అమరవేణి ఆటవెలదులు

అమరవేణి ఆటవెలదులు

అమరవేణి ఆటవెలదులు

రక్ష నిచ్చు వారె రాకాసి మృగమవ్వ
ఆడ బతుకు కేల అండ దొరుకు
కంచె చేను మేయ కాపేమి సేయురా!
అమరవేణి పలుకు అవని వెలుగు.

మత్తు మందు డ్రగ్గు మాసిపోయిన నాడు
మద్య మమ్మకాలు మాన్పి నపుడు
మగువ బతుకు లపుడు మనుగడ సాగించు
అమరవేణి పలుకు అవని వెలుగు.

మత్తు లోన మునిగి మనిషి మృగమౌతుండె
యిల్లు వొళ్ళు మరిచి యిరుగుతుండె
ఆడదైతె చాలు ఆకొన్న పులులైరి
అమరవేణి పలుకు అవని వెలుగు.

విలువ విద్య లేక విరిగేను యువశక్తి
కన్నవాళ్ళ శ్రద్ధ కరిగి పోవ
దురలవాట్ల భవిత దుష్ట చర్యల జేరు
అమరవేణి పలుకు అవని వెలుగు.

దొంగ కెపుడు దొడ్డ దొరలు తోడయ్యుండె
చట్టమేమొ వాళ్ళ చుట్టమాయె
పేద బతుకు లంటె పేకాట రీతాయె
అమరవేణి పలుకు అవని వెలుగు.


0/Post a Comment/Comments