పద్యాల పూదండలు(ఆటవెలది పద్యాలు)-గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు

పద్యాల పూదండలు(ఆటవెలది పద్యాలు)-గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు

పద్యాల  పూదండలు
(ఆటవెలది పద్యాలు)
--------------------------------------
కప్ప వచ్చు మనిషి కనులు తప్పులు జేసీ
దాచ లేవు నెపుడు ధరణి యందు
సకల సృష్టి కర్త సర్వ వేళల జూచు
సోమ నాఖ్యుమాట సొంపులమరు
 
అహము పెరిగినేని నంతము జేయును
కుదుపు జీవితమును కూల్చి వేయు
వినయ గుణము మేలు విజయము చేకూర్చు
సోమ నాఖ్యుమాట సొంపులమరు
 
కట్టి వేయవచ్చు గడ్డి పోచలు పేని
కండలు బలము గల్గు గజమునైన
గుండె బలము మిన్న  గుర్తుపెట్టుకొనుము 
సోమ నాఖ్యుమాట సొంపులమరు
 
తరులు తరిగిపోయె కరువులధిక మాయె
తల్లిడిల్లిపోయె తల్లి పుడమి
మొక్కలిలను నాటి చక్కదనము పంచు
సోమ నాఖ్యుమాట సొంపులమరు
 
బుద్ధి మంచిదైన వృద్ధి జరుగునోయి
తేటగీతి వోలె తేజరిల్లు
మెండు శుభములొసగు నిండు పౌర్ణమి రీతి
 సోమ నాఖ్యుమాట సొంపులమరు
 
మరువకోయి మహిని మంచి చేసిన వాని
గుర్తు చేసుకొనుము గుండె లోన
వమ్ము చేయకోయి నమ్మిన మిత్రుని
సోమ నాఖ్యుమాట సొంపులమరు

నీతి యున్న బ్రతుకు జ్యోతి వోలె వెలుగు
స్ఫూర్తి నొసగి భువిని  కీర్తి గాంచు
రవి కిరణము రీతి రాణించు నుర్విలో
సోమ నాఖ్యుమాట సొంపులమరు

జిహ్వ దాటు పలుకు జీవితాలను కూల్చు
కారు చిచ్చు వోలె కాల్చి వేయు
చేటు కలుగజేయు మాటువేసి మహిని
సోమ నాఖ్యుమాట సొంపులమరు

-గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు

0/Post a Comment/Comments