విఘ్నేశ్వరుడు --వల్లంభట్ల వనజ

విఘ్నేశ్వరుడు --వల్లంభట్ల వనజ

మణి పూసలు 41--50

      విఘ్నేశ్వరుడు

పిండి చేత బొమ్మ చేసె
ప్రాణ ప్రతిష్ఠనే చేసె
పార్వతమ్మ తనయుడిని
ద్వారము కడ నుండ జేసె!

అమ్మ చేత నిలబడే
నాన్న తోటి కలబడే
కర్తవ్య నిర్వహణలో
ప్రమాదంతొ తలపడే!

హరునే యెదిరించినాడు
ప్రాణాలను వదలినాడు
పార్వతమ్మ  శివుని వేడ
గజముఖుడిగ వెలసినాడు!

గౌరి తనయ గణనాథ
గణాధ్యక్ష గణనాథ
అభయమొసగ రావయ్యా
ఆదిదేవ  గణనాథ!

విఘ్నాలకు అధిపతి
దేవగణపు దళపతి
మా పూజ లందుకొనే
అందమైన గణపతి!

ఉదయాన్నే లేచేరు
మీ పూజను చేసేరు
భక్తి తోడ మిమ్ముకొల్చి
మొక్కు లెన్నొ మొక్కేరు!

నీదు మహిమలు నమ్మి
నిండు  వెలుగులు జిమ్మి
ఆర్తిగ  మిము వేడినంత
జగతి వెలుగును సుమ్మి!

కరువు కాటకాల్ బాపుము
పాడి పంటలే నొసగుము
ప్రకృతి విలయాలనుండి
ప్రజలనెపుడు రక్షించుము!

శిస్టులను రక్షించుము
దుష్టులను శిక్షించుము
ధర్మ రక్షణమ్ము జేయ
ధరణికిపుడేతెంచుము!

వినాయకునే పెట్టిరి
నిత్య పూజలు జేసిరి
జనులంతా ఒక్కటై
ఐకమత్యము చాటిరి!

            ✍🏻వల్లంభట్ల వనజ
                    అదిలాబాద్

0/Post a Comment/Comments