నేను ఓ మామూలు ఆడపిల్లని -- దొడ్డపనేని శ్రీ విద్య, విజయవాడ.

నేను ఓ మామూలు ఆడపిల్లని -- దొడ్డపనేని శ్రీ విద్య, విజయవాడ.

దొడ్డపనేని శ్రీ విద్య
నేను ఓ ఆడపిల్లని

నేను ఓ మామూలు ఆడపిల్లని
పుట్టుకతో నాకు సంబంధం లేదు
అందులో నా ప్రమేయం లేదు
వేయి జన్మల పుణ్యఫలం అన్నారు
వివక్షలో మాత్రం వెనక్కు  నెట్టారు
అయినా నేను తల్లి చాటు ఓ ఆడపిల్లని

దైర్యంతో అడుగు ముందుకు వేసాను
వెల కట్టలేని వజ్రం అన్నారు
ఇంటికి అందం ఆడపిల్ల అన్నారు
స్వతంత్ర్యం గా పట్టుదల తో ఎదిగాను
అయినా నేను తండ్రి చాటు ఓ ఆడపిల్లని

ఎన్నో ఆశయాలను కలగన్నాను
ఓర్పుతో, నేర్పుతో అన్నీ సాధించాను
ఎన్నో పోరాటాలు సాగించాను
మరెన్నో అవాంతరాలను ఎదుర్కోన్నాను
అయినా నేను అన్న చాటు ఓ ఆడపిల్లని

ఎన్నో రంగాల్లో రాణించి మెప్పించాను
ఎన్నెన్నో సదస్సుల్లో గళం విప్పి గర్జించాను.
మరెన్నో అవమానాలను గొంతులో అణగదొక్కుకున్నాను
అకృత్యపు సమాజంలో ఆహుతి అయ్యాను
అయినా నేను అక్క చాటు ఓ ఆడపిల్లని

ఆడపిల్లని కన్నానని అవహేళన చేశారు
ఉద్యోగం చేసి డబ్బులు తెమ్మన్నారు.
అర్ధరాత్రి  నీకేం పని హెచ్చరిస్తున్నారు
ఆర్థికంగా ఎంతో ముందంజ వేసాను
అయినా నేను భర్త చాటు ఓ ఆడపిల్లని

మాటల తూటాల తోటి పోరాటం చేస్తాను
జీవితపు గెలుపు బాటలో సంతకం చేస్తాను
ఆత్మ విశ్వాసంతో కష్టాలకు ఎదురీదుతాను
విలువలతో వ్యక్తిత్వంను  నిలబెట్టుకుంటాను
అయినా నేను కొడుకు చాటు ఓ ఆడపిల్లని

సృష్టికి ప్రతి సృష్టి చేస్తాను
కన్నీళ్ళు, కలతలు నా చిరునామా అంటాను
హక్కుల్లో సమానం అని చాటాను
ఆటుపోట్లు కి తలఒగ్గను అని తల ఎత్తాను
అయినా నేను మగాడి చాటు ఓ ఆడపిల్లని

అజమాయిషీ తో కాదు
ఆప్యాయంగా చూడండి
అధికారం తో కాదు అభిమానం గా చూడండి అర్ధమవుతాను
అయినా నేను ఓ మామూలు ఆడపిల్లని

దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ
07/09/2021

0/Post a Comment/Comments