శార్దూలముII
అమ్మానీ! చరణమ్మునమ్మ సతతంబానంద సౌఖ్యంబులే!
అమ్మానీ! వదనంబుఁజూడ గలున్నాయోగ ధీభాగ్యముల్!
అమ్మా నీ! స్మరణంబు నిచ్చుఁ శుభమౌ నైశ్వర్యమై విద్యగా!
అమ్మా! నాతొలి వృత్తపద్యమిదుగో యాశీస్సులందించుమా!!
కందముII
తల్లీ! భారతీ! నినునా
యుల్లము నందున నిలిపితిఁ యూపిరి గానున్!
తల్లీ! నిన్నే! కొలుతును
చల్లగజూడుము నిరతము సరసిజనేత్రీ!!
కందముII
కరమున కచ్ఛపిమీటగ
స్వరముల విద్యాస్రవంతి వసుధకు చేరున్!
వరమై నుర్విన జనులకు
సిరులొసగే విద్యతోడ శ్రీశార్వాణీ!!
కందముII
అమ్మా! విరించిరాణీ!
యిమ్ముగ ప్రజగొలుతురమ్మ నిమ్మహిలోనన్!
అమ్మా! విద్యావాణీ!
కమ్మని చదువొసగుతల్లి కామితవరదా!!
తేటగీతిII
బ్రహ్మకిల్లాలివే! నీవు భారతాంబ
జిహ్వపై నుండి నటియించు చేరికొలుతుఁ
శారదాంబ సరస్వతీ! చదువులమ్మ
సారమతులెల్ల నిత్యము సన్నుతించు.
ఆటవెలదిII
ధాతహృదయరాణి ధవళంపు వలువతో!
కలువపీఠమునను కొలువుదీరె!
చలువ కనులవాణి సంపెంగపూబోణి
విలువ నొసగుచుండు విద్యలందు.
--------------------------------------------
రచన: రఘుపాత్రుని. సాయిశివ
బి.ఏ (స్పెషల్ తెలుగు) ద్వితీయసంవత్సరము
పలాస మండలం, శ్రీకాకుళం జిల్లా, బ్రాహ్మణతర్లా గ్రామం.
చరవాణి: 9493316130.