బీసీల సమర శంఖారావం తో ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి. మెజారిటీ సామాజిక వర్గాన్ని విస్మరించడం పాలకుల తప్పిదమే! - వడ్డేపల్లి మల్లేశము9014206412

బీసీల సమర శంఖారావం తో ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి. మెజారిటీ సామాజిక వర్గాన్ని విస్మరించడం పాలకుల తప్పిదమే! - వడ్డేపల్లి మల్లేశము9014206412

బీసీల సమర శంఖారావం తో ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి. 

మెజారిటీ సామాజిక వర్గాన్ని విస్మరించడం పాలకుల తప్పిదమే!

- వడ్డేపల్లి మల్లేశము9014206412

       భారత సమాజంలో అగ్రభాగాన ఉన్న సామాజిక వెనుకబడిన తరగతుల వారికి ప్రభుత్వ నిర్లక్ష్యం, చిన్న చూపు తదితర కారణాల వలన అనాదిగా విద్య, ఉద్యోగ, రాజకీయ   మొదలైన రంగాలలో తీరని ద్రోహం జరిగింది. విద్యా, సమర్థత, చైతన్యం, నైపుణ్యాల విషయంలో మెరుగైన స్థాయిలో ఉన్నప్పటికీ 60 శాతంగా ఉన్న బీసీలలో మెజారిటీ ప్రజలు ఆర్థికంగా లేని కారణంగా అనేక అవకాశాలను అందుకోలేకపోయారు.

      జనాభా గణన సమయంలో కుల గణనను ప్రధానంగా చేయకపోవడం వల్ల కూడా సంఖ్యను కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. త్వరలో జరగనున్న జనాభా గణన సమయంలో కులాల వారిగా జనాభా గణన జరగాలని వివిధ వర్గాలు చేస్తున్న డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది.

    అలాగే వివిధ సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అనేక సర్వేల సందర్భంగా కులాలు, వృత్తులు, ఆర్థిక స్థాయిని అంచనా వేసే జనగణన జరగవలసిన అవసరం ఉన్నది అప్పుడు మాత్రమే ఆయా వర్గాలకు అవసరమైన సౌకర్యాలను నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది.


బీసీ సమర శంఖారావం.- మహోద్యమం:-

       సామాజికంగా వెనుకబడిన తరగతుల వారికి తరతరాలుగా జరుగుతున్న అన్యాయం,  ద్రోహం పైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ప్రభుత్వం కావాలనే గతంలో ఉన్న అవకాశాలను కూడా అందుబాటులోకి తేక పోవడం ప్రభుత్వం యొక్క కుట్రగా బీసీ సంఘం భావిస్తున్నది.

     ప్రధానంగా "బిసి బంధు" తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలకు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇతరత్రా కొన్ని అంశాలను కలుపుకొని సెప్టెంబర్ 8వ తేదీ నాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలెక్టర్ రేట్లు, తాసిల్దార్ కార్యాలయాల ముట్టడికి" బీసీల సమర శంఖారావం "పేరుతో బీసీ సంఘం పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నది.

      బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గతంలో రాష్ట్రవ్యాప్తంగా, ఢిల్లీలోనూ ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, చట్టసభల్లో జనాభా దామాషా రిజర్వేషన్లు కావాలని  ఇతర డిమాండ్ లతో ఉద్యమాలు నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసినదే.

 హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంలో ప్రభుత్వం ప్రకటించిన "దళితబంధు" నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 60 లక్షల బీసీ కుటుంబాలకు వెంటనే 10 లక్షల రూపాయలు చొప్పున బిసి బంధు అమలు చేయాలని ఇటీవలనే పోరాట కార్యక్రమాలను తీసుకుని ప్రభుత్వాన్ని ఆలోచింపజేసింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాని కారణంగా ఉద్యమాన్ని ఉధృతం చేసే క్రమంలో తీసుకున్న బీసీల సమర శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తో పాటు ఆలోచించే మనసున్న ఉన్నత వర్గాలపై కూడా ఉన్నది.


