంతోషం..!!


- ఎన్. రాజేష్,ఎమ్మెస్సి,

 కవి,జర్నలిస్ట్, హైదరాబాద్.










భువిపై నవస్వర్గం


ప్రాణవాయువుకు చెట్టు కొమ్మలే

పట్టుగొమ్మలని గ్రహించు

అడుగడుగునా మొక్కల్ని పెంచుదాం

అవని అంతా హరితమయం చేద్దాం

నాటిన ప్రతి మొక్కను వృక్షంగా చూద్దాం

నీరు పోసి ఎదిగేవరకు రక్షణనిద్దాం

మొక్కమొక్కకు నీ రెక్కల కష్టం

కావాలి ఎరువు

ఎదిగే మొక్క తరువై తీర్చాలి

నీ బతుకు బరువు

హరితహారం కావాలి అవనికి ఆసరా

జనజీవన స్రవంతికి భరోసా

మొక్కమొక్కలో ప్రాణం ఉందని తెలుసుకో

నీ ప్రాణానికి ప్రాణవాయువు ఇచ్చేదే

 నువ్వు పెంచిన తరువు

పంటపొలాలతో పురుడోసుకోవాలి అవని

హరితంతో ముదమందాలి జన జీవనం

నీ ఆశ శ్వాస హరితం కావాలి

ఆనందమయ జీవితానికి నాంది కావాలి

భవితకు చేతనైన చేయూతనందించు

ప్రాణికోటికి ప్రాణవాయువును పంచు

భువిపై " నవస్వర్గాన్ని " నిర్మించు

చేయీ చేయీ కలుపుదాం

రేపటి తరాలని నిలుపుదాం

పచ్చని మొక్కలతో అవని పులకించాలి

అణువణువు ఆనందసంద్రమై పలకరించాలి

ధరణి దశదిశలా హరితమయమై మెరవాలి

 

- వీ.వీ.ప్రసాదరావు ( చైతన్య )

 ఇంగ్లిష్ లెక్చరర్, కాకతీయ డిగ్రీ కాలేజ్, సత్తుపల్లి,  ఖమ్మం జిల్లా.



కాలం విలువ తెలుసుకో


కాలం చాలా విలువైనది

గడిచిన కాలం తీసుకు రాలేనిది

కాలం విలువ తెలుడుకోవలసినది

తెలుసుకొని బతుకు గడపవలసింది


క్షణ కాలం విలువ పరుగు పందెం లో 

తృటిలో పతకం పోయిన వారిని అడిగి తెలుసుకో

సకాలం లో బస్ ని మిస్ అయ్యి 

ఉద్యోగం కోల్పోయిన వారిని అడిగి తెలుసుకో

సకాలం లో పరీక్ష కు హాజరు కాక 

విద్యా సంవత్సరాన్ని 

కోల్పోయిన వారిని అడిగి తెలుసుకో

సకాలంలో వైద్యం అందించక 

ప్రాణం కోల్పోయిన వారి 

కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకో


సకాలంలో వర్షాలు కురియకపోతే 

పంటలు పండకపోయిన భాద 

రైతన్నలు అడిగి తెలుసుకో

సమయానికి ఉద్యోగం రాక 

నిరుద్యోగులుగా ఉన్నవారిని అడిగి తెలుసుకో

ఉన్న వయసు లో సాధించడానికి 

నిర్లక్ష్యం చేసి వయసు దాటిపోయి 

భాద పడుతున్న బాధితులను అడిగి తెలుసుకో


తెలుసుకో కాలం విలువ తెలుసుకో

తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో

కాలాన్ని సద్వినియోగం చేరుకోవడం తెలుసుకో

కాలం తో పోటి పడి విజయ తీరాలకు చేరుకో


-పసుమర్తి నాగేశ్వరరావు,

టీచర్,  సాలూరు, విజయనగరం జిల్లా, 9441530829.




నేటి యువత


సంప్రదాయం సంస్కృతి

యెరిగినా యువతరం

అయినా భ్రష్టు పట్టిస్తున్నది

మన భారతీయ తత్వం

చిరిగిన వలువలతో

తరిగిస్తున్న విలువలు

జీరో సైజు లకై పరుగులు

వేలకు వేల చదివింపులు

అధునాతన భవనంలో

మేకప్పు లతో మెరుగులు

అంగాంగ ప్రదర్శన కై ఆరాటం

పాశ్శత్ఠ్య పోకడకై పోరాటం

పైకే వెలుగు జీలుగుల జీవితం

చూస్తే ఏముంది అరువుల మయం

సాటి మనిషికై ప్రేమానురాగాలు కరువు

పాపపు మోతాదు రోజురోజుకీ పెరుగు

అన్నింటా దిగజారుడుతనం

ఆవిరవుతున్న మానవత్వం

నిండిపోయి న సంకుచితత్వం

బావురు మంటున్న బందం

మాయామశ్చింద్ర లోకం

స్వార్థపు కంపులో బతుకు నిత్యం

అందరు ఉన్నా దేనికో ఒంటరితనం

అహంకారమే నీ ఆయుధం

ఓ యువత మార్చుకో 

ఈ జీవన విధానం తెలుసుకొ 

నీ భరతమాత గొప్పతనం

చదువుకొని మసలుకో

రామాయణ బారత బాగవతం

నీ జీవన మనుగడే

నీ తర్వాతి తరానికి బాసట

ఎప్పుడు ఉండు ఉదాహరణ గా

విదేశీయులు నిన్ను చూసి నేర్చుకోనుగా

బారతమాత ముద్దు బిడ్డవై

నిలుపు నీ ఖ్యాతి శిఖరానా

సాంప్రదాయ సంస్కృతి కి నువ్వు సాక్షిగా….


