(9.సెప్టెంబర్ ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా..)
కాలమంత కవి కాళోజీ
---గుండేటి యోగేశ్వేర్
కష్టజీవులకు కచ్చితంగా న్యాయం జరగాలని..
సూటిగా ఘాటుగా అన్యాయంపై ఎక్కుపెట్టి..
అవిశ్రాంతంగా పోరాడిన అక్షర బాణం నీవు..
కాలంతో కలిసి నడిపించిన కలం వీరుని నీవు.
చెప్పిందే చేసి చేసిందే చెప్పి..
అన్యాయం ఎక్కడ జరిగినా ఎదురొడ్డి పోరాడి..
జనం కోసమే జీవించావు..
తెలంగాణ యాస కోసమే శ్వాసించావు.
తడారని ఉద్యమ సిరాల ప్రవహించిన నీ రక్తం..
ఇప్పుడు కోట్లాది ప్రజల రక్తనాళాల్లో చేరి
బంగారు తెలంగాణ కోసం బాటలు వేయాలని
హిమోగ్లోబిన్ లా శ్వాసిస్తున్నది.
తెలంగాణ మదిని వదిలి ఎక్కడికి పోలేవు కాళన్నా..
నీకోసమే తయారు చేసినట్లుండే
ముచ్చటైన కళ్ళజోడు..
పర్యావరణ మిత్ర బట్టసంచి, చేతి కర్ర..
హస్తభూషణం కనిపించే గన్నులాంటి పెన్ను..
ఆడంబరాలకు ఆమడ దూరంలో ఉండే
నికార్సైన నిలువెత్తు సాదా సీదా రూపం..
ఋషిలా తెలంగాణ మహర్షిలా సాహిత్య శిఖరంలా..
కమనీయ కవిగా కవిగా కలకాలం
కనబడుతూనే ఉంటావు..
చాపలో కూర్చుని కాగితాలపై
కలం సేద్యం చేస్తున్నట్టే ఉంటావు.
పుటుక నీది చావు నీది
బతుకంతా తెలంగాణది.. అన్న నీవు
మా గుండెల్లో గూడు కట్టుకునే ఉంటావు..
కాలం ఉన్నంతకాలం యాది ఉండేలా..
మా మనసులో మనాధి వై
నరనరాల్లో నారాయణడవై ఉంటావు...
కా..ళో..జీ అంటే ఉన్నంతకాలం లొల్లిజేసెందుకు..
జీవించే కలంలా కాళన్నగా కవులకు అన్నగా..
మరణం లేని మహా మనిషిగా
తెలంగాణ జగత్తులో ఉంటావు.
రచయిత: గుండేటి యోగేశ్వర్,
రాష్ట్రపతి అవార్డు గ్రహీత,
మంచిర్యాల, 9849 254747.
Post a Comment