భారత న్యాయవ్యవస్థ లో సాక్షాత్కరిస్తున్న విప్లవాత్మక మార్పులు - గౌరవ సీజేఐ చొరవ, పట్టుదలతోనే మారుతున్న రూపురేఖలు. - వడ్డేపల్లి మల్లేశము, 9014206412

భారత న్యాయవ్యవస్థ లో సాక్షాత్కరిస్తున్న విప్లవాత్మక మార్పులు - గౌరవ సీజేఐ చొరవ, పట్టుదలతోనే మారుతున్న రూపురేఖలు. - వడ్డేపల్లి మల్లేశము, 9014206412

భారత న్యాయవ్యవస్థ లో సాక్షాత్కరిస్తున్న విప్లవాత్మక  మార్పులు - గౌరవ సీజేఐ చొరవ, పట్టుదలతోనే మారుతున్న రూపురేఖలు.

- వడ్డేపల్లి మల్లేశము, 9014206412

   04.09.2021


          భారత పార్లమెంటరీ వ్యవస్థలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక శాఖ లతోపాటు పాలనా వ్యవస్థలను అత్యంత ప్రభావిత పరిచే  న్యాయశాఖ మూడవ కీలక స్తంభంగా  తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నది. సామాన్యుడు తన హక్కులను కోల్పోయినప్పుడు, ఉన్నత వర్గాలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు,  హరించి నప్పుడు కారు చీకటిలో కాంతిరేఖ లాగా దారి దీపమై నిలిచే వ్యవస్థ న్యాయ వ్యవస్థ.

      వివిధ సందర్భాలలో అనేక వ్యాజ్యాలపై  జరిగిన చర్చలో భాగంగా భారత సర్వోన్నత న్యాయస్థానం, అనేక హైకోర్టులు కూడా  విశేషమైన తీర్పులు ఇచ్చిన సందర్భాలు భారత స్వాతంత్ర్య చరిత్రలో ఎన్నో ఉన్నాయి. పాలకులు దారి తప్పినప్పుడు, ఉన్నత వర్గాల కొమ్ముకాసినప్పుడు   అనగారిన వర్గాలు, ఆదివాసీలు, పేద వర్గాలకు ఊరట కల్పించడంలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకమైనది. అయితే గతంలో అనేక సందర్భాలలో నిర్లక్ష్యము చేయబడినప్పటికీ ఊరట కల్పించిన సందర్భాలు కూడా అనేకం.


న్యాయవ్యవస్థ తలచుకుంటే.....

     దేశంలో న్యాయ వ్యవస్థ అనేక సంస్థాగత మైనటువంటి సమస్యలతో సతమతమై పోతున్నప్పటికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, పరిస్థితులను చిత్తశుద్ధిగా పరిశీలించి న్యాయవ్యవస్థ ఆ సమస్యల పరిష్కారానికి పూనుకుంటే, సామాజిక బాధ్యతగా గుర్తిస్తే అంతర్గత సమస్యల తో పాటు ప్రజల న్యాయపరమైన చిక్కుముడులను కూడా పరిష్కరించవచ్చు.

 ఇక్కడ కావలసినది ప్రభుత్వ తోడ్పాటు ముఖ్యమైతే నాయకత్వం లో ఉన్నటువంటి గౌరవ ప్రధాన న్యాయమూర్తుల  చొరవతో అద్భుత ఫలితాలను ఆవిష్కరించవచ్చు.

 రాజ్యాంగ పరిధికి లోబడి నప్పటికీ చట్టము న్యాయము రెండింటిని కలుపుకొని నేడు ఉన్నటువంటి వ్యవస్థ మరింత ఉన్నతంగా ఉండాలనే కాంక్ష, తపన, దృక్పథం, ఆరాటం నాయకత్వానికి ఉంటే అద్భుత ఫలితాలు సాకారం అవుతాయి. నేడు భారత దేశంలో , ఎంచుకున్న గమ్యం, న్యాయవ్యవస్థ గమనం, మానవతా విలువల పునాదిగా కొనసాగుతుండటాన్ని పీడితుల తోపాటు విద్యావంతులు, బుద్ధిజీవులు ,మేధావులు, సబ్బండ వర్ణాల ప్రజలు గమనించవలసిన అవసరం ఉన్నది.