-ఐశ్వర్య రెడ్డి గంట




వందేమాతరం, ఏమైపోతోంది ఈ తరం!


మత విద్వేషాల జ్వాలలతో రగిలిపోతోంది ఈ తరం,

కుల జాడ్యాల కుడ్యాలతో అంతరాలను 

సృష్టించుకుంటోంది ఈ తరం,

వందేమాతరం, ఏమైపోతోంది ఈ తరం!


ప్రాంతాల సరిహద్దుల గుద్దులాటలతో పొద్దు పోనిచ్చుకుంటోంది ఈ తరం,

నదీ జలాల వాటాల కోసం

 పానీపట్టు యుద్ధాలు చేస్తోంది ఈ తరం,

వందేమాతరం, ఏమైపోతోంది ఈ తరం!


అంచనాలకందని లంచాలను దోచుకొంటూ

 బతుకుతోంది ఈ తరం,

పంచన చేరిన వారినే అరాచకంగా వంచన చేసి, 

మంచిని మరచిపోతోంది ఈ తరం,

వందేమాతరం, ఏమైపోతోంది ఈ తరం!


అత్యాచారాల ఆచారాలతో అట్టడుగు పోతోంది ఈ తరం,

నికృత్యాల వికృత చేష్టలతో భ్రస్టు పట్టిపోతోంది ఈ తరం,

వందేమాతరం, ఏమైపోతోంది ఈ తరం!


కడుపు నింపుకోవడానికి

 కడుపున పుట్టిన బిడ్డలను అమ్ముకుంటోంది ఈ తరం,

కాటికి కాలుచాచిన కన్నవాళ్ళని 

వృద్ధాశ్రమానికి చేరుస్తోంది ఈ తరం,

వందేమాతరం, ఏమైపోతోంది ఈ తరం!


----కొత్తపల్లి రవి కుమార్, 

     రాజమహేంద్రవరం,

        9491804844.



ప్రక్రియ: సున్నితం

రూపకర్త: శ్రీమతి నెల్లుట్ల సునీత గారు


౧)

శాస్త్రీయదృక్పథం లోపించిన కారణంగా

మనలో పాదుకునే మూఢనమ్మకాలు

అజ్ఞానం అవిద్యలే ముఖ్యకారణాలు

చూడచక్కని తెలుగు సున్నితంబు...!


౨)

ఎందుకు, ఏమిటి, ఎలా...?!

అని ప్రతిదానినీ ప్రశ్నించే

పిల్లల మనస్తత్వాన్ని ప్రోత్సహించు

చూడచక్కని తెలుగు సున్నితంబు...!


౩)

రాశులన్నీ  క్రమపద్ధతిగా పరిభ్రమించేవే

రోజులన్నీ కాలానుగుణంగా సాగేవే

చెడు అనునది చేతలతోనే

చూడచక్కని తెలుగు సున్నితంబు...!

౪)

తలపై బల్లితో మరణమా...?!

విధవ ఎదురైతే అపశకునమా...?!

నీ తప్పులను కప్పిపుచ్చుకోవడమా...!

చూడచక్కని తెలుగు సున్నితంబు...!


౫)

బలహీన మనస్కులకే భయాలన్నీ

నీలోని భయమే దెయ్యం

నీ  ధైర్యమే దైవం

చూడచక్కని తెలుగు సున్నితంబు...!


-చంద్రకళ. దీకొండ,

మల్కాజిగిరి-మేడ్చల్ జిల్లా.

చరవాణి: 9381361384.


 

మనభాష(ఇష్టపది మాలిక)

        -డాక్టర్ అడిగొప్పుల సదయ్య


మధురంబు మనభాష మంజులము మనభాష

మంగళము మనభాష మంత్రమే మనభాష


మధుకంఠి రాగాలు వెదజల్లు మనభాష

మల్లె సౌగంధముల జల్లించు మనభాష


మంజీర నాదాల మనసుదోసెడు భాష

మందార యందాల మగత కూర్చెడుభాష


మహిలోన మంద్రమై మరులుకొను మనభాష

మమతానురాగాల మసలుకొను మనభాష


మకరందమును చిలుకు మన్మథము మనభాష

మధుపంబుయై మోగి మదిదోచు మనభాష


మంకురంబౌ నొకచొ, మంకిలంబౌ నొకచొ

మదకరంబౌ నొకచొ మదనాగమౌ నొకచొ


మరణమెరుగని భాష, మడమ తిప్పని భాష

మథనమై, నిరయమై మలుపు తిరిగిన భాష


మనసరియె మనభాష,మహిమాన్వితము భాష

మనభాష మనుగడకు మనసార వాడుదము



-డాక్టర్ అడిగొప్పుల సదయ్య,

జమ్మికుంట, కరీంనగర్, 9963991125.



వచ్చేసింది టీకా - పిసికేస్తాం నీ పీక...


కనికరమేలేని

కంటికే కనిపించని

ఓసీ కరోనా రాక్షసీ !

ఎక్కడ పుట్టావో ఏమో?

ఎలా పుట్టావో ఏమో ?

ఏమి తింటావో ఏమో?

మనుషుల ప్రాణాలను

మాత్రం మింగేస్తున్నావ్

మానవత్వం లేనిదానవు

మనిషికి పుట్టిన దానివి కాదు

ఏ జంతువుకో జన్మించి వుంటావ్

కారణం నీకన్నీ మృగలక్షణాలే


నీవు ఏ విమానం ఎక్కక్కర్లేదు

ఏ పాస్ పోర్టు నీకక్కర్లేదు

అన్ని దేశాల సరిహద్దులను

ఎదేచ్చగా క్షణాల్లో దాటేస్తున్నావ్

వెయ్యి అణుబాంబులు వేసినా

నాశనం కానంటున్నావ్

నాకు చావేలేదంటున్నావ్

విశ్వమంతా విస్తరిస్తున్నావ్

విచ్చలవిడిగా విహరిస్తున్నావ్

వీరవిహారం చేస్తున్నావ్

విధ్వంసం సృష్టిస్తున్నావ్

ఓసీ కరోనా రాక్షసి !

ఎందుకే మామీద నీకింత కసి?


రెప్పపాటులో మరఫిరంగులతో

యుద్దవిమానాలతో సబ్ మెరైన్లతో

బాంబుల వర్షం కురిపించి‌

ఉగ్రవాద శిబిరాలను

పేల్చి కూల్చి శత్రుసైన్యాలను

చీల్చి చండాడి మట్టుపెట్టే

అత్యంత శక్తివంతమైన

అగ్రరాజ్యాలను సైతం అల్లాడిస్తున్నావ్

అన్నిదేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్నావ్

ఓసీ కరోనా రాక్షసి ! నీకెంతటి ధైర్యమే !

మానవులమని మా చెంత మందులేదనేకదా

వచ్చేసిందే టీకా...త్వరలో పిసికేస్తాం నీ పీక...


-పోలయ్య కవి కూకట్లపల్లి,

అత్తాపూర్ హైదరాబాద్, 9110784502.

 


విచిత్రమైన యుద్ధం


మనిషిని హింసించడం యుద్దమా?

తల్లి లాంటి ఆడవాళ్లపై అఘాయిత్యానికి పాల్పడడం యుద్ధమా?

ఆడపిల్లల మానాన్ని దోచుకోవడం యుద్ధమా?

పసిపిల్లల ఉసురుతీయడం యుద్దమా?

వాడు మనిషా లేక చచ్చి తిరిగొచ్చిన దెయ్యమా?

వాళ్ళవి మాంసపు గుండెలా లేక రాతిబండలా?

ఏ దేవుడు చెప్పడు సాటిమనిషికి కీడుచేయమని

అలా చెబితే దేవుడెలా అగునో?

మనిషికి పుట్టినోడెవడు పాడుపనులుజేసి భగవంతునిపై రుద్దడు

ఉగ్రవాదం మనిషినెపుడైనా చేయును సర్వనాశనం

అదో కరుడుగట్టిన రాక్షసత్వం

కూకటివేళ్ళతో పెకిలించకపోతే కరోనాకంటే 

వేగంగా ప్రపంచం మొత్తం 

మనుషులు బూడిదగూడ కనిపించక మాయం

పెత్తనం కాదు కావలసింది

విత్తనం మొలిచే భూమి

అణుబాంబు వికృతత్వం మనకేనాడో ఎరుక

తనువులే కాదు పైరులు మాయం 

విశ్వం మెల్లగా వినాశనంవైపు

పరుగులెడుతున్నది

మనిషి మనసు కాలుష్యం

మానవత్వాన్ని మాయంచేసే

తప్పటడుగులేస్తుందెపుడు

ఆకలి మరచిన మనిషి అధికారం పరమావధిగా

పయనం సాగిస్తున్నాడు

పర తమ బేధం మరచి 

"నేనే" అహంకారంతో విర్రవీగుతూ విధికి తనే బలైతున్నడు

ఇకనైనా కళ్ళ తెరవకుంటే

తను తీసిన గోతిలో తానే పడడం ఖాయం


-సి. శేఖర్(సియస్సార్),

పాలమూరు,

9010480557.



ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలు వద్దు !

మనకి మట్టి విగ్రహాలే ముద్దు !


వాతావరణాన్ని కాలుష్యం చేసే రసాయనాలు వద్దు !

నేలతల్లిని, గంగాదేవిని కాలుష్యం చేసే విగ్రహాలు అస్సలే వద్దు!!


పసుపుగణపతి, మట్టి గణపతి 

విగ్రహాలు ముద్దు !


రంగు రంగుల సోయగాన్నిచ్చే పి ఓ పి  విగ్రహాలు వద్దే వద్దు !!

కాలుష్య కారకాలని దూరం చెయ్ !


ప్కృతి ఒడి లో ఆనందించెయ్ !!



                D.శ్రీనివాసులు 

                నల్లసింగయ్య గారి పల్లి 

                అనంతపురం 










శిల్పకళా వైభవం


రామప్ప దేవాలయశిల్పము

కాకతీయ వైభవ  ప్రతీక

శిల్పి రామప్ప కళా నైపుణ్యం

రాగిణి నాగిని శిల్పశైలి

అజరామర శిల్ప సౌందర్యం


వంపులు తిరిగిన స్త్రీమూర్తి

శృంగార రసనాట్య భంగిమ

భరతముని నాట్య రచన

నటరాజ రామ కృష్ణుని కి

పేరిణి నాట్యానికి ప్రేరణ..


కాకతీయ రాజుల కళ లు

దేవాలయ శిల్ప సంపదకు

నిదర్శనాలుగా వెలుగొందు

తున్నట్టి రామప్పదేవాలయం

తెలుగు సంస్కృతి కినిలయం.


