విశ్వకవి రవీంద్రుడతను...!
_కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ) ఖమ్మం
చరవాణి:7032504646
వంగ దేశంలో శారదాదేవి దేవేంద్రనాద్ ఠాగూర్ ల పుణ్య ఫలమతను
ఆముదం దీపం ముందు కళ్లోత్తు కుంటూ కునికిపాట్లు పడుతూ చదివిన జ్ఞాన దీపమతను
తెల్లవారగానే ప్రకృతిని పలకరించే సౌందర్య బింబమతను
ఇల్లే విద్యాలయంగ నెంచి క్రమ శిక్షణతో విద్య నేర్చిన విశ్వ గురువతను...!
అంబరమంత నిడారంబరంగ ఎదిగిన భారత కీర్తి కిరీటమతను
ప్రపంచ మొక రహస్యమనీ శోధించి సాధించిన అన్వేషతను
కాళిదాసు షేక్స్పియర్ ల రచనలను ఒంట బట్టించుకున్న విక్రమార్కుడతను
మాతృ భాష పట్ల ప్రేమ చాటిన అభిమానదనుడతను ...!
బాల్యంలోనే పద్య గద్య విమర్శలను ప్రచురించిన కవీంద్రుడతను
బంకించంద్ర చటర్జి చే ప్రశంశలు పొందిన ప్రభాకరుడతను
భక్తి గీతాలను ఆంగ్లం లోకి అనువదించిన గీతాంజలి కృతి కర్త అతను
విగ్నే రేర్ స్వప్న భంగ ,సంగీత ప్రభాత కావ్యాల గ్రంథ నిధియతను...!
బాలల హృదయాలు వికసింప చేసిన శాంతినీకేతన కలువరేడతను
గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని శ్రీకేతనాన్ని స్థాపించిన సామాజిక శాస్త్రవేత్త అతను
మతాలు వేరైనా కలిసి ఉండాలనే సందేశమిచ్చిన మానవతావాది అతను
స్వాతంత్ర్య సమరంలో వెనుదిరగని మేరు నగదీరుడతను ...!
ప్రేమ భావాన్ని , మార్మికత ను నింపుకున్న కవన శిఖరమతను
కవిత్వమనే ఎల్లలు లేని హృదయ భాషకు దార్శనికుడతను
భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన జయ కేతనమతను
గీతాంజలికి నోబెల్ గంధ మద్ది జగానికందించిన విశ్వ కవి రవీంద్రుడతను...!