కవినై నిలుస్తా...!
-కొంపెల్లి రామయ్య (ఖమ్మం)
నా గమనం నీలిమేఘాల అక్షరాల చినుకులై వర్షిస్తే ...
ఎడారి మస్తిష్క మైదానంలో చైతన్య విత్తులై మొలకెత్తుతా!
నా గమనం పలకరింపుల పులకరింపులైతే ...
ప్రకృతి సమస్తం అక్షరాల పూదోటై పరిమళిస్తా!
నా గమనం హద్దులు లేని ఆకాశమైతే...
అష్టదిక్కుల బంధించి అక్షర తాండవం చేస్తా!
నా గమనం మహాప్రస్థానం అయితే...
చీకటి జీవితాల్లో వెలుగు రేఖనై ప్రసరిస్తా !
నా గమనం అన్వేషణ అయితే...
నింగి నేలను ఏకం చేసే వారధినౌతా!
నా గమనం పద చిత్రాల అడుగుజాడలైతే ...
కావ్య కన్యక పట్టు పరికిణీ యై అందాన్నౌతా!
నా గమనం గమ్యం చేరే పయనం అయితే...
విశ్వమంత సృజననై నిరంతర సాధననౌతా!
నా గమనం కవన వనమై పల్లవిస్తే ....
పాఠకుల హృదయాల్లో కవినై నిలుస్తా...!