అత్తను మించిన కోడలు (మినీ కథ) - మార్గం కృష్ణ మూర్తి, హైదరాబాద్.

అత్తను మించిన కోడలు (మినీ కథ) - మార్గం కృష్ణ మూర్తి, హైదరాబాద్.మార్గం కృష్ణ మూర్తి

"ఆత్తను మించిన కోడలు"

అతనొక ప్రభుత్వ టీచర్ , పేరు పరంధామయ్య.
నివసించేది ఒక మారు మూల గ్రామంలో.
అతను రోజూ వెళ్ళే స్కూలు ,  అక్కడికి 3 కి.మీ. దూరంలో ఉంటుంది. ప్రతి రోజు ఉదయం సైకిల్ పై వెళ్ళి సాయంత్రం వరకు ఇంటికి వచ్చేవారు. అప్పటి కాలంలో అతని నెల వారి జీతం రూ.లు.200/-. అవునండి మీరు చదివింది నిజమే. అందుకే ఆ కాలంలో " బ్రతుక లేక బడి పంతులు" అనేవారు. ఎన్.టి.రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక పంతుల్ల జీతాలు పెరిగాయి , పెన్సన్లు పెరిగాయి.

అతనికి భార్య "వినయవతి" , వచ్చే అతి తక్కువ జీతాన్ని పొదుపుగా వాడుతూ ,ఇంటి పనులు సవ్యతగా చూసుకునేది. వీరికి ఒక కుమారుడు "దామోదర్".

కాలం అలా ఉన్నంతలో , హాయిగా గడుస్తుంది. అబ్బాయిని ఇంటర్మీడియట్ వరకు చదివించ గలిగారు. ఏదో ఒక ప్రయివేట్ ఉద్యోగంలో చేరాడు.

కొంత కాలానికి , అతిగా సారాయి సేవించడం వలన ,ఇతర అనారోగ్యాల వలన ఆరోగ్యం క్షీణించ సాగింది పరాంధమయ్య గారికి.

కన్న తండ్రి కండ్ల ముందే , ఆ ఒక్క కొడుకు వివాహం జరిపిస్తే బాగుంటుందని బంధువులు , మిత్రులు వత్తిడి తేవడంతో , తప్పనిసరై , అబ్బాయి వివాహాం కూడా , దగ్గరి బంధువుల అమ్మాయితో , చిన్న తనాన్నే జరిపించారు.

పరంధామయ్య గారి ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు మరింత క్షీణించ సాగింది. ఒక రోజు తెల్లవారు 3 గం.లకు , హార్ట్ అటాక్ తో తుది శ్వాస విడిచాడు.

ఇంకా అప్పటికీ రిటైర్ కానందున , ఓ రెండు సం.రాలు గడిచాక , పరాంధమయ్య గారి ఉద్యోగం , అప్పటి నిబంధనల ప్రకారం , వారి అబ్బాయి దామోధర్ కు ఇచ్చారు.

కొంత కాలానికి , దామోదర్ కు ఒక అబ్బాయి జన్మించాడు. భార్య ,తల్లి ,కొడుకు అందరూ ఒకే చోట ఉండి , ఉన్నంతలో తింటూ కలిసి మెలిసి బాగానే ఉంటున్నారు.

వారికి ఒక చిన్న ఇల్లు , కొద్దిగా భూమి ఉంటే , "వినయ వతి" కొడుకుతో విచారించి అమ్మింది . వీటికి తోడుగా భర్తకు వచ్చిన గ్రాట్యూటి డబ్బులు కలిపి పట్టణంలో కొడుకు పేరున మరో భూమి కొన్నది.

కొడుకుకు ఉద్యోగరీత్యా ట్రాన్సఫర్స్ అవుతుంటే , వేరు వేరు చోట్లకు వెలుతూ , అందరు కలిసి అన్యోన్యంగా జీవించ సాగారు.

అలా కాలం గడుస్తుండగా , కొంత కాలానికి దామోదర్ కు కూడా స్నేహితుల ద్వారా డ్రింక్ , సిగరెట్లు త్రాగడం లాంటి చెడు వ్యసనాలు అలవాటయ్యాయి. ఇంట్లో డబ్బులు ఇచ్చే వాడు కాదు. ఇంటి ఖర్చులకు డబ్బులు మిగిలేటివి కావు.

ఇంకేముంది , భార్యా భర్తల కలహాలు మొదలయ్యాయి. అలా  అలా   గొడవలు ఎంత వరకు వెళ్ళాయంటే , చిలికి చిలికి గాలి వానలా , భార్యా భర్తలు విడిగా యేండ్ల కొద్ది నివసించేంత వరకు వెళ్ళి పోయింది .