పానపట్ట శివుడు గుడికి

శిల్పకళకు ఆయువు ఐన

రామలింగేశ్వర శిల్పరూపం

సాక్షాత్తు శివుని ఆత్మలింగం

కొలువైన కైలాస నాధుడు


దర్శించిన వారి కొంగుపసిడి నిలయం. 

నందీశ్వరుడు డి

శిల్ప కళా చాతుర్యం శిల్పి ల నైపుణ్యం .

లేస్తున్న ట్లున్న నంది వందల ఏళ్ళకళా ప్రతిభ.


-శ్రీమతి సత్య మొం డ్రేటి, హైదరాబాద్, 9 4 9 0 2 3 9 5 8 1.




ఇంకా ఎన్నాళ్ళు?   ఎన్నేళ్ళు?



దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75  సంవత్సరాలు పూర్తి అయ్యాయి. పరాయి పాలన అంతమై స్వేచ్చా వాయువులు పీల్చుకున్న తరుణం,బ్రిటిష్  వారి నుండి  విముక్తి పొందిన సమయం తలుచుకుంటేనే హృదయం ఉప్పొంగి పోతుంది. ఎందరో వీరుల త్యాగఫలితమే దేశ స్వాతంత్య్రం.కుల, మత,వర్గ,వర్ణ, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా యావత్ జాతి ఏకమై సాధించిన విజయం. ఆనాటి విజయాన్ని గుర్తుకు తెచ్చుకుంటే నే ఒళ్ళు పులకరిస్తుంది.


            

  ప్రపంచంలో నే అతి పెద్ద  ప్రజాస్వామ్య దేశంగా భారత్ కు  ఓ ప్రత్యేకత ఉంది. ప్రాచీన నాగరికత కు పుట్టినిల్లు గా ఓ చరిత్ర ఉంది. వివిధ జాతుల కు నివాసం గా,విభిన్న సంప్రదాయాలు, సంస్కృతులకు నిలయం గా పేరు సంపాదించు కుంది.శాంతి కా ముక దేశం గా, పాడి పంటలతో, అలరారే ప్రదేశం గా,జీవ నదులు పారె భూమి గా విశ్వం లో విలసిల్లుతున్న దేశం భారతదేశం.



    పరాయి పాలన లో ప్రగతి  లేదని, పేదరికం పోలేదని, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం, లౌకికవాదం సామ్యవాదం లేదని, అసమానతలు  ప్రబలంగా ఉన్నాయని.భావించిన ప్రజలు స్వాతంత్య్రం రావటం తో భారీ గా సంబరాలు జరుపుకున్నారు. సామాన్యుల కలలు ఫ లి స్తాయని, సగటు మనిషి  కష్టాలు తీరతాయని, దేశం ప్రగతి పథంలో ముందుకు పోతుందని, స్వయం సమృద్ధి ని సాధిస్తుందని ఆశించారు. దేశం వెలిగి పోతుందని భావించారు. వర్తమాన స్థితి ని చూస్తే దేశం వెలిగి పోవటం లేదని, వెల వెల పోతుంద ని జనం  తెలుసుకున్నారు. అవినీతి పెరిగి పోయిందని అన్యాయం రాజ్య మెలుతుందని, స్వార్థమే పరమార్ధం గా నేతలు ఉన్నారని, ప్రజాసేవ ను పక్కన పెట్టారని, ప్రజలు గ్రహించారు. అప్పుల  ఊబిలో ఉన్నామని, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నామని, జనం  అర్దం చేసుకున్నారు. ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదవారు మరింత పేద వాళ్ళు గమారి నారని విజ్ఞులు చెప్పు తున్నారు. నవభార త నిర్మాణం  నత్త నడక నడుస్తుంది. సామాజిక దురాచారాలు పోలేదు. సామాజిక న్యాయం జరగలేదు. సామ్యవాద రాజ్యం వస్తుందని, దోపిడీ లేని  సమాజం ఏర్పడుతుందని, అమర వీరుల త్యా గాలు వ్యర్దం  కావని దేశ   వాసులంతా విశ్వసించారు. 75 సంవత్సరాలు తర్వాత కూడ వారి కలలు నిజం కాకపోవడం శోచనీయం.    



దేశం ప్రగతి తీరు చూస్తుంటే "మూడడుగులు ముందుకి, ఏ డు అడుగులు వెనక్కి" చందం గా ఉంది. అధిక జనాభా, అవినీతి వంటి సమస్యలతో దేశం ముందుకు పోలేక పోతుంది.అప్పుల మోత, పన్నుల వాత, నేతల మే త తో ప్రజల సంక్షేమం కాస్తా సంక్షోభ దిశ గా పోతుంది. యువశక్తి అధికంగా ఉన్న,మానవ వనరుల కు లోటు లేకున్న ప్రగతి అనుకున్న రీతిలో సాధించ కుంది.  



తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి గణాంకాలను బట్టి భారత్ ను దిగువ మధ్యా దాయ దేశం గా ప్రపంచ బ్యాంక్ గుర్తించింది. మన పొరుగున వున్న చైనా 8123 డాలర్ల సగటు తలసరి స్థూల దేశీ యోత్పతి తో ముందుకు పోతుంది. బ్రెజిల్ 8649డాలర్లు, దక్షిణాఫ్రికా 5273 డాలర్లు, శ్రీలంక 3,835డాలర్ల సరసన భారత్ 1,709డాలర్ల తో వాటి ముందు  నిలబడుతుంది. నవ భారత్ నిర్మాణానికి ఆవినీతే పెద్ద అవరోధంగా మారింది. అధిక జనాభా దానికి తోడు గా ఉంది. దాంతో భారత్  సమస్యల నుండి బయట పడకుంది.     


