గానగంధర్వుడు మన బాలు...
అంటారు "స్వరం భగవంతుని వరం" అని
ఆవరాన్ని పొంది తనగొంతులో అమృతాన్ని
నింపుకున్న గానగంధర్వుడు మన బాలు
ప్రతినిత్యం టీవీలో దర్శనమిస్తూ
ప్రముఖుల మన్ననలు పొందినవాడు
విశిష్టమైన వ్యక్తిత్వం గల"వినోదాలరేడు"
కంటికి కనిపించిన ప్రతివారిని
చెదరని చిరునవ్వుతో ఎంతో
ఆప్యాయతతో ప్రేమతో పలకరించే
మంచి మనసున్న "మహనీయుడు"
ఏవేడుకకైనా ఏ వేదికైనా ఏ సంగీతసభకైనా
బాలు ఒక నిండుదనం ఒక "అట్రాక్షన్"
పాల్గొన్న ప్రతి ఈవెంట్ లో ఎన్నో చక్కని
మధురమైన పాటలను జనరంజకంగా పాడి ఆబాలగోపాలాన్ని అలరించే"గానగంధర్వుడు"
ప్రతి షోలో ఎన్నో నిజజీవిత నిత్యసత్యాలను
జీవితపాఠాలను అందించే కాషాయవస్త్రాలు
ధరించని ఒక "ఆధ్యాత్మిక గురువు" మనబాలు
ఎందరో ఔత్సాహిక గాయనీగాయకులను
చిత్రసీమకు పరిచయం చేసి ప్రతిభావంతులకు
కొత్తజీవితాలను ప్రసాదించిన "ఆత్మబంధువు"
సంగీతసాధనకే తన జీవితాన్ని అంకితం చేసి
అమరగాయకుడు ఘంటసాలనే మరిపించి
దక్షిణభారత చలనచిత్ర సంగీత సామ్రాజ్యాన్నేలిన
"మకుటంలేని మహారాజు"మధురగాయకుడు
కరోనా రక్కసితో పోరాడి పోరాడి
ఓడి అమరుడైన గానగంధర్వుడు
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం
గారి ఆత్మకుశాంతి చేకూరాలని కోరుతూ
అశృనయనాలతో అందిస్తున్న అక్షరనీరాజనం"
(నేడు బాలుగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా)
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502