నాలో ఏదో మార్పు...
నేను ముందులా లేనట్టు..
గతంలోని నాకు వర్తమానంలోని నాకు తేడా స్పష్టంగా కనిపిస్తుంది..
వయసు మీరిందా..?
మనసే స్తబ్దంగా మారిందా..?
ఏదో అలజడి మాత్రం జరుగుతోంది..
అదేంటో నాబుర్రకు తట్టక నిద్రను దూరం చేస్తోంది..
గతంలో నాలో ఎన్నో ప్రశ్నలు..
సరియగు సమాధానంకై మెదడంతా కుతకుతలు..
నాకు నేనుగా రాసేందుకు ఎన్నో కళ్ళముందు కదలాడే అంశాలు...
రాసే ఓపిక,సమయం లేక వదిలినవి ఎన్నో ...
ఇప్పుడు తీరిక దొరికి రోజూ రాద్దామనుకుంటే..
గతంలో కదలాడిన ఆ అంశాలేవి...?
నాతో దోబూచులాడిన ఆ ప్రశ్నలేవి..?
రోజూ అంశానికై ఎదిరి చూడడం..
ఇచ్చిన దానిపైనే ఆలోచించడం...
ఇదేంటి..?
ఇలా మారానేమిటి..?
కొత్తగా నాలో అన్వేషించే శక్తి కొరవడిందా..?
అలసిన మెదడు ప్రశాంతత కోరుతుందా..?
మనకెందుకులే ఆ శ్రమంటూ సేదదీరుతుందా..?
ఇచ్ఛేవాళ్ళున్నారుగా నీకెందుకింకా ఉబలాటమని కసురుతుందా..?
ఏమో..!
జవాబుకై వెదికే ఉత్సాహం కూడా కొరవడిందేమో..
నాకేం ఇలా జరుగుతోందా..
అని మొహం వేలాడేసుకొని దర్పణంలో చూస్తే..
అదేంటి..
పగలబడి నవ్వుతోంది నా ప్రతిబింబం....!
... *జీవి*
గుర్రాల వేంకటేశ్వర్లు
ఆసిఫాబాద్
94909 18014.