మణిపూసలు
కాళోజీ
యాసను పలుకగముద్దు
భాషకు చెరిపెను హద్దు
సమర శంఖం పూరించె
తెలంగాణ తొలి పొద్దు!
కాళోజీ కవితలను
తరచితరచి చూచినను
తెలంగాణ భాష,యాస
దివ్యముగా వెలిగేను!
ఆడంబరాలు లేనిది
అంబరాన్నే తాకేది
ఆనందపు జడిలోన
హాయిగా మురిపించేది!
బడుగు జీవికి బాసటగ
పేదలపాలి పెన్నిధిగ
ఉద్యమమ్మె ఊపిరై
కలమును ఎక్కుపెట్టెనుగ!
పదిమందీ గొడవలను
నా గొడవలో తెలిపెను
నిరంకుశ పాలనపై
నిప్పులెన్నొ చెరిగేను!
చెమ్మగిలిన నేత్రంతో
దిక్కారపూ స్వరంతో
కదిలినాడు కాళోజీ
స్వేచ్ఛయనెడు సూత్రంతో!
భాషయు నీదేదిరా
వేష మేది నీదిరా
నీ భాష నీ వేషము
మెవరి కోసమేనురా!
అన్నపు రాసులొకవైపు
ఆకలి మంటలొకవైపు
గళమెత్తిన కాళోజీ
గర్జనలు ఇంకొక వైపు!
భాష చైతన్య మూర్తి
కాళోజి కవిత స్ఫూర్తి
పదపదమున కదలాడే
మన యాసలోనియార్తి!
తెలంగాణ భాషను
తెలంగాణ యాసను
కాళోజీ కవితారస
ఝరులై ప్రవహించెను!
✍🏻వల్లంభట్ల వనజ
అదిలాబాద్