దేశం ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొంటుంది ‌ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు  గడిచిన ఇంకా పరిష్కారం కాని, కాలేని అనేక సమస్యలు ఉన్నాయి.ఐదేళ్ల కో సారి ఎన్నికలు జరుగుతున్నాయి వివిధ పార్టీలు  అధికారంలో కి వస్తున్నాయి.కాని సమస్యలు మాత్రం పోవటం లేదు.పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఎన్నికల్లో వాగ్దానాలతో ఓట్లను సంపాదించు కొని గద్దె నెక్కిన తర్వాత మొద్దు నిద్ర పోతున్న నేతల నుండి ఎక్కువ ఆశించటం అత్యాశే.ఓడ  దాటాక తెప్ప తగలెయ్యటం అంటే ఇదే. సమస్యల జాబితా చూస్తే కొండంత. పరిష్కారం మాత్రం గోరంత. అధిక జనాభా, అవినీతి, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస త,అనారోగ్యం, అంటరానితనం, వరకట్నం లింగ వివక్ష,, శిశు మరణాలు, స్త్రీల పై హింస, పోషకాహార లోపం, కుల తత్వం, మత తత్వం, ప్రాంతీయ తత్వం, ఉగ్ర వాదం, బాలకార్మిక వ్యవస్థ, మానవ  అక్రమ రవాణా, ఉగ్రవాదం, వలసలు, రైతులు, చేనేత కార్మికులు, వికలాంగులు, వృద్దులు, ఆదివాసీలు, దళితులు, బాలలు, మహిళ లు, మైనారిటీల సమస్యలు, వెట్టి, జోగిని, దేవదాసి వంటి దురాచారాలు దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు.


దారిద్య్రం, అజ్ఞానం, అనారోగ్యం, అసమానతల నుండి దేశం బయట పడాలని తొలి ప్రధాని భావించిన అది నేటికి సాధ్యం కాలేదు. అంత రిక్ష విజ్ఞానం, భౌతిక, గణాంక, రసాయన శాస్త్రాలు, ఇంజనీరింగ్, ఐటి, వైద్యం, ఔష ధాల తయారీ,సంగీత,సాహిత్యాలు మొదలైన రంగాలలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన, స్వేచ్ఛ సమానత్వం వంటి విషయాలలో ముందడుగు వేసిన, ఇంకా పలు సమస్యలు పరిష్కారానికి నోచుకోక పోవడం, ఆశించిన రీతిలో అభిరుద్ది జరగక పోవడం పాలకుల వైఫల్యానికి నిదర్శనం గా చెప్పవచ్చు. 



విశ్వం లోనే అతిపెద్ద  ప్రజాస్వామ్య దేశంగా, అత్యధిక శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఉన్న రెండో దేశంగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో నాలుగవది గా, మానవవనరుల లో ఐదో స్థానం లో, ఉత్పాదన రంగం లో  ఆరో స్థానంలో... ఇలా మనకంటూ ఓ స్థానం వున్న మాట వాస్తవమైన, పరిష్కారం కాని పలు సమస్యలతో దేశం సతమత మవుతున్న ది కూడ వాస్తవమే. "శతకోటి దారిద్రా లకు అనంత కోటి ఉపాయాలు," ఎన్ని సమస్యలు వున్నా  పరిష్కారం కానివి, లేనివి ఏవి  ఉండవనడం అతిశయోక్తి కాదు. మనసుంటే మార్గం ఉంటుంది. దేశం పట్ల ప్రేమ, ప్రజలకు సేవ చేయాలనే ధృడ సంకల్పం, పట్టుదల, చిత్తశుద్ధి పాలకులలో వుంటే పరిష్కారం కాని సమస్యే ఉండదు. నేతలు  స్వార్థాన్ని పక్కన పెడితే, ప్రగతి ఫలాలు ప్రజలందర కు అందుతాయి.         



--ఆచార్య గిడ్డి. వెంకట రమణ        

అధిపతి, సమాజశాస్త్ర విభాగం

శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం

అనంతపురం_515003

సంచార వాణి 9440984416



వ్యసనం   -కందూర్ చంద్రప్రకాష్ గుప్తా

బావుల్లో కప్పలు అదే ప్రపంచమను రీతిన

తమ ఇంట్లోనే ఒకరినొకరు పలుకరింపులకు

స్పందనలే లేని బధిరుల మేళమాయనునట్లు

ఇంటికి వచ్చిన బంధుమిత్రులను చూడకనే

పలుకరించె అంధత్వపు క్రీనీడలు పొంచియున్న

తాముతిను ఆహారమున ఔషధమున అమృతం

కనలేరు ఆత్మీయతలు పంచుకోలేరు తల్లిదండ్రుల

జూసి తనయులెల్లరు అదియే ప్రగతికి సోపానమని

తలచి అవసరానికి పలుకరింపులే కరువు కావగ

చేతుల కాలిన పిమ్మట ఆకులు పట్టుకున్న పద్ధతిన

తెలుసుకో ఇకనైనా మసులుకో ఓ మనిషిగా యని

లేదా నీవు తీసుకున్న గోతిలోనే పడుట ఖాయమని


--కందూర్ చంద్రప్రకాష్ గుప్తా

మియాపూర్ హైదరాబాద్

చరవాణి 8008572446



స్వాతంత్ర పోరాట స్ఫూర్తి నేడేందుకు  కరువయ్యింది. 