మధ్యలో ఉభయ వర్గాల పెద్ధమనుష్యులు కలుగ జేసుకుని , ఇద్దరికి నచ్చజెప్పి , భయం చెప్పి , వారి విలువ మరియు అబ్బాయి భవిష్యత్తు , కుటుంబం గౌరవం గురించి వివరించి , సహజీవనం చేయడానికి ఒప్పించడం జరిగింది. కలిసి జీవిం
చసాగారు.

నిప్పుపై నీళ్ళు పోసినంత మాత్రాన , అక్కడ వేడి చల్లారదన్నట్లు , సద్దుమనిగినట్లే సద్దుమనిగి , మల్లీ ఎవరి అహాలు వారు ,అక్కడక్కడా చూపెట్టుకుంటూనే ఉన్నారు. కోపాలు తాపాలు కొన సాగుతూనే ఉన్నాయి.

అనుకోకుండా , ఒక రోజు  త్రాగి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుండగా పడిపోయాడు దామోదర్ , కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆరోగ్యం క్షీణించో , భార్యాభర్తల కలహాలు , రంధుల కారణంగానో లేక ఆయుషు అంతవరకే ఉందో తెలియదు గాని , వెంటనే వైద్యం అందక పోవడమో , తరువాత హాస్పటల్ లో డబ్బులు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోయింది .

కొంత కాలానికి , దామోదర్ ఉద్యోగం తన కొడుకు "విహార్" డిగ్రీ చదివి ఉన్నందున , అతనికి  లభించింది.

ఇక్కడే తల్లి "వినయవతి" కి సమస్య మొదలైంది. చేసుకున్న భర్త జరిగి పోయాడు. కన్నా కొడుకూ అర్ధాంతరంగా , తనువు చాలించడం వలన "వినయవతి" కష్టాలు తారాస్థాయికి చేరాయి.

దీనికి తోడు అత్తా కోడళ్ళ మధ్య చీటికి మాటికీ ఈసడింపులు , లెక్కచేయక పోవడాలు , కుక్కకంటే హీనగా చూడటం మొదలైనాయి. ఇది కేవలం "వినయవతి" ఒక్కరి విషయంలోనే కాదు ,అనేక మంది కుటుంభాలలోనూ ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.

భర్త సంపాదించిన ఆస్తిని , దిగిపోతే వచ్చిన డబ్బుతో కొడుకు పేరున భూమి కొన్నది "వినయవతి". సాదుతాడనుకున్న కొడుకు ఇప్పుడు లేడు. అతనికి వచ్చిన డబ్బులు కోడలు తీసుకుని బ్యాంకులో వేసుకుంది. కొడుకు ఉద్యోగం కోడలు "శేర్వాని" ,తన కొడుకుకు ఇప్పించుకున్నది. కొడుకు పెన్సన్ తీసుకుంటున్నది.

అయిననూ "శేర్వాని" , అత్తను గంజిలో ఈగలా తీసిపారేస్తున్నది. చీటికి మాటికి తప్పులు వెతుకుతుంది , బంగారం పోయింది , నీవే తీసావని నింద వేసి , తీసుకెళ్ళి ఒక సామాన్యమైన వృద్ధాశ్రమంలో వేసింది. అత్తకు వచ్చే పెన్సన్ ను , అక్కడ చెల్లించేట్లు ఏర్పాట్లు చేసింది.

కొంత కాలానికి , "శేర్వాని" తన కొడుకు "విహార్ " కు ఘనంగా వివాహం చేసింది. అత్తను మాట వరసకు కూడా పిలువలేదు. "శేర్వాని" కోడలు "నిత్య", చదువుకున్నది , తెలివైనది. వారికి ఒక్కగా నొక్క కూతురు మరియు డబ్బు దండిగా ఉండటం వలన , బంగారం , డబ్బుకూడా వెంట తెచ్చింది.

అప్పుడపుడు కోడలును వెంట తీసుకుని , వృద్ధాశ్రమానికి వెళ్ళి ,అత్తకు సంబంధించిన పెన్సన్ తీసుకుని , వృద్ధాశ్రమం వారికి చెల్లించి వచ్చేది.

ఒక రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది , "మీ అత్తయ్య ఆరోగ్యం సరీగా ఉండటం లేదు , మిమ్ములను , మనువడిని కలువరిస్తున్నదని" దాని సారాంశం.

సరే అని , "శేర్వాని" , తన కొడుకును , కోడలును తీసుకుని వృద్ధాశ్రామానికి వెళ్ళింది.

అక్కడ తన అత్త "వినయవతి" , మూలుగుతూ తన మనుమడిని, మనుమరాలిని దగ్గరకు తీసుకుని , కంటనీరు పెడుతూ ,

"శేర్వానీ, నేను ఎలాగో ఎక్కువ రోజులు బ్రతుకను , చివరి దశలో నాదొక చిన్న కోరిక తీరుస్తావా బిడ్డా!" అని ధీనంగా వేడుకొంటది అత్త.