ఉద్యమ అనివార్యత:

     బీసీల సమర శంఖారావం  ఉద్యమానికి పిలుపివ్వడానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. ఇటీవల 52 వేల మందికి పైగా తాత్కాలిక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం తొలగించడం జరిగింది. అందులో మెజారిటీ ఉద్యోగులు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారే. గత ప్రభుత్వం నియమించిన వీరిని క్రమబద్ధీకరిస్తామని పేరుతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా ఉద్యోగాల నుంచి తొలగించడం తీరని ద్రోహం మే. ముఖ్యంగా 7861 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ను నిర్దాక్షిణ్యంగా తొలగించింది. గత సంవత్సరం కరోనా కాలంలో నియమించిన 1640నర్సులను ఇటీవల తొలగించి ప్రభుత్వ0 ఆప్రతిష్టను మూటగట్టుకుంది.

       ప్రస్తుత ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు దాటినప్పటికీ సుమారుగా రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేయక తాత్సారం చేయడం మెజార్టీ వర్గానికి తీరని అన్యాయం జరిగింది. పైగా ఉద్యోగుల విరమణ వయస్సును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచడం ద్వారా నిరుద్యోగ యువత భవితకు గొడ్డలిపెట్టు గా మారింది.

     బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ ద్వారా బీసీ జనాభాకు రుణ సౌకర్యం ఆర్థిక సహకారం గత ఏడు సంవత్సరాలుగా అమలు చేయకపోవడం కలచివేస్తున్న సమస్య. జనాభాలో 60 శాతం గా ఉండి రాజ్యాధికారంలో నామమాత్రపు ప్రాతినిధ్యం కలిగి ఉండడం వెనుక ఉన్నత వర్గాలు, పాలకుల నిర్లక్ష్యంతో పాటు ప్రజలను బానిసలుగా చూసే దుష్ట సంప్రదాయం ప్రధాన కారణాలు. పై అన్ని సమస్యలను బీసీ బంధు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తో కలిపి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తలపెట్టిన కార్యక్రమమే బీసీల సమర శంఖారావం.


బీసీ బంధు నేపథ్యం:

       దేశ వ్యాప్తంగా నూ అందులో భాగంగా రాష్ట్రంలో పదమూడవ పంచవర్ష ప్రణాళిక అమలు జరుగుతున్నప్పటికీ, స్వాతంత్రం వచ్చి 74  సంవత్సరములు పూర్తి అయినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఏడు సంవత్సరాలు గడిచిపోయిన ప్పటికీ బీసీ వర్గాలకు సంబంధించిన ప్రధాన డిమాండ్లు కనీస సౌకర్యాలను అమలు చేయని కారణంగా బీసీ లోకం ఆందోళనతో ఉన్నది.

    హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న సందర్భంగా కేవలం అక్కడ ఉన్నటువంటి వర్గ పోరును తట్టుకోవడానికి ప్రభుత్వం ఎరగా చూపిన దళిత బంధు పథకం అన్ని వర్గాలను నేడు  ఆలోచింపజేస్తుంది. ఆత్మగౌరవం పేరుతో శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ బిడ్డ ఈటల రాజేందర్ ను ఆధిపత్యం, అధికారం, అప్రజాస్వామిక పద్ధతిలో గెలవడానికి రాష్ట్రప్రభుత్వం పూనుకున్నది. కనుకనే గత ఏడేళ్లుగా ప్రస్తావనకు రాని దళితుల అభివృద్ధి గురించి హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్నికల సందర్భంగా స్థానిక దళితులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రకటించినది దళిత బంధు పథకం.

      రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 లక్షల దళిత కుటుంబాలకు గాను పైలట్ ప్రాజెక్టు పేరుతో కేవలం హుజురాబాద్లో ఎన్నికల కోసం మాత్రమే అమలు చేయడానికి పెద్ద ఎత్తున సభ నిర్వహించి ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ వర్తింప చేస్తామని ప్రకటించి, వివక్షత చూపుతున్నారనే కారణంపై ఇటీవల కొందరు దళితులు హుజురాబాద్ ప్రాంతంలో సిఎం డౌన్ డౌన్ వంటి నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు.