కొరవడిన త్యాగశీలత, ప్రజల పౌరుషాన్ని హరించి వేస్తున్న ప్రలోభాలు.

- వడ్డేపల్లి మల్లేశము9014206412


75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఒక్కసారి గతంలోకి వెళ్లి పూర్వ నేపథ్యంతో పాటు పోరాట  చరిత్రను నెమరు వేసుకున్నప్పుడు ఆటుపోట్లు, సాఫల్య వైఫల్యాలు ఎన్నో దర్శనమిస్తాయి. ఆనాడు ఇంతగా చైతన్యం లేదని మీడియా అవకాశాలు కూడా లేవని మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. కానీ నేడు అనేక రకాల మీడియా అవకాశాలు వచ్చి విద్యారంగంలో ఉన్నతమైన ఫలితాలు కొంతవరకు సాధించినప్పటికీ ప్రస్తుత సమకాలీన, రాజకీయ ,చారిత్రక, ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయి ఉండదానికి ప్రధాన కారణం పోరాట స్ఫూర్తి, పౌరుషం, ఆత్మస్థైర్యం, దేశభక్తి కొరవడటమే  అని తెలుస్తున్నది.కనుక ఏ సౌకర్యం లేని ఆనాటి పోరాటమే నిజమైన చైతన్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. అందుకే నేటి మన సమకాలీన వ్యవస్థను గతంతో పోల్చుకుంటే తృప్తి కలగడం లేదు.


ఉద్యమం స్ఫూర్తి పోరాట చైతన్యాన్ని కలిగించిన నినాదాలు:

ప్రత్యక్షంగా 190 సంవత్సరాలు పరోక్షంగా వందలాది సంవత్సరాలుగా ఆంగ్లేయులు ఈ దేశాన్ని కుట్రపూరితంగా దుర్భర దారిద్ర్యంలోకి నెట్టి దుష్ట పరిపాలన కొనసాగించి అన్ని రంగాలలో  ఈ దేశాన్ని పరాయీ కరించారు. కుల వృత్తులు అంతరించడం, ఉపాధి అవకాశాలను కోల్పోవడం, బానిస జీవితానికి అలవాటు పడటం, ఆధిపత్య భావజాలం పెరిగిన కారణంగా సామాన్య ప్రజానీకం నిస్సహాయంగా గడపవలసి వచ్చింది.

ఇలాంటి పరిస్థితులు మరి నేడు లేవా?

అంటే మరింత దుర్భర పరిస్థితులు ఈ దేశంలో వివిధ రాష్ట్రాలలో తాండవిస్తున్నవి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అయితే ఉద్యమ కాలంలో మనం ఎంచుకున్న కొన్ని నినాదాలు మనకు తెలియకుండానే మన శక్తిని, పరాక్రమాన్ని, ధైర్యాన్ని రెట్టింపు చేసి కదన రంగం లోకి దూకే లా చేశాయి. మరొకవైపు మనం ఎంచుకున్న నినాదాలు ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించిన నే కాకుండా వారిని ఆందోళనకు గురి చేసి వెన్నులో చలి పుట్టించినవి.

నినాదాలకు అంత శక్తి ఉంటుంది. ఇప్పటికీ ఆరోగ్యమే మహాభాగ్యము, తృప్తిని మించిన ధనం లేదు, జై జవాన్ జై కిసాన్ వంటి మాటలు అజ్ఞాతమైన అనుభూతికి లోను చేసి మనలో భావావేశాన్ని నింపుతాయి. కర్తవ్య దీక్ష కు పురికొల్పుతాయి. అవునంటారా? లేదా?

 "స్వరాజ్యం నా జన్మ హక్కు" అనే నినాదాన్ని కాక బాప్టిస్టా రూపొందించినప్పటికీ దీనిని తిలక్ స్వీకరించి విస్తృత పరచడంలో తోడ్పడ్డాడు. తద్వారా స్వాతంత్ర్య కాంక్ష ప్రజలలో బలంగా పెరగడానికి ఊరు వాడ జన రన నినాదంగా రూపాంతరం చెంది ఆంగ్లేయులను నిద్రపోనివ్వ లేదు. నినాదంతో నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎందరెందరో స్ఫూర్తిని పొంది ప్రభావితులయ్యారు.

 "జై హింద్" హైదరాబాద్ నగరానికి చెందిన అబిద్ హసన్సఫ్రాని జర్మనీ లో సుభాష్ చంద్రబోస్ సైనిక మద్దతు సమీకరిస్తున్న కాలములో విభిన్న మతాల మధ్యన ఏకరూపత సాధించడం కోసం పరస్పరం పలకరించుకుని ఐక్యత నినాదాన్ని ఇవ్వడం కోసం జైహింద్ అంటే బాగుంటుందని జర్మనీలో విద్యార్థిగా ఉన్న సఫ్రాని ఈ నినాదాన్ని రూపకల్పన చేసినట్టుగా తెలుస్తున్నది. స్వతంత్ర పోరాట కాలం లోనే కాకుండా స్వాతంత్ర్యానంతరం నేటికి కూడా సభలు సమావేశాల్లో మాట్లాడిన అనంతరం జైహింద్ అనడం ఒక  ఆనవాయితీగా మారిపోయింది అంటే అది నాడు ఎంత ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.

