భక్త పోతన(ఇష్టపది మాలిక) -డాక్టర్ అడిగొప్పుల సదయ్య

భక్త పోతన(ఇష్టపది మాలిక) -డాక్టర్ అడిగొప్పుల సదయ్య

01.
సహజ పాండిత్యుండు సాహితీ కర్షకుడు
సంస్కృతాంధ్రములను సరిగ తూచినవాడు

లక్కమ్మ కేసనల లక్ష్మీ ప్రసాదుండు
పోతన్న పేరుతో పుడమినేలినవాడు

హలముతో కావ్యముల పొలము దున్నినవాడు
కలముతో పంటలకు బలమునిచ్చినవాడు

రాజుకీయక కృతిని రాముకిచ్చినవాడు
తెలగాణ కవితనము తెగువజూపినవాడు

02.
భక్తిరస సాగరము ముక్తి ప్రదాయకము
లలిత పద బంధురము జ్వలిత పద మందిరము

స్కంధమూలములతో అందముగ విలసిల్లు
వ్యాస భాగవతమును ఈశుడే తనచేత

రాయించ తలచెనని రంజిల్లు హృదయమున
రచియించి యర్పించె రామపాదాబ్జముల

విష్ణు కథ వాహికల ఇక్షురసముల నింపి 
తెలుగు వారల మదుల పొలములకు మళ్ళించి...

03.
నూనూగు మీసాల నూత్న యవ్వనములో 
భోగినీ దండకము బొగిడె సింగన చెలిని

శివభక్తుడై మొదట శివలీలలను తెలుపు
వీరభద్ర విజయము విరచించె విపులముగ

జన్మ సాఫల్యతకు తన్మయత్వము నొంది
నారాయణ శతకము నయముగను రచియించె

పండితుల పామరుల గుండియలు మోగించి
భాగవత లీలలను బహుళముగ కీర్తించె

కవనశ్రీ చక్రవర్తి
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
ఊరు: జమ్మికుంట,కరీంనగర్ 
చరవాణి: 9963991125

హామీ పత్రము:
పై ఇష్టపదులు నాస్వంతము.దేనికి అనుకరణ గానీ,అనువాదము గానీ కావు.ఏ ఇతర మాధ్యమములకు పంపలేదని హామీ ఇస్తున్నాను.

డా॥అడిగొప్పుల సదయ్య


0/Post a Comment/Comments