గౌరవ సీజేఐ పనితీరును పరిశీలిద్దాం:

      ఏ  వ్యవస్థలో నైనా నాయకుని వైఖరులు, దృక్పథము, తపన, ఆరాటం, పోరాటం, ఆ రంగంలో పనితీరును నిర్ణయిస్తాయి. ఇటీవల భారతదేశపు 48వ సీజేఐ గా నియమితులైన ఎన్వి రమణ గారు రోజురోజుకు వినూత్నమైన ఆలోచనలతో భారత న్యాయ వ్యవస్థను పాలిస్తున్న విధానాన్ని గమనిస్తే అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సంఘటనలను గుర్తించవచ్చు.

         న్యాయవ్యవస్థలో ఇంతకాలంగా జరుగుతున్నటువంటి కొన్ని లోపాలను, మరి కొన్ని నిర్లక్ష్యా లను సుదీర్ఘంగా పరిశీలించిన మీదట వారు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది.


కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు:

      దేశవ్యాప్తంగా పోలీస్స్టేషన్లో జరుగుతున్నటువంటి హింస, రాజ్యాంగ ఉల్లంఘనలను ప్రస్తావిస్తూ సామాన్యుడికి రక్షణ కల్పించవలసిన బాధ్యత విస్మరించకూడదు అని హెచ్చరించారు. ఎన్నో లాకప్ డెత్లతో పాటు ఎంతో మంది పైన కొనసాగుతున్న టువంటి హింసను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. సామాన్యుడు తనకు నష్టం జరిగిందని, తన హక్కు లు హరించి వేయబడినవని  ప్రశ్నించలేని దుస్థితిలో సామాన్యుల గొంతుక అయ్యి సీజేఐ వ్యాఖ్యలు చేయడం అట్టడుగు వర్గాలకు ఎంతో భరోసా ఇచ్చినట్లయింది.

       న్యాయపరమైన అంశాలపై ఏర్పాటు చేస్తున్న టువంటి ట్రిబ్యునల్లో సిబ్బందిని తక్షణమే నియమించని కారణంగా కాలయాపన జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వారి నాయకత్వంలో ఏర్పడినటువంటి న్యాయమూర్తుల ఎంపిక కమిటీ కొలీజియం సర్వోన్నత న్యాయస్థానంలో ఖాళీగా ఉన్నటువంటి 10 ఖాళీలకు బదులుగా 9 ఖాళీలను భర్తీ చేసి వారి చతురతను చాటుకున్నారు.

       అంతే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయడానికి గానూ కేంద్ర ప్రభుత్వానికి 92 మంది న్యాయమూర్తుల భర్తీకి గాను కొలీజియం సిఫారసు చేసిన విషయాన్ని వృత్తిపట్ల నిబద్ధత కు చిహ్నంగా భావించవలసి ఉన్నది.

   శనివారం ఢిల్లీలో బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన సభలో cji గారు మాట్లాడుతూ న్యాయవ్యవస్థ సంస్థాగతంగా మౌలికవసతుల రీత్యా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దని ప్రభుత్వం మరింత సహకరిస్తే ఆ అవాంతరాలను అధిగమించడం సాధ్యమేనని సంకేతాలిచ్చారు. అందుకోసం ప్రభుత్వం వెంటనే మౌలిక వసతుల కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం ద్వారా అవసరాలు, నిధులు, సాంకేతిక విషయాలతోపాటు అన్నింటినీ అధిగమించవచ్చునని ప్రభుత్వానికి సూచన చేయడాన్ని బట్టి దేశ సమగ్రత పట్ల వారికి గల ఆలోచనను గుర్తించవచ్చు.

       న్యాయవ్యవస్థ లో సిబ్బంది కొరత నిధుల కొరత వంటి అనేక సమస్యల కారణంగా పేద వర్గాలకు చెందిన అనేక సమస్యలు పెండింగ్లో ఉండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న ప్రధాన న్యాయమూర్తుల కాలంలో కొంత మార్పులు జరిగినప్పటికీ వీరి కాలంలో కొద్దిరోజుల్లోనే అనేక సమస్యలను దృష్టికి తీసుకురావడం అట్టడుగు పేద వర్గాలకు ఎంతో ఆనందంగా ఉన్నది. వారి కృషికి గౌరవ అభినందనలు. రెట్టించిన ఉత్సాహంతో వారి పదవీ కాలం ముగిసే లోగా న్యాయ వ్యవస్థ లోని సకల సమస్యలకు పరిష్కారాన్ని వెతకాలని మనసారా కోరుకుందాం.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)




0/Post a Comment/Comments