అక్కడున్న వృద్ధులూ , ఉద్యోగులు, ఆసక్తిగా చూస్తున్నారు , ఏమి అడుగుతుందాని

"చెప్పత్తయ్యా , చెప్పు ,ఏమిటీ నీ కోరిక" అంటుంది కోడలు

"నిజంగానా బిడ్డా!" అంటూ చేతిలో చేయివేయించు కుంటది "వినయవతి"

"ఏమీ లేదు బిడ్డా! నాది కేవలం చిన్న కోరికనే. ఇదేమి నీకు కష్టం కూడా కాదు. నా చిన్న నాటనే పెళ్ళి అయితే , అత్తా మామలకు సేవలు చేసాను , భర్తకు సేవ చేసాను. కొడుకును అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి , పెళ్ళి చేసాము. నా భర్త దిగి పోతే వచ్చిన డబ్బు , ఒక్క పైసా రెండు పైసలు కూడ బెట్టి సంపాదించిన భూమి అమ్మి , ఆ డబ్బుతో పట్నంలో కొడుకు పేరున జాగ కొన్న. ఆ భూమి కూడా అమ్మి డబ్బులు నీవే తీసుకున్నావు. నా కొడుకు పెన్సన్ ను తీసుకుంటున్నావు.
 నా పెన్సన్  తీసుకుని ఇక్కడ కడుతున్నావు. ఇప్పుడు నా చేతిలో ఒక్క పైసా లేదు." ఆని తన గాధ అంతా నలుగురికి, కావాలనే తెలిసేటట్లు చెప్పింది.

"ఈ సోదంతా తెలిసిందే , ఇపుడు నీ కోరిక ఏందో చెప్పు , ఇంటికి వెళ్ళాలి" అని అంటది కోడలు, విసురుగా

ఇదంతా తన కొడుకు కోడలు ఆసక్తిగా వింటూ ఉంటారు.

ఇంతలో మనుమడు కలుగ జేసుకుని
"సరే , ఏమి పర్వాలేదు , చెప్పు నానమ్మ" అని ధైర్యాన్నిస్తాడు. మనుమరాలు అలానే అంటుంది.

"నేను ఇన్ని రోజులు ఇక్కడ క్రింద పడుకుంటున్నాను.
ఎండాకాలం వస్తే గాలి అందక చాలా ఇబ్బంది పడ్డాను . చల్లటి నీళ్ళు ఇక్కడ దొరకవు. రేపు నీవు ఇబ్బంది పడకూడదనేదే నాకోరికమ్మా. అందుకని , ఒక బెడ్ , ఒక ఫ్యాను , ఒక ఫ్రిజ్ ముందే ఇక్కడ కొని పెట్టమ్మా , రేపు నీ కోడలు కూడా  నిన్ను ఇక్కడికి  పంపిస్తే , అవి లేకుంటే నీవు ఉండలేవమ్మా , నీకు కష్టం అవుతుందమ్మా" ఇదే నమ్మా నా చివరి కోరిక అని వేడుకుంటుంది.

కోడలుకు కోపం ముంచు కొస్తుంది. అక్కడున్న వారంతా నిర్ఘాంతపోతారు.


కోడలు ఇంటికి వెళ్లిందో లేదో  , నిజంగానే అత్త కన్ను మూసిందన్న వార్త   వృద్ధాశ్రమం  ద్వారా తెలుసుకుని , మళ్ళీ అక్కడికి వెళ్లి,  బాలన్స్  డబ్బులు చెల్లించి , అక్కడే   దహన కార్యక్రమాలు  నిర్వ హిస్తారు.

దశ దిన కర్మలు చేస్తారు , బొక్కలను గోదావరిలో కలుపుతారు , గుడిదర్శనాలు, పుట్టింటి  నిద్రలు అన్నీ చకా చకా సంపూర్ణమవుతాయి . 

వీరి కోడలుకు , పెళ్లి అయిన దగ్గరి నుండి ఎదో మసులు తుంది. అడుగడుగునా , ఎన్ని  ఆంక్షలు ,ఇబ్బందులు  పెట్టినా ఓర్చు కునేది . తన భర్తను తిట్టినా , లెక్కజేయక పోయినా సహించేది.

ఒక రోజు "నిత్య" గొడవను స్టార్ట్ చేసింది . కోపం తారాస్థాయికి పెరిగింది ,   రెండు అంటించి , అత్తను తీసుకెళ్ళి   అదే  వృద్ధాశ్రమలో పడేసి వచ్చింది .

"అత్తను మించిన కోడలు" అని అనిపించుకుంది

తగిన శాస్తి జరిగినట్లయింది.

- మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్

 

0/Post a Comment/Comments