       నియోజకవర్గంలో కేవలం 50 వేల ఓట్ల కోసమే దళిత బందును ప్రకటిస్తే మెజారిటీగా ఉన్న బీసీల గురించి ప్రభుత్వ ఆలోచన ఏమిటని అనాదిగా  అన్యాయం జరిగిన బీసీలకు కూడా దళిత బంధు లాగా "బీసీ బంధు" ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ను గుర్తించిన బీసీ సంక్షేమ సంఘం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధాన డిమాండ్ గా స్వీకరించి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి పూనుకున్నది.

      ఏ ఎన్నికలలో నైనా మెజారిటీ ఓటర్లు బీసీలే .రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల పైచిలుకు కుటుంబాలు ఉంటే ఓట్ల సమయంలో మాత్రమే వాడుకుని అధికారానికి దూరంగా ఉంచడమే కాకుండా సమర్ధులు అయినటువంటి బిసి ఐఏఎస్, తదితర అధికారులకు ప్రాధాన్యత లేని శాఖలు ఇస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య విమర్శిస్తూ ప్రభుత్వాన్ని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

        ఒక వర్గాన్ని మచ్చిక చేసుకొని లబ్ధి పొందాలనుకోవడం ప్రభుత్వానికి తగదు. నిజంగా చెప్పాలంటే అన్ని వర్గాలకు కూడా చిత్తశుద్ధిగా మేలు చేసింది అంతంత మాత్రమే. అందుకే ఇవ్వాళ దళిత బందును ప్రకటించగానే కులాల వారీగా, మతాల వారీగా బీసీ బంధు, ఆదివాసి బంధు, గిరిజన బంధు, మైనారిటీ బంధు వంటి అనేక వర్గాలకు ఆర్థిక సహకారాన్ని దళిత బందు లాగా కొనసాగించాలని డిమాండ్లు రావడం పాలకులు ఇంత కాలం ఏ వర్గాల ప్రయోజనం కోసం పని చేశారో ఒకసారి గమనించవచ్చు. ఇప్పటికైనా ఎస్సీ సబ్ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్, బీసీ సబ్ ప్లాన్ వంటి పథకాలను నిరంతరము కొనసాగిస్తూ ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలకు కూడా మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలి. ప్రధానంగా భూమి లేని వర్గాలకు ప్రభుత్వం భూసంస్కరణలను కచ్చితంగా అమలు చేసి భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన దళితులకు 3 ఎకరాల భూమి మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. అయినా దళిత బందు పేరున కోట్లాది రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అన్న మాటను ఏరకంగా నమ్ముతున్నారు? అంతకంటే ముందు ప్రధానమైనటువంటి వాగ్దానం దళితుడిని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? ఎప్పుడైనా సీరియస్గా ప్రశ్నించారా? దళిత బందు ప్రకటించగానే ఈ ప్రధాన డిమాండ్లను ఎందుకు విస్మరించారు? ఇది కేవలం దళితులకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు తెలంగాణ సమాజం ముందు ఉన్నటువంటి చెల్లని వాగ్దానాలు. అమలు కాని హామీలు. నమ్మించి గొంతు కోసిన చేదు నిజాలు.


చివరగా....

ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితిని ప్రభుత్వం ప్రజల కోణంలో ఆలోచించకపోతే వైఫల్యాలను అంగీకరించడంతో పాటు చిక్కుల్లో పడక తప్పదు. అదే సందర్భంలో సమాజంలోని భిన్న వర్గాలు కులాలు వర్గాలు మతాలుగా  చీలిపోకుండా ఉమ్మడి ప్రయోజనం కోసం సమైక్యంగా ఉద్యమించే ప్రత్యామ్నాయ సంస్కృతి ప్రజలలో రావాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. తద్వారా ఉద్యమ శక్తిని ప్రదర్శించడంతో పాటు న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసినట్ల యితేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి ఇది చరిత్ర చెప్పిన సత్యం.

( వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లా)

0/Post a Comment/Comments