చీకటి నుండి వెలుగుకు
తీసుకు పోయేవాడు!
రాయిని రత్నముగా
తీర్చిదిద్దేవాడు!
అతడేరా గురువు!
అజ్ఞానిని జ్ఞానిగా మార్చును!
విజ్ఞానానికి వారధి
కాలే కొవ్వొత్తిరా!
సుజ్ఞానపు పెన్నిధి
వెలుగిచ్చే జ్యోతిరా!
అతడేరా గురువు!
రాతిని శిల్పంగా మార్చును!
సన్మార్గము చూపించి
భవితను తీర్చిదిద్దును!
విలువలనే బోధించి
ఉన్నతుడిగా మార్చును!
అతడేరా గురువు!
మట్టిలో మాణిక్యం గుర్తించును!
అజ్ఞానపు నావికునికి
దిక్సూచియై నిలుచును!
అమావాస్య నిశీధిలో
వెన్నెలయై విరియును!
అతడేరా గురువు!
అనామకుణ్ణి ఆణిముత్యంగా మలచును!
లక్ష్యాన్ని ఛేధించుటకు
తాను గురియై నిలుచును!
విజయాన్ని సాధించుటకు
ప్రేరణ కలిగించును!
అతడేరా గురువు!
బాలలను భావిపౌరులుగా మలచును!
విశ్వానికి దేవుడైన
గురువుకు శిష్యుడే!
అపర కుబేరుడైనా
గురువుకు దాసుడే!
అతడేరా గురువు!
సకల వందితుడు!కథానాయకుడు!
ధనముతో కొనలేవు
అక్షరమైన జ్ఞానమును!
సిరులతో కొలువలేవు
అనంత విజ్ఞానమును!
గురువే అందించగలడు!
సృష్టిలోని సకల విద్యలను!
-- కాటేగారు పాండురంగ విఠల్,
హైదరాబాద్.