 "సైమన్ గో బ్యాక్" 1928- 29 కాలంలో భారతదేశంలో ప్రజల స్థితిగతులను తెలుసుకోవడానికి వచ్చినటువంటి సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ఆనాడు  meher ali ఈ నినాదాన్ని అందించాడు. ప్రధానంగా సైమన్ కమీషన్ ను వ్యతిరేకించడం కోసం వీరి నాయకత్వంలో ఎదురేగి న వందలాది మంది సైమన్ కమీషన్ ముందు తమ నిరసన తెలిపి ఈ నాదాన్ని పదేపదే ఉచ్చరించి వారిలో వణుకు పుట్టించార ట. ఆ నినాదం దాదాపుగా స్వాతంత్ర్యం వచ్చేవరకు అవసరానుగుణంగా రూపాంతరం చెందినప్పటికీ దాని అర్థం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తెలపడమే.

"ఇంక్విలాబ్ జిందాబాద్" భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వంటి విప్లవ పోరాట యోధులను కదిలించి దేశభక్తిని రగిలించిన టువంటి నినాదం ఇది. ప్రముఖ ఉర్దూ కవి మౌలానా నోటినుండి జాలువారిన ఈ దిక్కార స్వర గుళిక  బాగా తోడ్పడింది అనడంలో సందేహం లేదు. భగత్ సింగుకు ఉరిశిక్ష ప్రకటించిన అనంతరం పోలీస్ స్టేషన్ లోనూ, కోర్టులోనూ ఈ నినాదాన్ని పదేపదే ఉచ్చరించి తన వీరత్వాన్ని చాటుకున్నాడు. ఇప్పటికీ యువతకు అభ్యుదయ వాదులకు ఈ నినాదం వెన్నుదన్నుగా నిలిచింది.

" క్విట్ ఇండియా" 1942లో ఆంగ్లేయులను పూర్తిస్థాయిలో తరిమికొట్టాలని పూర్తి స్వాతంత్రాన్ని సాధించాలని ఉద్దేశంతో దీర్ఘకాలిక పోరాటాన్ని ప్రకటించినప్పుడు ఆ ఉద్యమానికి పేరు పెట్టే సందర్భంలో జరిగిన చర్చలో అనేక మంది పేర్లను సూచించినట్లుగా తెలుస్తోంది. ఆనాడు ముంబాయి నగరానికి మేయర్గా పనిచేస్తున్న యూసఫ్  మెహర్ అలీ క్విట్ ఇండియా అంటే బాగుంటుందని చేసిన సూచనను ఆ నాటి కమిటీ ఆమోదించడంతో ఆ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం గా మారిపోయింది. క్విట్ ఇండియా నినాదం రూపకర్త ఎనిమిది సార్లు జైలుకు వెళ్లి అనేక శిక్షలు అనుభవించినటువంటి పోరాటయోధుడు కావడం గమనార్హం.

వందలాది సంవత్సరాల క్రితం కోట్లాది ప్రజానీకాన్ని ఏకం చేసి సాయుద్ధ, సత్యాగ్రహ పద్ధతుల ద్వారా ఆంగ్లేయులతో పోరాడటానికి ఈ నినాదాలు ఎంతో ఉత్సాహంగా పని చేసినట్లుగా తెలుస్తున్నది. నేడు ఎంత మీడియా ఉన్న ప్రతి స్పందన ప్రజల్లో కానరావడం లేదు .కానీ ఈ మీడియా లేకపోయినా పౌరుషం, స్వాతంత్ర్య కాంక్ష, దేశభక్తి ఆనాడు అందరిలో రగిలించింది అంటే ఆ లక్షణాలను తిరిగి మనం పునికి పుచ్చుకో వలసిన అవసరం ఉన్నదని చరిత్ర ద్వారా తెలుస్తున్నది.


 స్వతంత్ర భారతంలో నిర్లిప్తత ఎందుకు?

  • ప్రభుత్వ రంగం క్రమంగా 85 శాతం నుండి 15 శాతానికి మారిపోయిన కారణంగా ప్రజల జీవితాలకు భద్రత లేదు కనుక.

  • చట్ట సభలో మెజారిటీ సభ్యులు నేరస్తులు కార్పొరేట్ శక్తులు కావడం వలన వాళ్ల వర్గ ప్రయోజనం కోసమే పాకులాడుతూ ఉన్నారు తప్ప సామాన్య ప్రజానీకం కోసం కాదు. అందువల్లనే అభివృద్ధి తిరోగమన దిశలో పయనిస్తోంది.

  • రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను ప్రజల కోణంలో ప్రజాసేవకు ఉపయోగించే బదులు రాజకీయ స్వప్రయోజనాల కోసం. కార్పొరేట్ శక్తుల కొమ్ము కాయడం కోసం ప్రభుత్వాలు పని  చేస్తున్నందున సామాన్య ప్రజానీకం నిర్వీర్యం అవుతున్నది.

  • ప్రధాన సమస్యలైన ఆర్థిక అంతరాలు, అసమానతలు ,వివక్షత ఆధిపత్య భావజాలం, అగ్రవర్ణాల అణచివేత దోపిడీ విధానాలు సామాన్య ప్రజానీకాన్ని యాచకులుగా బానిసలుగా మార్చుతున్నవి.

