పద్య పరిమళాలు
(ఆటవెలది పద్యాలు)
---------------------------------------
కలత నిదుర లేదు కష్టజీవికిలను
చంటిపాప వోలె కంటి నిదుర
భాగ్యశీలియతఁడు బాలల చందము
సోమనాఖ్యుమాట సొంపులమరు
ఊట బావిలోని యూరుచుండు జలము
సజ్జనుని పలుకులు శాంతి నొసగు
చెలిమి చేయు మేలు కలిమి సమము వారు
సోమనాఖ్యుమాట సొంపులమరు
కష్టపడిన ధనము కలకాలముండును
పుష్కలముగ వృద్ధి పుడమియందు
నంతరించునోయి నక్రమార్జన సొమ్ము
సోమనాఖ్యుమాట సొంపులమరు
సాధనమ్ము జేయ సాధ్యము కానిది
జీవితాన లేదు జీవికిలను
యోర్పుతోడ పనులు నేర్పుగ సల్పుము
సోమనాఖ్యుమాట సొంపులమరు
దైవభీతి తోడ దైనందిన బ్రతుకు
దివిని తార వోలె భువిని వెలుగు
మదిని శుద్ధిజేయ మార్గంబు ధ్యానము
సోమనాఖ్యుమాట సొంపులమరు
కవితమాలలల్లి కనువిందు జేసెద
యక్షరాలతోడ నవని యందు
తెలుగుతల్లి సేవ దినమెల్ల చేసెద
సోమనాఖ్యుమాట సొంపులమరు
కనుల నెదుట గురువు కనిపించే దైవము
సౌఖ్యమొసగువారు సఖ్యతగను
పుణ్యము దొరుకునిల పూజనీయులు కదా!
సోమ నాఖ్యుమాట సొంపులమరు
శ్రేష్ఠమైన వృత్తి శ్రేయస్సు నిచ్చును
ఘనత కలుగజేయు మనసు మురియు
గురువు వృత్తి గొప్ప పరువు బ్రతుకులోన
సోమ నాఖ్యుమాట సొంపులమరు
--గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు.