గురువు(ఇష్టపది మాలిక) -డాక్టర్ అడిగొప్పుల సదయ్య

గురువు(ఇష్టపది మాలిక) -డాక్టర్ అడిగొప్పుల సదయ్య

గురువు

గురువు బ్రహ్మయు కాడు,గురువు విష్ణువు కాడు
గురువు శివుడే కాడు కుదియించబడె నేడు

గురువు సేవకుడయ్యె గురుత జీవికయయ్యె
గురువంటె సంఘమున కొరగాని కొరకయ్యె

చరవాణి తెరపైన చరియించె గురుతనము
చదువులే చెదబట్టె,పదవినే చెరబెట్టె 

గూగులే గురువయ్యె, బ్లాగులే బుక్సయ్యె
చాటింగు,మీటింగు చట్టుబండలెయయ్యె

బడిలోని బోధనల పరిమళము వాడుపడె
బడులన్ని తడిలేని వసతులై బీడుపడె

ఉత్తమోత్తమ పదవి ఉత్తదై దిగజారె
ఎత్తైన యాపీఠమెక్కశక్యము కాదె!

గూగుళ్ళు,లోగిళ్ళు గురువులెప్పుడు కావు
వాట్సపులు,జూములూ బడులయ్యి నిలువవూ

పుడమిపై గురుపదవి పూజ్యమెప్పుడు కాదో
పాఠశాలల పాసి ప్రజలెప్పుడుంటారొ

అజ్ఞానమలముకొని అఖిలదేశములన్ని
మునిగి నాశనమౌను మున్నీటి తమసులో....

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
నిఘంటువు
గురుత =గురుత్వము
జీవిక = బ్రతుకు తెరువు
వాడుపడె =వాడిపోయెను
బీడుపడె=పనిలేనివయ్యె/పాడయ్యె
పాసి =విడిచి
మున్నీరు =సముద్రం
తమస్సు = చీకటి
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

కవనశ్రీ చక్రవర్తి
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
9963991125


0/Post a Comment/Comments