  • దారిద్ర్య రేఖ దిగువన 20 శాతం ప్రజానీకం ఉండడం, 75 శాతం సంపద ఒక్క శాతంగా ఉన్న సంపన్నవర్గాల చేతిలో ఉండటం, 20 కోట్ల మంది వలస కార్మికుల పైన ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడం ఈ దేశ పాలకుల విధానం ఎటువైపు వెళుతుందో ఆలోచించవచ్చు.

  • దేశంలో దినదినం సంపద పెరుగుతున్నది. దానిని ప్రభుత్వం అభివృద్ధి అని అపోహ పడుతూ ప్రతిపక్షాలను సంప్రదించకుండా, ప్రజా సంఘాలు రైతు సంఘాల ను ఆలోచించకుండా, సంబంధిత శక్తులతో మాట్లాడకుండా తీసుకుంటున్న కఠిన ప్రజా వ్యతిరేక విధానాల వలన ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అగాధం పెరిగిపోతోంది.

  • సంపద పెరుగుదల అభివృద్ధి కాదు .ఆ పెరిగిన సంపద ప్రజలందరికీ పంపిణీ జరిగినప్పుడే సార్థకత. ఇదే విషయాన్ని భారతదేశ నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ "మానవాభివృద్ధి" అనే పేరుతో పాలకులకు దిశానిర్దేశం చేయడాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం తమ సోయి లేని తనానికి నిదర్శనం.

  • తెలంగాణ వంటి రాష్ట్రంలో భారతదేశంలోనూ 40 శాతంగా ఉన్న యువతకు సంబంధించి సరైన యువజన విధానం లేని కారణంగా ఉపాధి ,ఉద్యోగం ,నైపుణ్యాలకు దూరమై  ఆత్మహత్యలు  చేసుకుంటున్నారు.

  • ప్రణాళికా రచనలో 85% గా ఉన్నటువంటి సామాన్య, మధ్యతరగతి, ఆదివాసి, బహుజన వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వని కారణంగా 74 సంవత్సరాలు దాటినా మానవాభివృద్ధి సాధించడంలో పూర్తిగా విఫలమైనము.


స్వతంత్రం సార్థకం కావాలంటే:

ప్రజాస్వామ్య దేశంలో పాలకులు రాజ్యాంగబద్ధంగా పాలన చేయగలగాలి వ్యక్తిగత ఎజెండాకు ఏనాడు తావుండకూడదు. ప్రభుత్వాలకు సామ్యవాద దృక్పథం ఉంటే తప్ప ప్రజాస్వామ్య దేశాలలో పాలన సఫలం కాదు. శాస్త్రీయ విద్యా రంగాలలో పరిశోధనా రంగంలో ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే తప్ప ప్రజలు సుఖ సంతోషాలతో బ్రతకలేరు.

  • ఈనాటికీ భారతదేశంలోనూ అనేక రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విద్య ,వైద్యం ప్రైవేటు ఉక్కు సంకెళ్ళ మధ్య నలిగిపోతూ పేదలు మరియు ప్రజలు కావడానికి తమ కొనుగోలు శక్తిని కోల్పోవడానికి కారణమవుతున్నాయి. ఈ రెండు రంగాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగాలి.

  • ప్రజా సేవకులకు మాత్రమే చట్టసభలలో ప్రాతినిధ్యం ఉండాలి. నేరగాళ్లు నేరారోపణ కు గురైన వారు కఠినంగా శిక్షించ బడాలి.

  • లక్షలాది రూపాయలను తమ  వేతనాలు గా తామే నిర్ణయించుకునే అధికారాన్ని చట్టసభలకు లేకుండా చేయాలి. ప్రజల ద్వారానే నిర్ణయించబడాలి.

  • తెలంగాణ రాష్ట్రంలో నేటి ప్రభుత్వం నాలుగు లక్షల వేల కోట్ల అప్పులు చేసినది.

  • కేంద్రం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఏ ప్రభుత్వం చేసిన అప్పులను ఆ ప్రభుత్వమే చెల్లించే విధంగా చట్టం తీసుకురావాలి.

  • ఎన్నికల విధానాన్ని పూర్తిగా నిషేధిస్తూ సమర్ధుడు అయిన వాళ్ళు పేదలైన చట్టసభల్లో కి అధికారానికి వచ్చే విధంగా అంతిమంగా రాజ్యాధికారానికి అర్హులను చేసే నూతన అవకాశాలకు చట్టసభలు జీవం పోయాలి.ఆమ్ ఆదమీ పార్టీవలె.

  • పాలకుల వికృత ప్రవర్తన, అణచివేత ధోరణి కార్పొరేట్ శక్తుల దోపిడి నడుమ ప్రజలకు సరైన పాలన అందించే అవకాశం లేదు. గౌరవ రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల గవర్నర్ లతోపాటు న్యాయవ్యవస్థ అంతిమంగా సర్వోన్నత న్యాయస్థానం పాలకుల తప్పుడు విధానాల మీద అన్యాయాలు దోపిడీ మీద ఉక్కుపాదం మోపాలి అప్పుడే సామాన్య ప్రజానీకానికి 75 ఏళ్ల తర్వాత స్వాతంత్ర ఫలాలు పొందే అవకాశం కలుగుతుంది.


( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయులు తమ నాయకుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)






Pravahini - The Channel of Telugu Literature and Culture - eMagazine

Near Bus Stand Godavarikhani, Ramagundam-505209, Dist: Peddapalli, TS.

Email: pravahini.thewritersblog@ gmail.com


0/Post a Comment/Comments